
ఇండోర్‌లో కేఎంసీ బృందం పర్యటన
ఖమ్మంమయూరిసెంటర్: ఖమ్మంను స్వచ్ఛ నగరంగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా కేఎంసీ మేయర్ పునుకొల్లు నీరజ ఆధ్వర్యాన కార్పొరేటర్లు, అధికారుల బృందం ఇండోర్‌లో తమ పర్యటన కొనసాగించారు. ఇండోర్‌లో గురువారం మేయర్ నీరజ, డిప్యూటీ మేయర్ ఫాతిమా జోహరా ఆధ్వర్యాన పర్యటించగా.. అక్కడ ఇంటింటా చెత్త సేకరణ, చెత్త వాహనాల ట్రాకింగ్, వ్యర్థాల రీసైక్లింగ్‌పై ఆరాతీశారు. స్వచ్ఛతలో దేశంలోనే మొదటి స్థానంలో ఉన్న ఇండోర్‌లో చెత్త సేకరణకు అవలంభిస్తున్న విధానాలను అడిగి తెలుసుకున్నారు. వ్యర్థాలను సేకరించే వాహనంలో ఆరు బ్లాక్‌లు ఉండగా.. మూడు బ్లాక్‌ల్లో ఎలక్ట్రికల్, మెడికల్ వ్యర్థాలు, శానిటరీ ప్యాడ్లు సేకరిస్తామని, మరో మూడింట్లో తడి, పొడి వేరుగా చేసి సేకరించడం, ఇతర వ్యర్థాలను తీసుకుంటున్నట్లు అక్కడి అధికారులు వివరించారు. అలాగే, వ్యర్థాలన్నింటినీ రీసైక్లింగ్ యూనిట్లకు తరలిస్తామని, తడి వ్యర్థాలతో సేంద్రియ ఎరువు, బయోగ్యాస్ తయారీకి తరలిస్తున్నట్లు తెలిపారు. ప్రతీ మూడు, నాలుగు డివిజన్లను జోనల్‌గా ఏర్పాటు చేసి 30 – 40 వాహనాల చెత్త సేకరిస్తూ డివిజన్‌కు 30 మంది కార్మికులను నియమించినట్లు వెల్లడించారు. చెత్త సేకరణ బాధ్యతను ఎన్జీవోలకు అప్పగించడంతో ప్రతీ ఇంట పక్కాగా చెత్త సేకరణ జరుగుతోందని, వాహనాలను ట్రాకింగ్ చేసేందుకు ప్రత్యేక వ్యవస్థను ఏర్పాటు చేసినట్లు ఇండోర్ అధికారులు తెలిపారు. అలాగే, చెరువులు, కాల్వల ఆధునికీకరణ, రోడ్ల విస్తరణ పనులను కూడా మేయర్ బృందం పరిశీలించింది. అనంతరం ఇండోర్ మేయర్ పుష్యమిత్ర భార్గవ్‌తో భేటీ అయిన ఖమ్మం బృందం పలు అంశాలపై చర్చించారు. ఆదాయ వనరులు, వ్యయాలు, పాలన, పౌర సేవల వివరాలు ఆరా తీశారు. ఈ సందర్భంగా మేయర్ నీరజ మాట్లాడుతూ ఖమ్మం మున్సిపల్ కార్పొరేషన్‌ను స్వచ్ఛత నగరంగా తీర్చిదిద్దేందుకు అన్ని అనుకూలతలు ఉన్నాయని తెలిపారు. ఇండోర్ స్టడీ టూర్‌లో పరిశీలించిన అంశాలను ఇక్కడ అమలుకు అధికారులతో చర్చిస్తామని తెలిపారు.
వ్యర్థాల నిర్వహణ, అభివృద్ధి,
పౌర సేవలపై పరిశీలన