
కూనంనేని.. మరోసారి
రాష్ట్ర కమిటీలో
13 మందికి చోటు
● సీపీఐ రాష్ట్ర కార్యదర్శిగా రెండోసారి ఎన్నిక ● రాష్ట్ర కార్యవర్గంలో జిల్లా నేతలకు స్థానం
సూపర్‌బజార్(కొత్తగూడెం): కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు సీపీఐ రాష్ట్ర కార్యదర్శిగా రెండో సారి ఎన్నికయ్యారు. మేడ్చల్ జిల్లా గాజుల రామవరంలో పార్టీ రాష్ట్ర మహాసభలు జరుగుతుండగా శుక్రవారం రాష్ట్ర కమిటీని ఎన్నుకున్నారు. ఈమేరకు కూనంనేని మరోమారు రాష్ట్ర కార్యదర్శిగా ఎన్నికయ్యారు. ఆయన ఐదు దశాబ్ధాలుగా సీపీఐలో కీలపాత్ర పోషిస్తున్నారు. 2005 నుండి 2009 వరకు ఉమ్మడి జిల్లా కార్యదర్శిగా పనిచేశారు. 2009లో కొత్తగూడెం నియోజకవర్గం నుంచి పోటీ చేసి అప్పటి రాష్ట్ర మంత్రి వనమా వెంకటేశ్వరరావుపై విజయం సాధించి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. ఆతర్వాత 2023లో ఎన్నికల్లో బరిలోకి దిగిన కూనంనేని గెలిచారు. రాష్ట్ర కార్యదర్శిగా గత మూడేళ్లలో రంగారెడ్డి, వరంగల్, హనుమకొండ, భూపాలపల్లి, మేడ్చల్, మహబూబాబాద్ తదితర జిల్లాలో భూపోరాటాల ద్వారా పేదలకు ఇళ్ల స్థలాలు, సాగుభూముల పంపిణీలో కీలకంగా వ్యవహరించారు. రాష్ట్రంలో వామపక్షాల నుంచి ఏకై క ఎమ్మెల్యేగా కొనసాగుతున్న కూనంనేని 2023లో జరిగిన సింగరేణి గుర్తింపు సంఘం ఎన్నికల్లో సీపీఐ అనుబంధ సింగరేణి కాలరీస్ వర్కర్స్ యూనియన్ గుర్తింపు సంఘంగా విజయానికి కృషి చేశారు.
రాష్ట్ర కంట్రోల్ కమిషన్ చైర్మన్‌గా మౌలానా
ఖమ్మం మయూరిసెంటర్: సీపీఐ రాష్ట్ర కంట్రోల్ కమిషన్ చైర్మన్‌గా మహమ్మద్ మౌలానా రెండోసారి ఎన్నికయ్యారు. సీపీఐ రాష్ట్ర మహాసభల్లో ఈ ఎన్నిక జరిగింది. ఈ సందర్భంగా మౌలానా ఎన్నికపై పార్టీ రాష్ట్ర, జిల్లా నాయకులు హర్షం వ్యక్తం చేశారు.
సీపీఐ రాష్ట్ర కార్యదర్శిగా కూనంనేని సాంబశివరావు ఎన్నికవడమే కాక రాష్ట్ర కార్యవర్గంలో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా నేతలు పలువురికి స్థానం దక్కింది. జిల్లా నుంచి ముగ్గురు రాష్ట్ర కార్యవర్గ సభ్యులుగా, పది మంది రాష్ట్ర సమితిలో చోటు దక్కించుకున్నారు. సీపీఐ జిల్లా కార్యదర్శి ఎస్.కే.సాబీర్‌పాషా, నాయకులు ముత్యాలు విశ్వనాధం, కల్లూరి వెంకటేశ్వరరావు రాష్ట్ర కార్యవర్గ సభ్యులుగా ఎన్నికయ్యారు. అలాగే, రాష్ట్ర సమితి సభ్యులుగా కె.సారయ్య, మున్నా లక్ష్మీకుమారి, నరాటి ప్రసాద్, సరెడ్డి పుల్లారెడ్డి, వై.ఉదయ్‌భాస్కర్, ఎస్‌డీ.సలీం, రావులపల్లి రవికుమార్, సలిగంటి శ్రీనివాస్, చండ్ర నరేంద్రకుమార్ ఎన్నిక కాగా, సింగరేణి కాలరీస్ వర్కర్స్ యూనియన్ నుంచి మిర్యాల రంగయ్య రాష్ట్ర కంట్రోల్ కమిషన్ సభ్యుడిగా ఎన్నికయ్యారు.