భద్రాచలం: భద్రాచలంలోని శ్రీ సీతారామచంద్రస్వామి వారి దేవస్థానంలో పవిత్రోత్సవాలు అత్యంత వైభవోపేతంగా సాగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా మంగళవారం ఆలయంలో కీలకమైన పవిత్రారోపణం ఘట్టాన్ని అర్చకులు శాస్త్రోక్తంగా, వేదమంత్రోచ్ఛరణల నడుమ నిర్వహించారు. ముందుగా ఆలయంలో వేద పండితులు వేద విన్నపాలు జరిపారు. అనంతరం రామసేవా మండపంలో స్వామివార్ల ఉత్సవమూర్తులకు 108 కలశాలతో అష్టోత్తర శతకలశాభిషేకం, సహస్ర ధారతో ప్రత్యేక స్నపన తిరుమంజనం శోభాయమానంగా నిర్వహించారు. అలాగే, స్వామికి విశేష పూజలు చేసి దివ్యహారతి సమర్పించారు.
మూలమూర్తులకు పవిత్రాల సమర్పణ
ప్రధాన ఆలయం నుంచి ఊరేగింపుగా తీసుకొచ్చినపవిత్రాలకు ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం అంతరాలయంలో మూలమూర్తులకు, ఆతర్వాత లక్ష్మీతాయారు అమ్మవారు, ఆంజనేయస్వామి, భక్తరామదాసు విగ్రహాలకు పవిత్రాలు సమర్పించారు. అంతేకాక ఆలయ ప్రాంగణం, ధ్వజస్తంభం, బలిపీఠం, సుదర్శన చక్రానికి పవిత్రాలను అలంకరించగా, అర్చకులు కూడా ధరించారు. గత ఏడాది కాలంలో రామాలయంలో జరిగిన నిత్య పూజలు, ఉత్సవాల్లో తెలియక జరిగిన పొరపాట్లు, దోషాల నివారణార్థమే ఈ పవిత్రోత్సవాలు నిర్వహించడం ఆనవాయితీగా వస్తోందని అర్చకులు వెల్లడించారు. క్రతువులో ఆలయ ప్రధాన అర్చకులు విజయరాఘవన్, కోటి రామస్వరూప్, అర్చకులు, వేద పండితులు, అధికారులతో పాటు భక్తులు పాల్గొన్నారు.
ఉత్సవమూర్తులకు స్నపన తిరుమంజనం


