భద్రాచలం: ఆదివాసీ మహిళలు తయారు చేసే ఉత్పత్తుల మార్కెటింగ్‌ను మరింత మెరుగుపర్చుకోవాలని, తద్వారా ఆర్థికాభివృద్ధి సాధ్యమవుతుందని ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి బి.రాహుల్ తెలిపారు. భద్రాచలంలోని ఐటీడీఏ కార్యాలయంలోశుక్రవారం ఆయన మహిళలు తయారుచేసిన మిల్లెట్ బిస్కెట్లు, ఇప్పపూల లడ్డూలు, సబ్బులు షాంపూలను ఐటీసీ అధికారుల సమక్షాన పరిశీలించి మాట్లాడారు. మహిళలకు ఐటీసీ సహకరిస్తే చిన్న తరహా పారిశ్రామికవేత్తలుగా ఎదుగుతారని తెలిపారు. ఈమేరకు మార్కెటింగ్, స్టాళ్ల ఏర్పాటుకు సహకరించాలని కోరారు. అనంతరం దమ్మక్క జాయింట్ లయబిలిటీ గిరిజన మహిళా గ్రూప్ సభ్యులు తయారు చేసిన మోవా సోప్, బ్యాంబో సోప్‌లను పీఓ ఆవిష్కరించారు. అనంతరం ఉద్దీపకం వర్క్ బుక్–2 ద్వారాబోధనపై అధికారులతో సమీక్షించిన పీఓ పలు సూచనలు చేశారు. ఈనెల 28, 29, 30 తేదీల్లో డివిజన్ల వారీగా ఉద్దీపకం వర్క్ బుక్‌పై టీఎల్‌ఎం మేళా నిర్వహిస్తామని తెలిపారు. అలాగే, రాష్ట్రస్థాయి వాలీబాల్ పోటీల్లో బంగారు పతకాలు సాధించిన కిన్నెరసానిలోని మోడల్ స్పోర్ట్స్ స్కూల్ విద్యార్థులు రిషివర్మ, వెంకన్నబాబును పీఓ అభినందించారు. ఈకార్యక్రమాల్లో ఏపీఓ జనరల్ డేవిడ్‌రాజ్, డీడీ మణెమ్మ, ఐటీసీ మేనేజర్ చంగల్‌రావు, జేడీఎం హరికృష్ణ, వివిధ విభాగాల ఉద్యోగులు రమేష్, బాలసుబ్రహ్మణ్యం, చందు, వెంకటేశ్వర్లు, అంజయ్య, వాసు పాల్గొన్నారు.
ఐటీడీఏ పీఓ రాహుల్