రాబోయే రోజుల్లో ఎంపిక చేసిన స్థలంలో బోర్లు వేయడం, ఇతర మైనింగ్ టెక్నాలజీ పద్దతుల ద్వారా భారీ స్థాయిలో శాంపిళ్లు సేకరించి మరింత పక్కాగా సమాచారాన్ని విశ్లేషిస్తారు. తద్వారా ఇక్కడ మైనింగ్ చేయడం లాభసాటి వ్యవహారమా, కాదా అన్నది నిర్ధారిస్తూ డీటైల్ట్ ప్రాజెక్ట్ రిపోర్టు సిద్ధం చేస్తారు. ఇక్కడ లాభసాటిగా తేలితే సదరు బ్లాక్‌ను నుంచి ఆర్‌ఈఈ నిక్షేపాలను ప్రభుత్వం సొంతంగా తీయడం లేదా వేలం ద్వారా ప్రైవేటు సంస్థలకు అప్పగించే నిర్ణయం తీసుకుంటారు. ఇటీవల వికారాబాద్, సంగారెడ్డి జిల్లాలో ఈ నాలుగు దశలు దాటిన మూడు బ్లాక్‌లకు వేలం నిర్వహించారు. భద్రాద్రి విషయానికి వస్తే అశ్వారావుపేట, ములకలపల్లి మండలాల్లో పాత గంగారం పేరుతో గ్రామాలు ఉన్నాయి. ఈ రెండు చోట్ల ఎక్కడ ఆర్‌ఈఈ ఆనవాళ్లు ఉన్నాయనే అంశంపై ఇంకా స్పష్టత రావాల్సి ఉంది.
సాక్షి ప్రతినిధి, భద్రాద్రి కొత్తగూడెం: ప్రపంచమంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్న రేర్ ఎర్త్ ఎలిమెంట్స్‌కు సంబంధించిన ఆనవాళ్లు ప్రకృతి సంపదకు నెలవైన జిల్లాలో వెలుగు చూశాయి. ప్రస్తుతానికి ప్రాథమిక దశలో పరిశోధనలు జరుగుతున్నాయి. ఇందులో సానుకూల ఫలితాలు వెల్లడైతే మరోసారి మైనింగ్ రంగంలో జిల్లా కీలకం కానుంది.
ప్రాథమికంగా ‘పాస్’ మార్కులే !
ఖనిజాలు, రేర్ ఎర్త్ ఎలిమెంట్స్ తదితర విషయాలను గుర్తించే క్రమాన నాలుగు దశల్లో పరిశోధనలు జరుగుతాయి. మొదటిదైన జీ 4 దశలో శాటిలైట్ చిత్రాల విశ్లేషణ, ఇతర సాంకేతిక పద్ధతులను ఉపయోగించి ఒక ప్రాంతంలో ఏ రకమైన ఖనిజ నిక్షేపాలు, ఏ స్థాయిలో ఉన్నాయనే విషయాలను నిర్ధారిస్తారు. ఈ ఫలితాల ఆధారంగా ఎంపిక చేసిన ప్రదేశంలో ఉన్న మట్టి, ఇతర శాంపిళ్లు తీసుకుని విశ్లేషిస్తారు. దీన్ని జీ 3 స్థాయిగా పరిగణిస్తుండగా.. భద్రాద్రి జిల్లాలోని పాత గంగారం దగ్గర సేకరించిన శాంపిళ్లలో టోటల్ రేర్ ఎర్త్ ఎలిమెంట్స్ (టీఆర్‌ఈఈ) 746 పీపీఎం (పార్ట్స్ పర్ మిలియన్) ఉన్నట్టు తేలింది. పీపీఎం 500 కంటే ఎక్కువగా ఉన్నందున తదుపరి దశకు వెళ్లొచ్చని భావిస్తారు.
మణుగూరు – మన్మోహన్ వర్సిటీ
గోదావరి – ప్రాణహిత నదిలోయ ప్రాంతంలో రేర్ ఎర్త్ ఎలిమెంట్లకు సంబంధించిన ఆనవాళ్లు ఉన్నట్టు గతంలోనే సింగరేణి సంస్థ గుర్తించింది. రామగుండం, పెద్దపల్లి, మణుగూరు ఏరియాల్లో ఓపెన్‌కాస్ట్ గనుల నుంచి సేకరించిన మట్టి నమూనాలు పరిశీలించగా ఈ విషయం వెల్లడైంది. దీంతో ఆర్‌ఈఈ మైనింగ్‌పై మరిన్ని వివరాలు సేకరించేందుకు కొత్తగూడెంలో రేర్ ఎర్త్ ఎలిమెంట్స్ ల్యాబ్‌ను ఇటీవల సింగరేణి ప్రారంభించింది. ఈ అంశంపై కలిసి పని చేసేందుకు ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మినరల్స్, మెటీరియల్ టెక్నాలజీ – భువనేశ్వర్, కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్, ఇండస్ట్రియల్ రీసెర్చ్ (సీఎస్‌ఐఆర్) వంటి ప్రతిష్టాత్మక సంస్థలతో ఒప్పందం చేసుకుంది. మరోవైపు మైనింగ్ రంగంలో ఉన్న భవిష్యత్ దృష్ట్యా రాష్ట్ర ప్రభుత్వం డాక్టర్ మన్మోహన్‌సింగ్ ఎర్త్ సైన్సెస్ యూనివర్సిటీని కొత్తగూడెంలో స్థాపించింది. ఈ తరుణాన జిల్లాలో అరుదైన ఆర్‌ఈఈ నిక్షేపాలు ఉన్న విషయం పార్లమెంట్ సాక్షిగా వెల్లడి కావడాన్ని కీలకంగా భావిస్తున్నారు.


