
వయోజనులకూ ఓనమాలు..
జిల్లాలో 38,310 మంది గుర్తింపు
3,810 మంది వలంటీర్ల ద్వారా శిక్షణకు ఏర్పాట్లు
స్వచ్ఛంద బోధకులను ఆహ్వానించిన విద్యాశాఖ
ఉల్లాస్ కార్యక్రమంలో భాగంగా జిల్లాలో 38,310 మంది నిరక్షరాస్యులు ఉన్నట్లు గుర్తించారు. వీరందరినీ అక్షరాస్యులుగా మార్చే క్రమాన తరగతుల ప్రారంభానికి ముందు అక్షర వికాసం(వాచకం), ఇతర బోధన సామగ్రి, సెల్ ఫోన్‌పై అవగాహన కల్పిస్తారు. అలాగే, ఉల్లాస్ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకునేలా చూస్తారు. అభ్యాసకుల కోసం డీజీహెచ్ ఉన్న వారి ఇళ్లలో చానల్ ద్వారా ప్రసారాలు అందుబాటులోకి తీసుకొచ్చారు.
కొత్తగూడెంఅర్బన్: ప్రతీ ఒక్కరికి కనీస విద్యాజ్ఞానం కలిగి ఉండాలనే ఉద్దేశంతో ఉల్లాస్ కార్యక్రమంలో భాగంగా నిరక్షరాస్యులను అక్షరాస్యులుగా తీర్చిదిద్దనున్నారు. వయోజన విద్యాశాఖ ఆధ్వర్యాన నవభారత్ సహకారంతో ఈ కార్యక్రమం త్వరలోనే ప్రారంభం కానుంది. శిక్షణ ఇచ్చేందుకు ఇప్పటికే జిల్లాలో 3,810 మంది వలంటీర్లను ఎంపిక చేసి మండలాల వారీగా శిక్షణ పూర్తి చేశారు. ప్రతీ గ్రామపంచాయతీ నుంచి ఇద్దరు రిసోర్స్‌పర్సన్లు, ఒక ఉపాధ్యాయుడికి శిక్షణ ఇవ్వగా, స్వచ్ఛందంగా బోధన చేయడానికి ముందుకొచ్చే వారికి శిక్షణ ఇస్తారు.
చదవడం.. రాయడం
ప్రత్యక్షంగానే కాక, ఆన్‌లైన్‌లోనూ నిరక్షరాస్యులకు బోధించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రాథమిక అక్షరాస్యతను పెంపొందించడం, వృత్తి, జీవన నైపుణ్యాలు మెరుగుపర్చడమే కాక చదవడం, రాయడం, అంకెలు గుర్తించడం, కనీస సామర్థ్యాలతో కూడిన లెక్కలు చేయడం వంటివి నేర్పిస్తారు. చిన్నతనం నుంచి విద్యావకాశాలు పొందని వారు, 15ఏళ్లు పైబడిన నిరక్షరాస్యులను అక్షరాస్యులుగా తీర్చిదిద్దేలా ఈ కార్యక్రమం కొనసాగుతుంది.
అనుకూలమైన ప్రదేశాల్లో...
స్వచ్ఛందంగా బోధన చేసే వారి వీలు ఆధారంగా మండలాల్లో ఎంచుకున్న ప్రభుత్వ, ప్రభుత్వేతర పాఠశాలలు, పంచాయతీ కార్యాలయాలు, కమ్యూనిటీ భవనాలు, ఉపాధ్యాయ శిక్షణా సంస్థలు, అంగన్‌వాడీ కేంద్రాలు, స్థానిక సాంస్కృతిక కేంద్రాలు, లైబ్రరీలు వినియోగించుకునే వెసులుబాటు కల్పిస్తారు. అయితే సీఎస్‌ఆర్ కింద సంబంధిత సంస్థల వారు బోధనాభ్యసన సామగ్రి, డిజిటల్ పరికరాలు, మౌలిక, సాంకేతిక సదుపాయాలు కల్పించి, అక్షరాస్యతా మేళాలు, సామాజిక చైతన్య కార్యక్రమాలు, నైపుణ్యాభివృద్ధి కార్యక్రమాలు నిర్వహిస్తారు. కాగా, అభ్యాసకులు, స్వచ్ఛంద బోధకులు ఉల్లాస్ యాప్ ద్వారా రిజిస్ట్రేషన్ చేసుకునేలా htts:/ ullas. education. gov. in/ nilp/ register వెబ్‌సైట్ అందుబాటులోకి తీసుకొచ్చారు. కాగా, స్వచ్ఛంద బోధకులకు విద్యాక్రెడిట్లును ప్రదానం చేయాలని వయోజన విద్యాశాఖ నుంచి విద్యాశాఖాధికారులకు ఆదేశాలు అందాయి. ఎనిమిదో తరగతి ఆపై చదివే వారు నిరక్షరాస్యులకు బోధన చేసే అవకాశమున్నందున ఆసక్తి ఉన్న వారు ముందుకొస్తే, వారి విద్య మెరుగుపడుతుందని భావిస్తున్నారు.
‘ఉల్లాస్’తో నిరక్షరాస్యుల్లో వెలుగులు