
సరిపడా వైద్యులు లేక..
నోటిఫికేషన్లు ఇచ్చినా ఫలితం లేదు..
● ఎంసీహెచ్‌లో గర్భిణుల, బాలింతల అవస్థలు ● టెక్నీషియన్లు లేక ఎక్స్‌రే, ఓటీలోనూ ఇబ్బందులు ● బయట నుంచి పెరుగుతున్న రిఫరల్ కేసులతో భారం ● వైద్యులు, టెక్నీషియన్ల సంఖ్య పెరిగితేనే ఫలితం
కొత్తగూడెంఅర్బన్: బాలింతలు, శిశువుల ఆరోగ్యాన్ని మెరుగుపర్చడమే లక్ష్యంగా ఏర్పడిన ఎంసీహెచ్(మతా, శిశు ఆరోగ్య కేంద్రం)లో వైద్యులు, టెక్నీషియన్ల కొరతతో ఆశించిన స్థాయిలో పేద, మధ్య తరగతి ప్రజలకు సేవలు అందడం లేదు. కొత్తగూడెం పరిధి రామవరంలో ఎంసీహెచ్ ప్రారంభమైన రోజుల్లో జిల్లా నలుమూలల నుంచి గర్భిణులు వచ్చి ప్రసవాలు చేయించుకునే వారు. గత ఏడాది వరకు అంతా బాగానే ఉన్నా ప్రస్తుతం ఎంసీహెచ్‌లో వైద్యసేవలు పూర్తిస్థాయిలో అందడం లేదు. ఉన్న కొందరు వైద్యులపై భారం పడుతోంది.
ఇతర ఆస్పత్రులకు రిఫర్
ఎంసీహెచ్‌కు జిల్లా నలుమూలల నుంచి గర్భిణులు వస్తుంటారు. వైద్యులు సరిపడా లేక కొంచెం రిస్క్ ఉన్న కేసులను ఇతర జిల్లాలకు రిఫర్ చేస్తుండటంతో పలువురు 108లోనే ప్రసవిస్తున్నారు. ఇంకొందరు సదరు ఆస్పత్రికి చేరుకకునేలోగానే ప్రాణాలు కోల్పోతున్నారు. ప్రస్తుతం మెడికల్ కాలేజీ ఉన్నా వైద్యుల కొరత అనేది విమర్శలకు తావిస్తోంది. కాగా, మాతా, శిశు ఆరోగ్య కేంద్రాల్లో గర్భిణులకు గర్భధారణ సమయంలో పరీక్షలు, ఆరోగ్య సలహాలతో పాటుగా సాధారణ డెలివరీ చేయాలి. పుట్టిన శిశువుల ఆరోగ్య సంరక్షణ, పరీక్షలు, టీకాలు వేయాలి. తల్లి, శిశువులో పోషకాహార లోపాలు నివారించడానికి ఐరన్, ఫోలిక్ యాసిడ్, క్యాల్షియం అందించాలి. డెలివరీ అనంతరం తల్లి, శిశువు ఆరోగ్యంపై పర్యవేక్షణ, తల్లిదండ్రులకు కుటుంబ నియంత్రణపై అవగాహన కల్పించాలి. మాతా, శిశు మరణాల లేకుండా చూడటమే లక్ష్యంగా ఎంసీహెచ్ వైద్యులు, సిబ్బంది పనిచేయాలి. కానీ, సాయంత్రం నాలుగు గంటల తరువాత ఆస్పత్రికి వచ్చే పిల్లలకు కూడా సేవలందడం లేదని పలువురు చెబుతున్నారు.
తగ్గుతున్న ప్రసవాలు
ఎంసీహెచ్‌లో గైనకాలజీ వైద్యులు, ప్రొఫెసర్లు, అసిస్టెంట్ ప్రొఫెసర్లు, సీనియర్ రెసిడెంట్లు మొత్తం 18 మంది ఉండాల్సి ఉంది. కానీ, అంతా కలిపి 8 మంది పని చేస్తుండగా, వీరిలో ముగ్గురు ప్రొఫెసర్లు ఉండగా ఐదుగురు మాత్రమే సేవలందిస్తున్నారు. పిల్లల వైద్యులు 13 మందికిగాను ప్రొఫెసర్, అసిస్టెంట్ ప్రొఫెసర్లు ఇద్దరు పని చేస్తున్నారు. రేడియాలజిస్ట్‌లు 10 మందికిగాను ఇద్దరే ఉన్నారు. దీంతో ప్రస్తుతం ఆస్పత్రిలో డెలివరీలు కేవలం పది మాత్రమే జరుగుతున్నాయి. గతంలో 50వరకు జరిగేవి. ఓపీకి గర్భిణులు 120మంది వస్తుండగా, పిల్లలు 150మంది వరకు వస్తున్నారు. ఆస్పత్రిలో పేషెంట్ కేర్ సిబ్బంది కూడా అరకొరగా ఉండడంతో గర్భిణులు ఇబ్బంది పడుతున్నారు. ఆస్పత్రిలో టెక్నీషియన్లు లేకపోవడంతో వెంటిలేటర్లను విని యోగించడం లేదు. వీటితో పాటుగా ఎక్స్‌రే టెక్నీషియన్, ఆపరేషన్ థియేటర్ టెక్నీషియన్లు కూడా లేకపోవడంతో ఏదైనా సమస్య వచ్చినప్పడు ఆస్పత్రి లో పని చేస్తే వైద్యులు, సిబ్బంది అవస్థ పడుతున్నా రు. అత్యవసర సమయంలో ఏమీ చేయలేని స్థితిలో ఉండిపోతున్నారు. ఇది ఇలానే కొనసాగితే ప్రభుత్వ ఆస్పత్రిపై ప్రజల్లో నమ్మకం పోయే పరిస్థితి ఉంటుందని, జిల్లా ఉన్నతాధికారులు చర్యలు చేపట్టాల్సిన అవసరముందని ఆస్పత్రికి వచ్చిన వారు వారి అభిప్రాయపడుతున్నారు.
కొత్తగూడెం రామవరం ఎంసీహెచ్‌లో గైనకాలజీ, పిల్లల వైద్యులు తక్కువగా ఉన్నారు. సరిపడా వైద్యుల నియామకం కోసం ఎన్నిసార్లు నోటిఫికేషన్లు ఇచ్చినా అర్హత కలిగిన వారు ఎవరూ రావడం లేదు. దీంతో ప్రస్తుతం ఆస్పత్రిలో పనిచేస్తున్న వైద్యులపై అధికభారం పడుతున్న విషయం నిజమే. గత జూన్ లో కూడా నోటిఫికేషన్ ఇచ్చినా కూడా ఎవరూ రాలేదు. – రాధామోహన్,
కొత్తగూడెం సర్వజన ఆస్పత్రి సూపరింటెండెంట్