
●గోదావరి కలుషితం
భద్రాచలంఅర్బన్: భద్రాచలం నాలుగు రాష్ట్రాలకు కూడలి. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, ఒడిశా రాష్ట్రాల ప్రజలు వివిధ పనుల నిమిత్తం తరచూ భద్రాచలం వస్తుంటారు. ఈ క్రమంలో పట్టణంలో ఏర్పడే చెత్తను గత కొన్నేళ్లుగా భద్రాచలం గోదావరి నదీ తీరాన ఉన్న అనధికారిక డంపింగ్ యార్డులోనే పడేస్తున్నారు. రెండు, మూడు రోజుల క్రితం భద్రాచలం గోదావరి నదికి వరద పోటు కారణంగా ఆ చెత్త అంతా కరకట్ట చుట్టూ ఒడ్డుకు చేరుకుంది. పట్టణంలో గల అన్ని కాలనీల్లోని నివాస గృహాల నుంచి వచ్చే చెత్తతో పాటు అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ ఆస్పత్రుల నుంచి వచ్చే వేస్టేజీని ఇదే ప్రాంతంలో వేస్తుంటారు. ఇప్పుడు అదే చెత్త గోదావరి నదిలో కలిసి నీరు కలుషితం అవుతోంది. గోదావరి తీరం డంపింగ్ యార్డును తలపిస్తోంది. ఈ సమస్య ప్రతీ సంవత్సరం వచ్చే గోదావరి వరదల సమయంలో ఎదురవుతూనే ఉన్నా.. పరిష్కారానికి అధికారులు ఎలాంటి చర్యలూ తీసుకోవడం లేదు. ఇప్పటికై నా స్పందించి ఆ ప్రాంతంలో చెత్తను వేయకుండా తగు చర్యలు తీసుకోవాలని ఇటు స్థానికులు, అటు రామయ్య భక్తులు కోరుతున్నారు.