
తీవ్ర ఆర్థిక సమస్యలు ఎదుర్కొంటున్న పాకిస్థాన్ సరికొత్త వ్యాపార అవకాశాలపై దృష్టి పెట్టింది. చైనా కోసం గాడిదలను పెంచుతోంది. ఇందుకోసం చైనా కంపెనీ జింగ్యింగ్ పెట్టుబడులతో పెషావర్‌లో 37 మిలియన్ డాలర్లతో భారీ ప్రాజెక్టును రూపొందించింది. ఇందులో భాగంగా ఏటా 80 వేల గాడిదలను చైనాకు సరఫరా చేసేలా ఒప్పందం కుదుర్చుకుంది.
చైనాలో గాడిద మాంసానికి, ఎముకలకు మంచి డిమాండ్ ఉంటుంది. ఈ నేపథ్యంలో నెలకు 10 వేల గాడిదలను ప్రాసెస్ చేసి, మాంసం ఎగుమతులు చేయాలని నిర్ణయించినట్లు పాకిస్థాన్ ఆహార భద్రత మంత్రిత్వ శాఖ వెల్లడించింది. అయితే స్థానికంగా మాత్రం గాడిద మాంసం అమ్మకాలపై నిషేధం ఉంటుందట.
చైనాకు గాడిద మాంసాన్ని ఎగుమతి చేసేందుకు పెషావర్ వ్యవసాయ విశ్వవిద్యాలయంలో గాడిదల పెంపకానికి ఆధునిక ప్రయోగశాలలను ఏర్పాటు చేసినట్లు సమాచారం. అలాగే పాకిస్తాన్లోని వివిధ ప్రాంతాలలో 40 ప్రత్యేక పొలాలను కూడా ఏర్పాటు చేసినట్లు తెలుస్తోంది.