
వైభవంగా బాలాజీ కల్యాణం
అన్నపురెడ్డిపల్లి (చండ్రుగొండ) : అన్నపురెడ్డిపల్లిలో వేంచేసి ఉన్న శ్రీ బాలాజీ వేంకటేశ్వరస్వామి వారి కల్యాణ వేడుకను శనివారం వైభవంగా నిర్వహించారు. ఆలయ అర్చకులు ప్రసాదాచార్యులు ఆధ్వర్యంలో వేద పండితులు ప్రత్యేక పూజలు చేశారు. కల్యాణ వేడుక అనంతరం భక్తులకు అన్నదానం చేశారు. హైదరాబాద్‌కు చెందిన వెలది భాస్కర్‌రావు – రమాకుమారి దంపతులు స్వామివారికి మొక్కులు చెల్లించారు. ఆలయ ఇన్‌చార్జ్ మేనేజర్ పి.వి.రమణ ఏర్పాట్లు పర్యవేక్షించారు.
రెండు గేట్లు ఎత్తివేత
కిన్నెరసాని నుంచి 10వేల క్యూసెక్కుల నీరు గోదావరిలోకి..
పాల్వంచరూరల్ : ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలతో కిన్నెరసాని జలాశయానికి వరద ఉధృతి పెరిగింది. 407 అడుగుల నీటి నిల్వ సామర్థ్యం గల ఈ రిజర్వాయర్‌లోకి ఎగువ నుంచి 14వేల క్యూసెక్కుల వరద రావడంతో శనివారం నీటిమట్టం 404.60 అడుగులకు పెరిగింది. దీంతో రెండు గేట్లను ఐదడుగుల మేర ఎత్తి 10వేల క్యూసెక్కుల నీటిని గోదావరిలోకి విడుదల చేసినట్లు ఏఈ తెలిపారు.
పర్యాటకులకు బ్రేక్..
కాగా, శనివారం సెలవురోజు కావడంతో కిన్నెరసాని జలాశయాన్ని వీక్షించేందుకు వివిధ ప్రాంతాల నుంచి పర్యాటకులు తరలివచ్చారు. అయితే లోపలికి అనుమతించకుండా ప్రధాన ద్వారం గేటు మూసివేయడంతో వారంతా నిరాశతో వెనుదిరిగారు.
నామినేషన్ల ప్రక్రియ ప్రారంభం
పాల్వంచ: టీజీ జెన్‌కో పరిధిలోని తెలంగాణా స్టేట్ ఎలక్ట్రిసిటీ అసిస్టెంట్ ఇంజనీర్స్ అసోసియేషన్ ఎన్నికల నామినేషన్ల ప్రక్రియ శనివారం కోలాహలంగా ప్రారంభమైంది. రెండేళ్ల కాలపరిమితితో కూడిన ఈ ఎన్నికలు రాష్ట్రంలోని సుమారు 25 ప్రాంతాల్లో ఈనెల 30న నిర్వహించనుండగా.. 19వ తేదీ వరకు నామినేషన్లు స్వీకరిస్తారు. ఓట్ల లెక్కింపు మాత్రం అసోసియేషన్ హెడ్ క్వార్టర్ అయిన కేటీపీఎస్‌లో సెప్టెంబర్ 2న చేపడతారు. రాష్ట్ర వ్యాప్తంగా విద్యుత్ రంగంలో పనిచేస్తున్న ఏఈలు సుమారు 2వేల మంది ఓటు వేసే అవకాశం ఉంది. అయితే తొలిరోజు కేటీపీఎస్ ఐదో దశకు చెందిన ఏఈ జి.కీర్తి ఫైనాన్స్ సెక్రటరీ పదవికి, 7వ దశకు చెందిన ఏఈ పి.నవీన్ జాయింట్ సెక్రటరీ(థర్మల్) పదవికి నామినేషన్లు దాఖలు చేశారు. 18, 19 తేదీల్లో మిగితా పోస్టులకు నామినేషన్లు దాఖలు చేసే అవకాశం ఉంది. తొలిరోజు నామినేషన్ల కార్యక్రమంలో ఎన్నికల అధికారి రవి, మహేష్, లింగ నాయక్, ప్రకాష్, ప్రశాంత్, అఖిలేష్, వాహిని, రమేష్, మంజూషా, ఉపేందర్ తదితరులు పాల్గొన్నారు.

వైభవంగా బాలాజీ కల్యాణం

వైభవంగా బాలాజీ కల్యాణం