
అన్ని రంగాల్లో ముందుండాలి..
● త్వరలో 100 మిలియన్ టన్నుల ఉత్పత్తికి ప్రణాళిక ● స్వాతంత్య్ర వేడుకల్లో సింగరేణి సీఎండీ ఎన్.బలరామ్
సింగరేణి(కొత్తగూడెం): భారతదేశం అన్ని రంగాల్లో ముందుండేందుకు భారతీయులుగా తమవంతు కృషి చేయాల్సిన అవసరం ఉందని సింగరేణి సీఎండీ ఎన్.బలరామ్ పేర్కొన్నారు. శుక్రవారం కొత్తగూడెం ప్రకాశం స్టేడియంలో జరిగిన 79వ స్వాతంత్య్ర దినోత్సవంలో ఆయన జెండా ఆవిష్కరించి, సింగరేణివ్యాప్త 11 ఏరియాల ఉత్తమ కార్మికులను తోటి డైరెక్టర్లతో కలిసి సన్మానించారు. తొలుత సింగరేణి ప్రధాన కార్యాలయంలో డైరెక్టర్ (పా) గౌతమ్ పొట్రు జెండా ఆవిష్కరించారు. సీఎండీ మాట్లాడుతూ.. ఒకనాడు ప్రతీ విషయంలోనూ ఇతర దేశాలపై అధారపడ్డామని, ఇప్పడు పూర్తిస్థాయిలో స్వావలంబన, స్వయం సమృద్ధి సాధించి, ప్రపంచంలోనే మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ నిలిచామని చెప్పారు. 136 ఏళ్ల సుదీర్ఘ చరిత్ర కలిగిన సింగరేణి సంస్థ దేశ, రాష్ట్ర అభివృద్ధిలో తనవంతు పాత్ర పోషిస్తుందన్నారు. త్వరలోనే బొగ్గు ఉత్పత్తి 100 మిలియన్ టన్నులకు పెంచాలని, థర్మల్ విద్యుత్‌ను 3000 మెగావాట్లకు, సోలార్ విద్యుత్‌ను 5000 మెగావాట్లకు పెంచేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నామని వెల్లడించారు. ఆధునిక కాలంలో కీలక ఖనిజాల రంగంలోకి సింగరేణి సంస్థ ప్రవేశించాలని నిర్ణయించిందని పేర్కొన్నారు. గతంలో దక్షిణ భారతదేశంలో కేవలం సింగరేణి సంస్థ మాత్రమే బొగ్గు ఉత్పత్తి చేసేదని, కానీ, ఇప్పడు అనేక ప్రభుత్వ ప్రైవేట్ కంపెనీలు బొగ్గును ఉత్పత్తి చేస్తున్నాయన్నారు. ఓపెన్‌కాస్ట్‌లలో టన్నుకు సగటున 8 క్యూబిక్ మీటర్ల ఓబీ తీయాల్సి రావటం, భూగర్భ గనుల్లో కూడా ఉత్పత్తి వ్యయం పెరగటంతో సింగరేణి బొగ్గు ధరను పెంచాల్సి వస్తోందని, కానీ, పోటీ మార్కెట్‌లో నిలబడేందుకు బొగ్గు ధరను తగ్గించాల్సిన అవసరం ఉందని, కార్మికులు, అధికారులు, ఉద్యోగులు ఈ విషయంపై ఆలోచించాల్సిన అవసరం ఉందని స్పష్టం చేశారు. జీఎం పర్సనల్ (వెల్ఫేర్) జీవీ కుమార్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు, డైరెక్టర్ (పా) గౌతమ్ పొట్రు, డైరెక్టర్లు సత్యనారాయణరావు, సూర్యనారాయణరావు, వెంకటేశ్వరరావు, గుర్తింపు, ప్రాతినిధ్య సంఘం నేతలు రాజ్‌కుమార్, త్యాగరాజన్‌తోపాటు లక్ష్మీపతిగౌడ్ తదితరులు పాల్గొన్నారు.

అన్ని రంగాల్లో ముందుండాలి..