
సరికొత్త హంగులతో..
యువజన శిక్షణ కేంద్రం పునరుద్ధరణకు ప్రణాళిక
రూ.30 లక్షల వ్యయంతో మరమ్మతులకు ప్రతిపాదన
కలెక్టర్ సందర్శనతో వైటీసీకి మహర్దశ
ఇల్లెందురూరల్: నిరుద్యోగ యువతకు శిక్షణ ఇచ్చి ఉపాధి అవకాశాలు మెరుగుపర్చాలనే లక్ష్యంతో నిర్మించిన వైటీసీ ఏడాదిన్నరగా నిరుపయోగంగా మారింది. ఇల్లెందు – కొత్తగూడెం ప్రధాన రహదారి పక్కనే ఉన్న ఈ భవనాన్ని కలెక్టర్ జితేష్ వి పాటిల్ సందర్శించి.. నూతన హంగులతో శిక్షణ కేంద్రాన్ని పునరుద్ధరించాలని ఐటీడీఏ అధికారులకు సూచించారు. ఈ మేరకు వారు చర్యలు చేపట్టారు.
ప్రారంభంలో విశేష ఆదరణ..
ఇల్లెందు సమీపంలోని సుదిమళ్ల వద్ద రూ.20 కోట్ల వ్యయంతో 2012లో కేంద్ర ప్రభుత్వం భారీ భవనం నిర్మించింది. ఆ భవనంలో ఐటీడీఏ అధికారులు యువజన శిక్షణ కేంద్రాన్ని ఏర్పాటుచేశారు. ఏక కాలంలో మూడు, నాలుగు బ్యాచ్‌లకు పలు అంశాలపై వృత్తి నైపుణ్య శిక్షణ ఇచ్చేలా విశాలమైన డిజిటల్ తరగతి గదులు, ప్రొజెక్టర్లు, కంప్యూటర్ ల్యాబ్, వసతి గదులు నిర్మించారు. ప్రారంభంలో కంప్యూటర్, ఎలక్ట్రీషియన్, ప్లంబింగ్, టైలరింగ్, బైక్ మెకానిజం తదితర విభాగాల్లో శిక్షణ ఇచ్చారు. ఇక్కడ శిక్షణ పొందిన వారిలో అనేక మంది స్వయం ఉపాధి పొందుతున్నారు.
కొరవడిన పర్యవేక్షణ..
యువజన శిక్షణ కేంద్రం నిర్వహణను ఐటీడీఏ ఉన్నతాధికారులు స్వచ్ఛంద సంస్థలకు అప్పగించడంతో లక్ష్యం పక్కదారి పట్టిందనే విమర్శలు వస్తున్నాయి. యువతకు పలు అంశాలపై శిక్షణ ఇచ్చినట్లు, ఉపాధి కల్పించినట్లు ప్రభుత్వానికి నివేదిస్తూ రాయితీ పొందారే తప్ప ఏ ఒక్కరికీ ఉపాధి అవకాశాలు లబించలేదనే ఆరోపణలు వ్యక్తమయ్యాయి. అలా అరకొర శిక్షణ శిబిరాల నుంచి క్రమంగా మూతపడే స్థితికి చేరుకుంది.
కలెక్టర్ సందర్శనతో..
వైటీసీ దుస్థితిపై ‘సాక్షి’లో పలు కథనాలు ప్రచురితం కావడంతో ఉన్నతాధికారులు దృష్టి సారించారు. ఈ క్రమంలో ఇల్లెందు మండల పర్యటనకు వచ్చిన కలెక్టర్ జితేష్ వి పాటిల్ ఈ కేంద్రాన్ని సందర్శించారు. తలుపులు, కిటికీలు, విలువైన సామగ్రి చెదలు పట్టడం, గదుల్లో ఫ్లోర్ కుంగిపోవడం, మూత్రశాలలు, మరుగుదొడ్లు వినియోగానికి వీలు లేకుండా ఉండటం.. ఇలా ప్రతి గదిలోనూ నెలకొన్న అసౌకర్యాలను కలెక్టర్ పరిశీలించారు. భవనంలో నిరుపయోగంగా ఉన్న కంప్యూటర్లు, ప్రొజెక్టర్లు, మంచాలను చూసి.. వైటీసీ పునఃప్రారంభానికి చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ఈ మేరకు ప్రతిపాదనలు సిద్ధం చేయాలని కలెక్టర్, ఐటీడీఏ పీఓ ఆదేశాల మేరకు అధికారులు రంగంలోకి దిగారు. శిక్షణ కేంద్రంలోని ప్రతీ గదిని పరిశీలించి పూర్తిస్థాయిలో సమకూర్చాల్సిన సౌకర్యాలపై అధ్యయనం చేశారు. రూ.30 లక్షల వ్యయంతో ట్రైబల్ వెల్ఫేర్ కమిషనరేట్‌కు ప్రతిపాదనలు పంపారు.
శిక్షణ శిబిరాల నిర్వహణకు ప్రణాళిక..
వైటీసీలో శిక్షణ శిబిరాల నిర్వహణకు ఐటీడీఏ అధికారులు ప్రణాళిక రూపొందించారు. సెప్టెంబర్‌లో తొలుత డ్రైవింగ్ శిక్షణ కేంద్రాన్ని ప్రారంభించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. భవనం మరమ్మతులు పూర్తయిన వెంటనే హాస్టల్ సౌకర్యంతో స్వయం ఉపాధి, పోటీ పరీక్షలకు సన్నద్ధత, ప్రైవేటు రంగంలో ఉపాధి శిక్షణ, జాబ్‌మేళా నిర్వహణ, స్వయం సహాయక సంఘాల మహిళలకు ఉపాధిలో నైపుణ్య శిక్షణ శిబిరాల ఏర్పాటుకు ప్రణాళిక సిద్ధం చేశారు.
ఇల్లెందు వైటీసీ మరమ్మతుల కోసం రూ.30 లక్షల వ్యయంతో గిరిజన సంక్షేమ కమిషనరేట్‌కు ప్రతిపాదనలు పంపించాం. సెప్టెంబర్‌లో డ్రైవింగ్ శిక్షణ ప్రారంభిస్తాం. మరమ్మతులు పూర్తి కాగానే మరిన్ని శిక్షణ శిబిరాల నిర్వహణకు ప్రణాళిక రూపొందించాం. – వి.హరికృష్ణ, ఐటీడీఏ జేడీఎం