ఒకేరోజు 100 స్కానింగ్‌లు | - | Sakshi
Sakshi News home page

ఒకేరోజు 100 స్కానింగ్‌లు

Aug 26 2026 12:54 AM | Updated on Aug 26 2026 12:54 AM

భద్రాచలంఅర్బన్‌: భద్రాచలం ఏరియా ఆస్పత్రి అల్ట్రాసౌండ్‌ విభాగంలో మంగళవారం ఒకేరోజు 100 స్కానింగ్‌లు నిర్వహించి రికార్డు నెలకొల్పారు. ఇందులో గర్భిణులకు సంబంధించి స్కానింగ్‌ 40, టిఫ్ఫా స్కాన్లు ఏడు ఉండగా.. ఇతర విభాగాల్లో 53 ఉన్నాయి. ఒకేరోజులో పెద్దమొత్తంలో స్కానింగ్‌ నిర్వహించడం ఇదే తొలిసారని చెబుతుండగా, రేడియాలజిస్ట్‌ నరసింహారెడ్డితో పాటు సిబ్బంది మెర్సీ, రమ్య తదితరులు పాలుపంచుకున్నారు.

ట్రైబల్‌ వెల్ఫేర్‌ కమిటీ చైర్మన్‌, సభ్యులుగా పాయం, వెంకట్రావు

భద్రాచలం: తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ ట్రైబల్‌ వెల్ఫేర్‌ కమిటీ చైర్మన్‌గా పినపాక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు, సభ్యుడిగా భద్రాచలం ఎమ్మెల్యే డాక్టర్‌ తెల్లం వెంకట్రావు నియమితులయ్యారు. గిరిజనుల సంక్షేమం, సమస్యలపై అసెంబ్లీలో చర్చించేందుకు గాను ఏర్పాటు చేసిన ఈ కమిటీలో జిల్లా నుంచి ఇద్దరికి స్థానం దక్కింది. చైర్మన్‌గా పాయం, సభ్యుడిగా వెంకట్రావుకు స్థానం దక్కడంపై గిరిజన సంఘాల ప్రతినిధులు, కాంగ్రెస్‌ నాయకులు శుభాకాంక్షలు తెలిపారు.

పోలీసు అభ్యర్థులకు ఉచిత శిక్షణ

చుంచుపల్లి: పోలీసు, ఎస్‌పీఎఫ్‌, జైళ్లు, అగ్నిమాపక శాఖల్లో ఉద్యోగుల భర్తీకి ప్రభుత్వం నోటిఫికేషన్‌ జారీ చేసిన నేపథ్యాన జిల్లా నిరుద్యోగ అభ్యర్థులకు పోలీసు శాఖ ఆధ్వర్యాన ఉచిత సెమీ రెసిడెన్షియల్‌ శిక్షణ ఇవ్వనున్నట్లు ఎస్పీ రోహిత్‌రాజు తెలిపారు. గ్రామీణ, గిరిజన, మారుమూల ప్రాంతాలకు చెందిన పేద యువతీ, యువకులకు మధ్యాహ్న భోజనం సమకూర్చడమే కాక అనుభవజ్ఞులైన అధ్యాపకులతో రాత పరీక్షకు, పోలీసు అధికారుల పర్యవేక్షణలో ఈవెంట్లలో శిక్షణ ఇప్పిస్తామని పేర్కొన్నారు. ఆసక్తి ఉన్న అభ్యర్థులు ఈనెల 31వ తేదీలోగా స్టడీ సర్టిఫికెట్లు, ఆధార్‌ కార్డు జిరాక్స్‌ జత చేసి దరఖాస్తులు సమర్పించాలని తెలిపారు. దరఖాస్తుదారులకు వచ్చే నెల 6న ఆదివారం కొత్తగూడెం, పాల్వంచ, ఇల్లెందు, భద్రాచలం, మణుగూరులో ప్రత్యేక స్క్రీనింగ్‌ టెస్ట్‌ నిర్వహించి ప్రతిభావంతులను శిక్షణకు ఎంపిక చేస్తామని, వివరాలకు ఎస్‌బీ ఇన్‌స్పెక్టర్‌ శ్రీనివాస్‌(సెల్‌ 87126 82013)ను సంప్రదించాలని ఎస్పీ ఓ ప్రకటనలో సూచించారు.

ప్రత్యామ్నాయ భూమి కోసం పరిశీలన

జూలూరుపాడు: మండలంలోని రెవెన్యూ శాఖకు సంబంధించిన భూములను కేంద్రప్రభుత్వానికి చెందిన సీనియర్‌ ఐఎఫ్‌ఎస్‌ అధికారి రంగస్వామి, డీఎఫ్‌ఓ సిద్ధార్థ విక్రమ్‌సింగ్‌ మంగళవారం పరిశీలించారు. జూలూరుపాడు, పడమటనర్సాపురం గ్రామాల్లో పర్యటించిన వారు భూముల వివరాలను తహసీల్దార్‌ శ్రీనివాస్‌ ద్వారా తెలుసుకున్నారు. ఈ సందర్భంగా డీఎఫ్‌ఓ మాట్లాడుతూ భద్రాచలం – హైదరాబాద్‌ నేషనల్‌ హైవే నిర్మాణానికి ఇల్లెందు – కొత్తగూడెం మధ్య అటవీ శాఖకు సంబంధించిన 78 హెక్టార్ల భూమి కోల్పోతున్నట్లు తెలిపారు. ఇందుకు ప్రత్యామ్నాయంగా రెవెన్యూ భూమి ఇవ్వనుండడంతో పరిశీలిస్తున్నట్లు చెప్పారు. పూర్తి వివరాలతో నివేదిక ఇచ్చాక, కేంద్ర ప్రభుత్వం నుంచి హైవేకు అనుమతి లభిస్తుందని తెలిపారు. కాగా, భద్రాచలం నుంచి హైదరాబాద్‌ మధ్య నూతన రహదారి నిర్మాణంతో 35 కి.మీ..దూరం తగ్గుతుందని డీఎఫ్‌ఓ వెల్లడించారు.

నేడు, రేపు మెడికల్‌ బోర్డు

రుద్రంపూర్‌: కొత్తగూడెంలోని సింగరేణి ప్రధాన ఆస్పత్రిలో బుధ, గురువారం కార్పొరేట్‌ మెడికల్‌ బోర్డు నిర్వహించనున్నారు. ఇందులో బుధవారం ప్రీ బోర్డు నిర్వహించనుండగా.. కార్మికుల వైద్య పరీక్షలకు సంబంధించి నివేదికల ఆధారంగా మరుసటి రోజు నిపుణులైన వైద్యులు పరీక్షలు చేయనున్నారు. ఈ విషయాన్ని ఏఐటీయూసీ అధ్యక్షుడు వాసిరెడ్డి సీతారామయ్య మంగళవారం ఒక ప్రకటనలో వెల్లడించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement