
8 మంది మావోయిస్టుల లొంగుబాటు
కొత్తగూడెంటౌన్: ఆపరేషన్ చేయూత కార్యక్రమానికి ఆకర్షితులవుతున్న మావోయిస్టులు.. ప్రశాంత జీవితం గడిపేందుకు లొంగిపోతున్నారని ఎస్పీ రోహిత్‌రాజ్ వెల్లడించారు. మావోయిస్ట్ పార్టీకి చెందిన 8 మంది దళ సభ్యులు లొంగిపోయిన సందర్భంగా మంగళవారం తన చాంబర్‌లో ఎస్పీ విలేకరులతో మాట్లాడారు. లొంగిపోయిన వారికి ప్రభుత్వం తరఫున తక్షణ సహాయంగా ఒక్కొక్కరికీ రూ.25 వేలు అందజేసినట్లు తెలిపారు. రాష్ట్రం నుంచి 81 మంది మావోయిస్ట్ పార్టీలో పలు రాష్ట్రాల్లో సభ్యులుగా ఉన్నారన్నారు. ఛత్తీస్‌గఢ్ రాష్ట్రం బీజాపూర్ జిల్లా పోలంపల్లికి చెందిన సౌత్ సబ్ జోనల్ సప్లయింగ్ ఏసీఎం స్థాయి వేటి సోందా, అదే జిల్లా గుంజిపర్తికి చెందిన పార్టీ మహిళా సభ్యురాలు ముచ్చాకి లక్మి, గంగలూరుకు చెందిన మిలీసియా సభ్యులు ఓయం లక్ష్మణ్, పోడియం కోసా, మడవి నందు, కరం సోముడు, మడవి ఉర్రా లొంగిపోయిన వారిలో ఉన్నారని చెప్పారు. ఏడాది వివిధ హోదాల్లోని సుమారు 314 మంది మావోయిస్టులు లొంగిపోయారని, జిల్లా నుంచి ప్రస్తుతం ఐదుగురు మావోయిస్టులు పనిచేస్తున్నారని ఎస్పీ వెల్లడించారు. కార్యక్రమంలో 81, 141 బెటాలియన్ సభ్యులతో పాటు పోలీసులు పాల్గొన్నారు.