
రామయ్యకు సువర్ణ తులసీ అర్చన
భద్రాచలం: భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామి వారికి శనివారం సువర్ణ తులసీ అర్చన వైభవంగా నిర్వహించారు. తెల్లవారుజామున గర్భగుడిలో స్వామివారికి సుప్రభాత సేవ, సేవా కాలం, ఆరాధన తదితర పూజలు చేశారు. అనంతరం బేడా మండపంలో కొలువుదీర్చి విశ్వక్సేన పూజ, పుణ్యావాచనం జరిపించారు. అనంతరం స్వామివారికి కంకణధారణ, యజ్ఞోపవీత ధారణ, అమ్మవారికి కంకణధారణ, యోక్త్రధారణ గావించి నిత్యకల్యాణ వేడుకను శాస్త్రోక్తంగా నిర్వహించారు.
నేటి నుంచి భాద్రపద మాసోత్సవాలు..
భద్రాచలంటౌన్: భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామి దేవస్థానంలో ఆదివారం నుంచి సెప్టెంబర్ 21వరకు భాద్రపద మాసోత్సవాలు నిర్వహించనున్నట్లు ఈఓ ఎల్.రమాదేవి తెలిపారు. సెప్టెంబర్ 7న చంద్రగ్రహణం కారణంగా మధ్యాహ్నం ఒంటి గంటకు ఆలయ తలుపులు మూసి 8వ తేదీ తెల్లవారుజామున 3 గంటలకు తిరిగి తెరుస్తామని, ఆ తర్వాత ప్రత్యేక పూజలు ఉంటాయని పేర్కొన్నారు. 15వ తేదీన శ్రీ వైష్టవ కృష్ణాష్టమి సందర్భంగా స్వామివారు శ్రీకృష్ణావతారంలో భక్తులకు దర్శనమిస్తారని వెల్లడించారు.
మహిళలు స్వశక్తితో ఎదగాలి
ఐటీడీఏ పీఓ రాహుల్
చర్ల: మహిళలు శ్వశక్తితో ఎదగాలని, ఇందుకోసం చిన్న తరహా పరిశ్రమల ఏర్పాటుకు కృషి చేస్తున్నామని ఐటీడీఏ పీఓ బి.రాహుల్ అన్నారు. మండలంలోని ఆర్.కొత్తగూడెం పంచాయితీ పరిధి సున్నగుంపులో మహిళలు అటవీ ఉత్పత్తులతో తయారు చేసే తినుబండారాలను శనివారం ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ స్వశక్తితో ఎదిగేందుకు ముందుకొస్తున్న మహిళా సంఘాలకు అన్ని విధాలా సహకరిస్తామని, అవసరమైన ఆర్థిక సాయం అందిస్తామని చెప్పారు. కార్యక్రమంలో ఏపీఓ జనరల్ డేవిడ్‌రాజ్, ఐటీసీ మేనేజర్ చంగల్‌రావు, ప్యాకింగ్, డిజైనింగ్ కో ఆర్డినేటర్ బేగ్, మహిళా సభ్యులు సమ్మక్క, మునెమ్మ, శ్రీదేవి, రమాదేవి, శిరీష, ఈశ్వరి, స్వాతి పాల్గొన్నారు.
జ్వరాలు వ్యాప్తి చెందకుండా చూడండి..
ఏజెన్సీలో జ్వరాలు వ్యాప్తి చెందకుండా చర్యలు చేపట్టాలని పీఓ రాహుల్ సూచించారు. శనివారం ఆయన స్థానిక ప్రభుత్వ ఆస్పత్రిని సందర్శించారు. పేషెంట్లతో మాట్లాడి వైద్య సేవలు ఎలా అందుతున్నాయని ఆరా తీశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. రికార్డులన్నీ సక్రమంగా నమోదు చేయాలని, రక్త పరీక్ష శాంపిళ్లను ఎప్పటికప్పుడు టీ హబ్‌లకు పంపించాలని ఆదేశించారు. జ్వరాలు ప్రబలే గ్రామాలను గుర్తించి వైద్య శిబిరాలు ఏర్పాటు చేయాలన్నారు.

రామయ్యకు సువర్ణ తులసీ అర్చన