
నేత్రపర్వంగా రామయ్య నిత్యకల్యాణం
భద్రాచలం: భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామి వారి నిత్యకల్యాణ వేడుక మంగళవారం నేత్రపర్వంగా సాగింది. తెల్లవారుజామున గర్భగుడిలో స్వామి వారికి సుప్రభాత సేవ, సేవా కాలం, ఆరాధన తదితర పూజలు చేశారు. అనంతరం బేడా మండపంలో కొలువుదీర్చి విశ్వక్సేన పూజ, పుణ్యావాచనం చేశారు. స్వామివారికి కంకణధారణ, యజ్ఞోపవీత ధారణ, అమ్మవారికి కంకణధారణ, యోక్త్రధారణ గావించి నిత్యకల్యాణ ఘట్టాన్ని ఆలయ అర్చకులు శాస్త్రోక్తంగా నిర్వహించారు. మంగళవారాన్ని పురస్కరించుకుని అభయాంజనేయ స్వామి వారికి అభిషేకం, ప్రత్యేక పూజలు చేశారు.
శ్రీరామకోటి ప్రతుల నిమజ్జనం
భద్రాచలంటౌన్: శ్రీసీతారామచంద్ర స్వామి ఆలయంలో భక్తులు సమర్చించిన శ్రీరామ కోటి ప్రతులను ఈఓ ఎల్.రమాదేవి ఆధ్వర్యాన మంగళవారం పవిత్ర గోదావరిలో నిమజ్జనం చేశారు. అనంతరం గౌతమీ నదికి ప్రత్యేక పూజలు నిర్వహించి సారే చీరె సమర్పించి, వైభవంగా నదీ హారతి ఇచ్చారు.
రామాలయ ఈఓగా దామోదర్ రావు
భద్రాచలం: భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామి దేవస్థానం నూతన కార్యనిర్వహణాధికారిగా దామోదర్ రావును ప్రభుత్వం నియమించింది. ఈ మేరకు దేవాదాయ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ శైలజా రామయ్యర్ మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. ప్రస్తుత ఈఓ రమాదేవిని పదోన్నతిపై స్పెషల్ డిప్యూటీ కలెక్టర్‌గా ఆర్‌అండ్‌బీ శాఖకు బదిలీ చేసిన విషయం తెలిసిందే. కాగా, భద్రాచలం ఆర్‌డీఓ దామోదర్‌రావుకు డిప్యూటీ కలెక్టర్‌గా పదోన్నతి కల్పించి దేవాదాయ శాఖకు పంపించారు. తాజాగా ఆయనకు ఆలయ ఈఓ బాధ్యతలు అప్పగించడంతో రమాదేవి ఆర్‌అండ్‌బీ శాఖకు వెళ్లనున్నారు. దేవస్థాన మాఢ వీధుల విస్తరణకు భూ సేకరణ, నష్ట పరిహారం పంపిణీలో దామోదర్ రావు కీలకంగా వ్యవహరించారు.
వైద్యులపై ఎమ్మెల్యే ఆగ్రహం
కొత్తగూడెంఅర్బన్: కొత్తగూడెం ప్రభుత్వాస్పత్రి వైద్యులపై ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు ఆగ్రహం వ్యక్తం చేశారు. మంగళవారం ఆస్పత్రి ప్రాంగణాన్ని తనిఖీ చేసిన ఆయన వరిసరాలు అపరిశుభ్రంగా ఉండడాన్ని గమనించి మండిపడ్డారు. ఆస్పత్రికి వచ్చే రోగుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నట్లు తన దృష్టికి వచ్చిందని, పద్ధతి మార్చుకోవాలని హెచ్చరించారు. చిన్న కేసులను కూడా ఇతర ఆస్పత్రులకు రిఫర్ చేస్తున్నట్లు ఫిర్యాదులు అందుతున్నాయని, జిల్లా ఆస్పత్రికి వచ్చే వారిని ఇతర ఆస్పత్రులకు ఎందుకు పంపిస్తున్నారని ప్రశ్నించారు. సేవా దృక్పథంతో పనిచేయాలని, మొక్కుబడి ఉద్యోగాలు చేస్తామంటే కుదరదని స్పష్టం చేశారు.
మట్టి విగ్రహాలనే వాడుదాం..
సూపర్‌బజార్(కొత్తగూడెం): మట్టి విగ్రహాలతో వినాయక చవితి జరుపుకుందామని ఎమ్మెల్యే కూనంనేని పిలుపునిచ్చారు. మున్సిపల్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో మంగళవారం పలు సెంటర్లలో ఏర్పాటు చేసిన మట్టి విగ్రహాల పంపిణీ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. పీఓపీతో తయారు చేసిన విగ్రహాలను వినియోగించొద్దని, కాలుష్య నివారణ కోసం మట్టి విగ్రహాలను పూజించాలని సూచించారు. కార్యక్రమంలో కమిషనర్ సుజాత, అధికారులు అహ్మ ద్, వీరభద్రాచారి, రంగప్రసాద్ పాల్గొన్నారు.

నేత్రపర్వంగా రామయ్య నిత్యకల్యాణం

నేత్రపర్వంగా రామయ్య నిత్యకల్యాణం