సెంట్రల్ పార్క్‌లో మొక్కలు నాటిన
కలెక్టర్ అంకిత్
చుంచుపల్లి: వన మహోత్సవంలో అందరూ బాధ్యతగా పాల్గొని మొక్కలు నాటడమే కాక సంరక్షించాలని కలెక్టర్ అంకిత్ సూచించారు. ప్రత్యేక వనమహోత్సవంలో భాగంగా కొత్తగూడెంలోని చలమల శ్రీనివాసరావు మెమోరియల్ సెంట్రల్ పార్క్‌లో మంగళవారం జిల్లా అటవీ శాఖ అధికారి సిద్ధార్థ విక్రమ్ సింగ్, కొత్తగూడెం కార్పొరేషన్ మేయర్ మూడ్ గణేష్‌తో కలిసి ఆయన మొక్కలు నాటి మాట్లాడారు. పర్యావరణ పరిరక్షణ, పచ్చదనం పెంపొందించడాన్ని బాధ్యతగా భావించి వన మహోత్సవంలో భాగస్వాములు కావాలని కోరారు. ప్రతీఒక్కరు కనీసం ఒక మొక్క నాటి అది వృక్షంగా ఎదిగే వరకు సంరక్షిస్తే పర్యావరణ పరిరక్షణలో కీలకమైన మార్పు వస్తుందని తెలిపారు.
వేగంగా ప్రాజెక్టుల భూసేకరణ
సాగునీటి ప్రాజెక్టులను పూర్తి చేసి నిర్దేశిత ఆయకట్టుకు పూర్తిస్థాయిలో సాగునీరు ఇవ్వడమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని రాష్ట్ర నీటిపారుదల, పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి తెలిపారు. ప్రాజెక్టులకు భూసేకరణ, పునరావాసం, అటవీ సమస్యల పరిష్కారంపై ఆయన హైదరాబాద్ నుంచి నిర్వహించిన వీసీలో సూచనలు చేశారు. జిల్లా నుంచి హాజరైన కలెక్టర్ అంంకిత్ మాట్లాడుతూ సాగునీటి ప్రాజెక్టులకు సంబంధించి పెండింగ్ భూసేకరణ, ఆర్‌అండ్‌ఆర్ సమస్యల పరిష్కారానికి తీసుకుంటున్న చర్యలను వివరించారు.
ఎల్‌నినో ప్రభావంపై ముందస్తు చర్యలు
ఎల్‌నినో ప్రభావం, ఈనెల 30న జరగనున్న నీట్–పీజీ ప్రవేశ పరీక్ష ఏర్పాట్లు, పర్యాటక రంగ అభివృద్ధిపై రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు మంగళవారం హైదరాబాద్ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు. ప్రత్యామ్నాయ పంటల ప్రణాళిక అమలు, నూనెగింజలు, ఉద్యాన పంటల సాగుపై అవగాహన, పరీక్ష నిర్వహణతో పాటు తెలంగాణ టూరిజం పాలసీలో భాగంగా ప్రముఖ పర్యాటక ప్రాంతాల్లో వసతుల కల్పనపై సూచనలు చేశారు. ఈ వీసీకి కలెక్టరేట్ నుంచి కలెక్టర్ అంకిత్ పాల్గొనగా.. ఆతర్వాత అధికారులతో సమావేశమై సూచనలు చేశారు. జెడ్పీ సీఈఓ నాగలక్ష్మి, సీపీఓ సునీత, డీఏఓ బాబూరావు, భూగర్భ జల శాఖ ఏడీ రమేష్, డీవైఎస్‌ఓ పరంధామరెడ్డి, డీఐఈఓ వెంకటేశ్వర్లు పాల్గొన్నారు.


