
ఒక్క రూపాయీ రాలే !
● బుట్టదాఖలైన ఎన్నికల హామీలు ● నియోజకవర్గంలో 169 పనులకు ప్రకటించిన నిధులు రూ.14.50 కోట్లు ● భద్రాచలంలో సెంట్రల్ లైటింగ్‌కు రెండుసార్లు శంకుస్థాపన ● ఇంకా ప్రతిపాదన దశలోనే ఇంటిగ్రేటెడ్ మార్కెట్‌లు
భద్రాచలం: భద్రాచలం నియోజకవర్గానికి ఎన్నికల వేళ ఇచ్చిన అభివృద్ధి పనుల హామీలు బుట్టదాఖలే అయ్యాయి. నాటి బీఆర్‌ఎస్, నేటి కాంగ్రెస్ ప్రభుత్వాలు ఆ పనులపై చిత్తశుద్ధి చూపకపోవడంతో రూపాయి కూడా విడుదల కాలేదు. బీఆర్‌ఎస్ హయాంలో నిధుల ప్రకటనలో కీలకంగా వ్యవహరించిన నేతలే నేటి కాంగ్రెస్ ప్రభుత్వంలోనూ ఉన్నా పనులు ముందుకు సాగడం లేదు.
ఎప్పుడూ అదే నిర్లక్ష్యం..
రాష్ట్ర విభజన జరిగినప్పటి నుంచే భద్రాచలంలో అభివృద్ధి కుంటుపడింది. బీఆర్‌ఎస్ పదేళ్ల పాలనలో పట్టణాభివృద్ధిపై దృష్టి పెట్టలేదు. అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఆ పార్టీ అనేక హామీలు గుప్పించింది. ఓట్లే లక్ష్యంగా అప్పటికప్పుడు రూ.కోట్ల విలువైన పనులు చేపడతామని ప్రకటించింది. భద్రాచలం నియోజకవర్గంలోని 169 పనులకు రూ.14.50 కోట్లు ఎస్సీ, ఎస్టీ ఎస్‌డీఎఫ్ ఫండ్ ద్వారా విడుదల చేస్తున్నట్లు ఉత్తర్వులు జారీ చేసింది. భద్రాచలం, దుమ్ముగూడెం, చర్ల, వెంకటాపురం, వాజేడు మండలాల్లో పలు అభివృద్ధి పనుల వేగవంతానికి తగు చర్యలు తీసుకోవాలంటూ భద్రాద్రి, ములుగు జిల్లాల కలెక్టర్లను నాటి ప్రభుత్వ స్పెషల్ ఛీప్ సెక్రటరీ కె.రామకృష్ణారావు ఆదేశించారు.
ప్రభుత్వం మారినా నేతలు వారే..
గత అసెంబ్లీ ఎన్నికల్లో రాష్ట్రంలో బీఆర్‌ఎస్ ఓడిపోయి కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. అయితే నాడు బీఆర్‌ఎస్‌లో కీలకంగా వ్యవహరించిన మాజీ ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మీనారాయణ అనంతరం కాంగ్రెస్‌లో చేరారు. బీఆర్‌ఎస్ నుంచి ఎమ్మెల్యేగా గెలిచిన తెల్లం వెంకట్రావు నియోజకవర్గ అభివృద్ధి పేరిట కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. పార్టీలు వేరైనా నియోజకవర్గంలో ప్రాతినిధ్యం వహిస్తున్న నాయకులు వారే. అయినప్పటికీ ఎన్నికల హామీలు అమలు కావడం లేదు. ప్రస్తుత ప్రభుత్వం వచ్చి కూడా రెండేళ్లు కావొస్తున్నా మాఢ వీధుల విస్తరణ, తూరుబాక వద్ద బ్రిడ్జి నిర్మాణానికి మినహా.. మరే అభివృద్ధి పనులకూ నిధులు విడుదల కాలేదు.
..అయినా అంధకారమే
భద్రాచలంలోని చర్ల రోడ్డులో సెంట్రల్ లైటింగ్ పనులకు నాటి ప్రభుత్వం రూ.రెండు కోట్లు ప్రకటించగా.. ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చిన 2023 సెప్టెంబర్ 9వ తేదీ ఉదయమే అప్పటి రవాణా శాఖా మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్ శంకుస్థాపన చేశారు. ఆ తర్వాత కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినా పనులు ముందుకు సాగలేదు. ఈ ఏడాది జూలై 7న అవే పనులకు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు మరోసారి శంకుస్థాపన చేశారు. అయినా ఆ పనులు చేపట్టక అంధకారమే నెలకొంది. పట్టణంలోని అంబేద్కర్ సెంటర్‌లో ఈ రెండు శిలాఫలకాలు దర్శనమిస్తున్నాయి. ఇంకా ఇంటిగ్రేటెడ్ మార్కెట్‌తో పాటు పలు పనులు కూడా ప్రతిపాదనలకే పరిమితమయ్యాయి.
నియోజకవర్గంలో చేయాల్సిన పనులు..
భద్రాచలంలో ఇంటిగ్రేటెడ్ మార్కెట్ నిర్మాణానికి రూ.2 కోట్లు, ప్రధాన రహదారిపై కూనవరం – చర్ల రోడ్డులో సెంట్రల్ లైటింగ్‌కు రూ.2 కోట్లు, కాలనీల్లో అంతర్గత రోడ్ల నిర్మాణానికి మరో రూ.2 కోట్లు ప్రకటించారు.
దుమ్ముగూడెం మండలంలో రూ.1.50 కోట్ల తో రోడ్లు, డ్రెయినేజీల నిర్మించాల్సి ఉంది.
చర్ల మండలంలో రూ.50 లక్షలతో ఇంటిగ్రేటెడ్ మార్కెట్ నిర్మాణం, రోడ్లు, డ్రెయినేజీల నిర్మాణానికి రూ.కోటి విడుదల చేయాలి.
వెంకటాపురం మండలం పాత్రాపురం వద్ద బల్లకట్టు వాగుపై రోడ్ కం బ్రిడ్జికి రూ.కోటి, సెంట్రల్ లైటింగ్‌కు రూ.కోటి, ఇంటిగ్రేటెడ్ మార్కెట్‌కు రూ.50లక్షలు, రోడ్లు, ఇతర పనులకు మరో రూ.2.50కోట్లు ప్రకటించారు.
వాజేడు మండలంలో రూ.1.50 కోట్లతో అంతర్గత రోడ్లు, డ్రెయినేజీలు నిర్మించాల్సి ఉంది.

ఒక్క రూపాయీ రాలే !