
ప్రమాదాల నివారణకు చర్యలు చేపట్టాలి
మట్టి గణపతి విగ్రహాల పోస్టర్లు ఆవిష్కరణ..
సూపర్‌బజార్(కొత్తగూడెం): జిల్లాలో రోడ్డు ప్రమాదాల నివారణకు పటిష్ట చర్యలు చేపట్టాలని కలెక్టర్ జితేష్ వి పాటిల్ అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్‌లో మంగళవారం నిర్వహించిన జిల్లా స్థాయి రోడ్డు భద్రత కమిటీ సమీక్ష సమావేశంలో ఆయన మాట్లాడారు. వాహనాలు కండీషన్‌లో లేకపోవడం, అతి వేగం, డ్రైవర్ల నిర్లక్ష్యం, ట్రాఫిక్ సిగ్నళ్లు పాటించక పోవడంతో రోడ్డు ప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్నాయని, నియంత్రణకు పోలీస్, ఆర్‌అండ్‌బీ శాఖలు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. మద్యం సేవించి వాహనాలు నడిపే వారిపై కేసులు నమోదు చేసి జైలుశిక్ష పడేలా చర్యలు తీసుకోవాలన్నారు. ప్రతీ ద్విచక్ర వాహనదారుడు హెల్మెట్ ధరించేలా చూడాలని, ఈ మేరకు స్పెషల్ డ్రైవ్ చేపట్టాలని పోలీస్ శాఖను ఆదేశించారు. రోడ్లపై స్పీడ్ బ్రేకర్లు, ప్రమాద సూచికలు ఏర్పాటు చేయాలని రవాణా శాఖకు సూచించారు. రహదారుల కూడళ్లు, దాబాలు, రెస్టారెంట్లలో సీసీ కెమెరాలు ఉండేలా చర్యలు తీసుకోవాలన్నారు.
ఉత్కర్ష్ అభియాన్‌పై
అవగాహన కల్పించాలి..
మారుమూల అటవీ ప్రాంతాల గిరిజనులకు పీఎం ధర్తీ ఆబాజాన్ జాతీయ గౌరవ ఉత్కర్ష అభియాన్ పథకంపై అవగాహన కల్పించాలని, వారికి అవసరమైన మౌలిక సదుపాయాలు కల్పించేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ సంబంధిత అధికారులకు సూచించారు. కలెక్టరేట్‌లో మంగళవారం ఐటీడీఏ పీఓ బి.రాహుల్, అదనపు కలెక్టర్ డి. వేణుగోపాల్ తదితరులతో కలిసి పథకం విజయవంతానికి తీసుకోవాల్సిన కార్యాచరణపై సమావేశం నిర్వహించి ప్రతిజ్ఞ చేయించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఏజెన్సీ పరిధిలో మారుమూల గ్రామాలు ఎక్కువగా ఉన్న 19 మండలాల పరిధిలోని 134 గ్రామాల్లో ఈ పథకాన్ని పకడ్బందీగా అమలు చేసేందుకు జిల్లాస్థాయి అధికారులకు హైదరాబాద్‌లో శిక్షణ నిర్వహించారని తెలిపారు. ఆయా కార్యక్రమాల్లో ట్రెయినీ కలెక్టర్ సౌరభ్‌శర్మ, స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ విద్యాచందన, జెడ్పీ సీఈఓ నాగలక్ష్మి, డీఎంహెచ్‌ఓ జయలక్ష్మి, కాలుష్య నియంత్రణ మండలి ఇంజనీర్ బి.రవీందర్, గిరిజన సంక్షేమ ఈఈ చంద్రశేఖర్, ఆర్‌అండ్‌బీ ఈఈ వెంకటేశ్వర్లు, డీఈ నాగేశ్వరరావు, విద్యుత్ ఎస్‌ఈ మహేందర్, పీఆర్ ఈఈ శ్రీనివాసరావు, ఆర్టీఓ వెంకటరమణ, కొత్తగూడెం కార్పొరేషన్ కమిషనర్ సుజాత, ఇల్లెందు మున్సిపల్ కమిషనర్ శ్రీకాంత్, ఎన్‌హెచ్ డీఈ శైలజ, ఏపీఓ జనరల్ డేవిడ్‌రాజ్ పాల్గొన్నారు.
కాలుష్య నియంత్రణ మండలి ఆధ్వర్యంలో రూపొందించిన మట్టి గణపతి విగ్రహాల వాల్ పోస్టర్లను కలెక్టర్ జితేష్ వి పాటిల్ ఆవిష్కరించారు. బుధవారం వినాయక చవితిని పురస్కరించుకుని కొత్తగూడెం, పాల్వంచలో రెండు వేల మట్టి విగ్రహాలను ఉచితంగా పంపిణీ చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ రాష్ట్రమంతా మట్టి గణపతి విగ్రహాలను కాలుష్య నియంత్రణ మండలి ఆధ్వర్యంలో పంపిణీ చేశారని తెలిపారు.
కలెక్టర్ జితేష్ వి పాటిల్