
30న సీఎం పర్యటన ఖరారు
ఎమ్మెల్యే ఆదినారాయణ వెల్లడి
చండ్రుగొండ : మండలంలోని బెండాలపాడులో ఈనెల 30న ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి పర్యటన ఖరారైందని అశ్వారావుపేట ఎమ్మెల్యే జారే ఆదినారాయణ తెలిపారు. గ్రామంలో నిర్మించిన ఇందిరమ్మ ఇళ్లను సీఎం ప్రారంభిస్తారని వెల్లడించారు. ఈ మేరకు హౌసింగ్ అధికారులతో కలిసి మంగళవారం ఆయన నిర్మాణంలో ఉన్న ఇళ్లను పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ పనులు వేగవంతం చేయాలని సూచించారు. అనంతరం చండ్రుగొండ, దామరచర్ల గ్రామాల్లో పర్యటించి హెలీప్యాడ్, సభాస్థలి పనులను తనిఖీ చేశారు. చండ్రుగొండలోని ఆశ్రమ బాలికల పాఠశాలను సందర్శించి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. బాలికలకు సరిపడా గదులు లేవని మ్యాట్రీన్ సునీత చెప్పగా ప్రతిపాదనలు సిద్ధం చేయాలని అధికారులకు సూచించారు. కార్యక్రమంలో ఎంపీడీఓ బయ్యారపు అశోక్, నాయకులు భోజ్యానాయక్, కృష్ణారెడ్డి, నల్లమోతు రమణ, పర్సా వెంకట్, బొర్రా సురేష్, ఫజల్ , ఎండీ ఇమ్రాన్ పాల్గొన్నారు.