
భద్రాచలంలో నిమజ్జనానికి ఏర్పాట్లు
భద్రాచలంఅర్బన్: రాష్ట్రంలోని పలు ప్రాంతాల నుంచి వినాయక ప్రతిమలను భద్రాచలం వద్ద గోదావరిలో నిమజ్జనానికి భక్తులు తీసుకొస్తారు. ఈమేరకు నిమజ్జన ఘాట్‌లో ఏర్పాట్లను గురువారం ఎస్పీ రోహిత్ రాజు పరిశీలించి సూచనలు చేశారు. గోదావరిలో వరద పెరుగుతున్నందున కట్టుదిట్టమైన బందోబస్తు ఏర్పాటు చేసి భక్తులను లోపలికి అనుమతించొద్దని సూచించారు. రెస్క్యూ టీంను అందుబాటులో ఉంచాలని తెలిపారు. తొలుత ఘాట్‌ను భద్రాచలం సబ్ కలెక్టర్ మ్రినాల్ శ్రేష్ఠ, భద్రాచలం ఏఎస్పీ విక్రాంత్ కుమార్ సింగ్ సైతం పరిశీలించి ఏర్పాట్లపై సమీక్షించారు. ఇక గోదావరిలోకి భక్తులను అనుమతించబోమని వెల్లడించినందున గ్రామపంచాయతీ అధికారులు కరకట్ట మెట్ల వద్ద షవర్ ఏర్పాటుచేశారు. అలాగే, వాహనాలు దిగబడకుండా ఘాట్ వద్ద చదును చేయిస్తున్న అధికారులు బ్రిడ్జి వద్ద వీధి దీపాలకు మరమ్మతు చేయిస్తున్నారు. ఇరిగేషన్ శాఖ అధికారులు మధు, టౌన్ సీఐ నాగరాజు, ఎస్‌ఐ సతీష్ కుమార్, గ్రామ పంచాయతీ అధికారి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.

భద్రాచలంలో నిమజ్జనానికి ఏర్పాట్లు