
సాహసోపేత టూరిజంగా ‘రథంగుట్ట’
మణుగూరురూరల్ : మండలంలోని రథంగుట్ట ప్రాంతం సాహసోపేత టూరిజం స్పాట్‌గా ప్రత్యేకత చాటుకుంటుందని జిప్‌లైన్ అడ్వెంచర్ ప్రతినిధులు అన్నారు. శనివారం వారు రథంగుట్ట ప్రాంతాన్ని పరిశీలించారు. అన్ని ఆధునిక, సాంకేతిక పరికరాలు, భద్రతా ప్రమాణాలు అమలు చేస్తూ పర్యావరణానికి నష్టం కలిగించకుండా రథంగుట్ట ప్రాజెక్ట్‌ను ప్రత్యేక టూరిజం స్పాట్‌గా రూపకల్పన చేయొచ్చని తెలిపారు. ఈ ప్రాజెక్ట్ ఏర్పాటుతో స్థానికులకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభిస్తాయని, హస్తకళ, చిన్న పరిశ్రమలకు మార్కెట్ అవకాశాలు పెరుగుతాయని తెలిపారు. పర్యాటకుల కోసం సమాచార, శిక్షణ కేంద్రాలు కూడా ఏర్పాటు చేస్తామన్నారు. రథంగుట్ట పరిసరాలు ప్రకృతి అందాలతో ప్రత్యేక ఆకర్షణగా మారుతాయని, ప్రాంతీయ, రాష్ట్రీయ, దేశీయ పర్యాటకులకు పరిచయం చేయొచ్చని తెలిపారు. కార్యక్రమంలో జిల్లా అధికారులతో పాటు మణుగూరు ఎఫ్‌ఆర్‌ఓ ఉపేందర్, ఎంపీడీఓ టి. శ్రీనివాసరావు పాల్గొన్నారు.
కిన్నెరసానిలో రోప్ వేకు కసరత్తు..
పాల్వంచరూరల్ : పర్యాటక ప్రాంతమైన కిన్నెరసానిలో అద్దాలమేడ నుంచి జలాశయం మధ్యలో ఉన్న చిన్న ద్వీపం వరకు రూ.25 లక్షల వ్యయంతో సుమారు అర కిలోమీటర్ మేర సింగిల్ రోప్ వే(జిప్ లైన్) ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. ఈ మేరకు పుణె నుంచి నెయిల్ అడ్వెంచర్ పంకజ్ కుమేరియా బృందం శనివారం కిన్నెరసానిలో పర్యటించింది. ఈ సందర్భంగా సభ్యులు మాట్లాడుతూ.. కేరళ, మయన్మార్, డార్జిలింగ్‌లో ఎత్తయిన కొండల మధ్య పొడవైన జిప్‌లైన్‌లు ఉన్నాయని, కిన్నెరసానిలోనూ జిప్‌లైన్ రోప్‌వే ఏర్పాటు చేస్తే పర్యాటకులు అధిక సంఖ్యలో వచ్చే అవకాశం ఉందని అన్నారు. జిప్‌లైన్ ఏర్పాటుకు సంబంధించిన నివేదికను కలెక్టర్ జితేష్ వి పాటిల్‌కు అందజేయనున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో డీవైఎస్‌ఓ పరంధామరెడ్డి, ఎంపీడీఓ కె.విజయభాస్కర్‌రెడ్డి, ఎంపీఓ చెన్నకేశవరావు తదితరులు పాల్గొన్నారు.

సాహసోపేత టూరిజంగా ‘రథంగుట్ట’