
‘మూణ్నెల్ల’ ముచ్చటేనా?
● గ్యాస్ సబ్సిడీ అందక ‘మహాలక్ష్మి’ వినియోగదారుల ఇక్కట్లు ● రూ.500కు సిలిండర్ ఏమైందంటున్న లబ్ధిదారులు ● మొదటి మూడు నెలల వరకే జమైన రాయితీ
పాల్వంచరూరల్: మహాలక్ష్మి లబ్ధిదారులకు వంట గ్యాస్ సిలిండర్ల రాయితీ డబ్బులు రావడం లేదని పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తాము అధికారంలోకి వస్తే మహాలక్ష్మి పథకం కింద తెల్లరేషన్ కార్డు ఉన్న గ్యాస్ వినియోగదారులకు రూ.500కే గ్యాస్ సిలిండర్ ఇస్తామని కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చింది. ఆ తర్వాత ప్రభుత్వం ఏర్పాటయ్యాక ఆరు గ్యారంటీల్లో భాగంగా ఈ పథకాన్ని గతేడాది ఫిబ్రవరి 27న ప్రారంభించారు. అంతకుముందే ప్రజాపాలన సభల్లో గ్యాస్ రాయితీ పథకానికి దరఖాస్తులు స్వీకరించారు. జిల్లా వ్యాప్తంగా రెండు లక్షల మందికి పైగా దరఖాస్తు చేసుకోగా, అందులో 1,54,633 మందిని లబ్ధిదారులుగా గుర్తించారు. వీరిలో అత్యధికంగా బూర్గంపాడు మండలంలో 10,276 మంది, అశ్వారావుపేటలో 8,312, ఇల్లెందు మండలంలో 8,662, పాల్వంచ మున్సిపాలిటీ పరిధిలో 8,164 మంది ఉండగా.. అత్యల్పంగా అళ్లపల్లి మండలంలో 1,344 మంది, గుండాలలో 2,205, కరకగూడెంలో 2,513, అన్నపురెడ్డిపల్లి మండలంలో 3,540 మంది ఉన్నారు. వీరిలో చాలా మంది మొదటి మూడు నెలల వరకే సబ్సిడీ డబ్బు బ్యాంకు ఖాతాల్లో జమైందని, ఆ తర్వాత రావడం లేదని చెబుతున్నారు. ప్రస్తుతం సిలిండర్ ధర రూ.892 ఉండగా కేంద్ర ప్రభుత్వం రూ.21 రాయితీ ఇస్తోంది. రాష్ట్ర ప్రభుత్వం రూ.371 సబ్సిడీ ఇవ్వాల్సి ఉండగా.. గత ఐదారు నెలలుగా రాష్ట్ర సబ్సిడీ అందడం లేదని, ఎందుకు జమ చేయడం లేదని వినియోగదారులు ప్రశ్నిస్తున్నారు.

‘మూణ్నెల్ల’ ముచ్చటేనా?