
నిలకడగా గోదావరి
భద్రాచలంటౌన్: భద్రాచలంలో గోదావరి వరద ప్రవాహం శుక్రవారం తగ్గుముఖం పట్టింది. ఎగువ నుంచి వస్తున్న వరదతో గురువారం సాయంత్రం వరకు పెరిగినా.. ఆతర్వాత తగ్గుతూ వచ్చింది. ఈ క్రమాన శుక్రవారం ఉదయం 10గంటలకు వరద 47.50 అడుగులకు చేరడంతో రెండో ప్రమాద హెచ్చరికను ఉపసంహరించారు. అలాగే రాత్రి 9–30 గంటలకు 42.50 అడుగులకు తగ్గడంతో మొదటి ప్రమాద హెచ్చరికను సైతం ఉపసంహరిస్తూ ప్రకటన విడుదల చేశారు. కాగా, గోదావరికి బుధవారం రెండు ప్రమాద హెచ్చరికలు జారీ చేయగా, ఉపసంహరణ సైతం ఒకేరోజు జరగడం గమనార్హం. ఇక పలుచోట్ల రహదారులపైకి చేరిన గోదావరి వరద తొలగిపోవడంతో రాకపోకలు మొదలయ్యాయి. అయితే, మళ్లీ వరద పెరిగే అవకాశముందని సూచనతో అధికారులు అప్రమత్తంగా ఉన్నారు.
ప్రమాద హెచ్చరికలన్నీ ఉపసంహరణ