
అమ్మకు ఆపద ఎదురుకావొద్దని..
● ముంపు ప్రాంతాల్లో వైద్యసిబ్బంది అప్రమత్తత ● ఏరియా ఆస్పత్రులకు గర్భిణుల తరలింపు ● ప్రసవం సమయాన ఇక్కట్లు రాకుండా జాగ్రత్తలు
కరకగూడెం: కొద్దిరోజులుగా కురుస్తున్న భారీ వర్షాలు, గోదావరికి వస్తున్న వరదతో ఏజెన్సీలోని మారుమూల గ్రామాలకు రాకపోకలు నిలిచిపోతున్నాయి. పలు చోట్ల వరదలు, వాగులు పొంగి పొర్లగా ఈ అంతరాయం ఏర్పడుతోంది. ఈ నేపథ్యాన ప్రసవానికి దగ్గరగా ఉన్న గర్భిణులను ముందస్తు జాగ్రత్తగా ఏరియా ఆస్పత్రులకు తరలించారు.
గ్రామగ్రామాన ఆరా
భారీ వర్షాలు, వరదల నేపథ్యాన ఏజెన్సీలోని పలు గ్రామాలకు ఏటా బాహ్య ప్రపంచంతో సంబంధాలు తెగిపోతాయి. ఈనేపథ్యాన గర్భిణుల వివరాలను ఇప్పటికే నమోదు చేసిన వైద్య, ఆరోగ్య శాఖ ఉద్యోగులు అందులో ప్రసవానికి సమీపాన ఉన్న వారిని గుర్తించారు. ఒకవేళ గ్రామాలను వరద ముంచెత్తినా, రాకపోకలు నిలిచిపోయినా ఇబ్బంది ఎదురుకాకుండా ముందస్తు జాగ్రత్తగా గర్భిణులను సమీపంలోని ఏరియా ఆస్పత్రులకు తరలించారు. జిల్లాలోని 23 మండలాల్లో 29 పీహెచ్‌సీల పరిధిలో 19 మంది గర్భిణులను భద్రాచలం, మణుగూరు ఏరియా ఆస్పత్రులతో పాటు చర్ల సీహెచ్‌సీకి తీసుకొచ్చారు.
శాశ్వత పరిష్కారం లేదా?
వైద్య, ఆరోగ్యశాఖలోని వైద్యులు, ఉద్యోగులు ఏజెన్సీ గ్రామాలపై దృష్టి సారిస్తున్నా చాలాచోట్లకు సరైన రహదారి సౌకర్యాలు లేకపోవడం ఇబ్బందిగా నిలుస్తోంది. మట్టి రోడ్లు, బురదమయమైన దారులు, వాగులపై వంతెనలు లేకపోవడం వల్ల వర్షాకాలంలో రాకపోకలు నిలిచిపోతున్నాయి. ఈ కారణంగానే గర్భిణులు, అత్యవసర వైద్యం అవసరమైన వారు ఆస్పత్రులకు సకాలంలో చేరుకోలేక ప్రాణాపాయం ఎదుర్కొంటున్నారు. వలస ఆదివాసీ గ్రామాల నుంచి ఆపదలో ఉన్నవారు, గర్భిణులను డోలీల్లో మోసుకొచ్చే ఘటనలు ఇప్పటికీ కనిపిస్తున్నాయి. ఏటా వర్షాకాలంలో గర్భిణులను ముందు జాగ్రత్తగా చర్యగా ఆస్పత్రులకు తీసుకొస్తున్నా శాశ్వత పరిష్కారంపై మాత్రం దృష్టి సారించడం లేదు. ఇకనైనా ఆదివాసీ, మారుమూల గ్రామాలకు రవాణా సాఫీగా జరిగేలా రహదారులు నిర్మించాలని పలువురు కోరుతున్నారు.
వరదలతో ముప్పు ఎదురుకాకుండాప్రత్యేక ప్రణాళిక రూపొందించాం. అత్యవసర పరిస్థితి ఉన్న గర్భిణులను ముందుగా సురక్షిత ప్రాంతాలకు తరలించాం. మిగతా గర్భిణులను సైతం ఆశా వర్కర్లు, ఏఎన్‌ఎంలు నిత్యం పరిశీలిస్తున్నారు. వర్షాకాలం ముగిసే వరకు ప్రత్యేక వైద్య బృందాలు, అంబులెన్స్ సిబ్బంది సిద్ధంగా ఉంటారు.
– డాక్టర్ జయలక్ష్మి, డీఎంహెచ్‌ఓ

అమ్మకు ఆపద ఎదురుకావొద్దని..