
గణేష్ ఉత్సవాలు ప్రశాంతంగా నిర్వహించాలి
నవరాత్రి వేడుకలకు
పటిష్ట బందోబస్తు..
సూపర్‌బజార్(కొత్తగూడెం): గణపతి నవరాత్రి ఉత్సవాలను ప్రశాంత వాతావరణంలో నిర్వహించాలని కలెక్టర్ జితేష్ వి పాటిల్ అన్నారు. వినాయక చవితి ఉత్సవాల నిర్వహణ, నిమజ్జన ఏర్పాట్లపై కలెక్టరేట్‌లో శనివారం ఆయన పలు శాఖల సమీక్షించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ఉత్సవ కమిటీల వారు గణేష్ మండపాలను విధిగా రిజిస్ట్రేషన్ చేయించాలని సూచించారు. మండపాలకు ఏర్పాటుచేసే విద్యుత్ కోసం ఆ శాఖ నుంచి అనుమతి తీసుకోవాలని స్పష్టం చేశారు. ఎలాంటి ప్రమాదాలు జరుగకుండా రక్షణ చర్యలపై విద్యుత్ అధికారులు పర్యవేక్షించాలన్నారు. జిల్లాతో పాటు ఇతర ప్రాంతాల నుంచి కూడా విగ్రహాలు నిమజ్జనానికి వచ్చే అవకాశం ఉన్నందున అధికారులు భద్రతా చర్యలను పటిష్టం చేయాలని, గుర్తించిన ప్రాంతాల్లోనే నిమజ్జనం చేసేలా చూడాలని, అవసరమైన రూట్ మ్యాప్ సిద్ధం చేయాలని ఆదేశించారు. వినాయక నిమజ్జనానికి వినియోగించే వాహనాలకు ముందుగా రవాణాశాఖ అధికారి నుంచి ధ్రువీకరణ తీసుకోవాలని అన్నారు. ప్రతీ గణేష్ మండపం వద్ద అవసరమైన మేరకు బందోబస్తు ఏర్పాటు చేయాలని చెప్పారు. గణేష్ ఉత్సవాలు, నిమజ్జనం సందర్భంగా ఎలాంటి రెచ్చగొట్టే అంశాల జోలికి వెళ్లొద్దని, శాంతి భద్రతలకు విఘాతం కలగకుండా జిల్లా యంత్రాంగానికి సహకరించాలని కోరారు. భక్తులకు అందించే స్వామి వారి ప్రసాదాలకు ప్లాస్టిక్ వస్తువులు వినియోగించొద్దని, పర్యావరణ పరిరక్షణకు సహకరించాలని సూచించారు. వీలైనంత వరకు మట్టి గణపతి విగ్రహాలను పూజించాలని అన్నారు. కాలుష్య నియంత్రణ మండలి ఆధ్వర్యంలో జిల్లాలోని మున్సిపాలిటీల్లో ఉచితంగా మట్టి విగ్రహాల పంపిణీకి ఏర్పాట్లు చేశామన్నారు. సమావేశంలో ఎస్పీ రోహిత్‌రాజ్, భద్రాచలం సబ్‌కలెక్టర్ మ్రిణాల్ శ్రేష్ఠ, ఏఎస్పీ విక్రాంత్‌కుమార్ సింగ్, అదనపు కలెక్టర్లు డి.వేణుగోపాల్, విద్యాచందన, డీపీఓ చంద్రమౌళి, డీఎంహెచ్‌ఓ జయలక్ష్మి, మిషన్ భగీరథ ఈఈ తిరుమలేష్, కొత్తగూడెం ఆర్డీఓ మధు, మున్సిపల్ కమిషనర్లు పాల్గొన్నారు.
కొత్తగూడెంఅర్బన్: గణపతి నవరాత్రి వేడుకలకు పటిష్ట చర్యలు చేపట్టాలని ఎస్పీ రోహిత్‌రాజు పోలీస్ అధికారులకు సూచించారు. తన కార్యాలయంలో శనివారం నిర్వహించిన సమీక్ష సమావేశంలో ఆయన మాట్లాడారు. ఉత్సవాల సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేయాలన్నారు. గణేష్ ఉత్సవ కమిటీ సభ్యులకు నియమ నిబంధనల గురించి వివరించాలని, శోభాయాత్ర సమయంలో డీజేలు, టపాసుల నిషేధంపై అవగాహన కల్పించాలని చెప్పారు. జిల్లాలోని పోలీస్ స్టేషన్లలో పెండింగ్ కేసుల వివరాలు అడిగి తెలుసుకున్నారు. సమావేశంలో భద్రాచలం ఏఎస్పీ విక్రాంత్ కుమార్ సింగ్, డీఎస్పీలు రెహమాన్, సతీష్ కుమార్, చంద్రభాను, రవీందర్ రెడ్డి, మల్లయ్యస్వామి పాల్గొన్నారు.
కలెక్టర్ జితేష్ వి పాటిల్