
సాగని అన్వేషణ
ఒప్పందం ప్రకారం..
మణుగూరులో 20 కిలోవాట్ పైలట్ ప్రాజెక్ట్ సక్సెస్
● జియో థర్మల్ పవర్ ప్లాంట్ అభివృద్ధిపై త్రైపాక్షిక ఒప్పందం ● ఏడాది గడిచినా అడుగు ముందుకు పడని వైనం
సాక్షి ప్రతినిధి, భద్రాద్రి కొత్తగూడెం: పగిడేరు దగ్గర భూతాప (జియో థర్మల్) క్షేత్రం అన్వేషణ, అభివృద్ధిపై సింగరేణి కాలరీస్, ఆయిల్ అండ్ నేచురల్ గ్యాస్ కార్పొరేషన్ లిమిటెడ్ (ఓఎన్‌జీసీ), తెలంగాణ రిన్యూవబుల్ ఎనర్జీ కార్పొరేషన్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ (తెలంగాణ రెడ్కో) మధ్య గతేడాది ఆగస్టులో త్రైపాక్షిక ఒప్పందం కుదిరింది. సింగరేణి సీఎండీ ఎన్.బలరామ్, ఓఎన్‌జీసీ డైరెక్టర్ (ఎక్స్‌ప్లో రేషన్) సుష్మా రావత్, తెలంగాణ రెడ్కో జీఎం సత్య వరప్రసాద్‌లు ఒప్పంద పత్రంపై సంతకాలు చేశారు. ఏడాది పూర్తయినా అన్వేషణలో అడుగు ముందుకు పడలేదు.
పైలట్ ప్రాజెక్ట్ సక్సెస్
మణుగూరు మండలం పగిడేరు గ్రామం వద్ద భూగర్భం నుంచి వేడి నీరు ఊటలా బయటకు వస్తుంది. ఆ వేడిని ఉపయోగించి థర్మల్ పవర్ ప్లాంట్ ఏర్పాటుకు సాధ్యాసాధ్యాలపై కొన్నేళ్లుగా సింగరేణి సంస్థ ప్రయోగాలు చేస్తోంది. ప్రయోగాత్మకంగా 20 కిలోవాట్ల ప్లాంట్‌ను ఏర్పాటు చేసి మూడేళ్లపాటు ఫలితాలను పరిశీలించింది. జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా కూడా పరిశీలించి మణుగూరులో తొలి దశలో 122 మెగావాట్ల జియో థర్మల్ విద్యుత్ ఉత్పత్తి కేంద్రం ఏర్పాటుకు అవకాశం ఉందని నివేదికలో వెల్లడించింది. దీంతో సింగరేణి, ఓఎన్‌జీసీ, రెడ్కో మధ్య త్రైపాక్షిక ఒప్పందం కుదిరింది. 122 మెగావాట్ల ప్రాజెక్టు నుంచి సానుకూల ఫలితాలు వస్తే ఆ తర్వాత దశలవారీగా 3,200 మెగావాట్ల మేరకు జియో థర్మల్ విద్యుత్‌ను ఉత్పత్తి చేసేందుకు అవకాశం ఉంటుందనే అంచనాలు నెలకొన్నాయి.
త్రైపాక్షిక ఒప్పందాన్ని అనుసరించి మణుగూరు ప్రాంతంలో జియో థర్మల్ విద్యుత్ ఉత్పాదన కేంద్రాల ఏర్పాటుకు గల అవకాశాలను ఓఎన్‌జీసీ అధ్యయనం చేసి నివేదిక సమర్పించాలి. ప్లాంటు ఏర్పాటుకు అవసరమైన అనుమతులను పొందడానికి తెలంగాణ రెడ్కో సంస్థ సహకరించాలి. స్థానికంగా అవసరమైన ఏర్పాట్లను సింగరేణి సంస్థ చేయాల్సి ఉంది. ఇప్పటికే పర్యావరణ అనుమతులపై అటవీశాఖతో ఒప్పందం కూడా చేసుకున్నారు. ఏడాది గడిచినా త్రైపాక్షిక ఒప్పందం వల్ల సింగరేణికి ఒనగూరిన ప్రయోజనాలు ఏమీ లేవనే వాదనలు వినిపిస్తున్నాయి. జియో థర్మల్ విద్యుత్ ప్రయోగాలు సక్సెస్ అయితే మణుగూరు ప్రాంతంలో హీలియం వెలికితీసేందుకు అవకాశాలు ఉన్నాయంటూ త్రైపాక్షిక ఒప్పందం సందర్భంగా ఓఎన్‌జీసీ డైరెక్టర్ సుష్మారావత్ అన్నారు. దీంతో జియో ప్రాజెక్ట్‌లో ఎటువంటి పురోగతి ఉంటుందనే అంచనాలు సర్వత్రా నెలకొన్నాయి. ఇప్పటికై నా స్తబ్ధత వీడి సింగరేణి యాజమాన్యం దృష్టి సారించాల్సిన అవసరం ఉంది.