జిల్లా కలెక్టర్ డాక్టర్ వి.వినోద్‌కుమార్
బాపట్ల: జిల్లాలో వెదురు సాగుకు అనుకూలమైన ప్రాంతాలను గుర్తించి, సాగు అవకాశాలపై అధ్యయనం చేయాలని కలెక్టర్ డాక్టర్ వినోద్‌కుమార్ అధికారులను ఆదేశించారు. సోమవారం జిల్లా కలెక్టరేట్‌లో న్యూ వీసీ హాలులో జరిగిన జిల్లా వెదురు ఆర్థిక వ్యవస్థ కమిటీ సమావేశాన్ని కలెక్టర్ సమీక్షించారు. ఇతర జిల్లాల్లో వెదురు సాగు విధానాలను పరిశీలించి, బాపట్లలో ప్రయోగాత్మకంగా సాగు చేపట్టే అవకాశాలను అధ్యయనం చేయాలని సూచించారు. వెదురు సాగుతో రైతులకు అదనపు ఆదాయం, స్థానికంగా ఉపాధి అవకాశాలు కల్పించేలా ప్రణాళిక రూపొందించాలన్నారు. కార్యక్రమంలో జిల్లా ఫారెస్ట్ అధికారి సౌజన్య, డీఆర్‌డీఏ పీడీ సింగయ్య, ట్రైబల్ వెల్ఫేర్ అధికారి అమర సుబ్బయ్య పాల్గొన్నారు.
22ఏ దరఖాస్తుల పరిష్కారం వేగవంతం చేయాలి
22–ఎ దరఖాస్తుల పరిష్కారం వేగవంతం చేసి పూర్తి శాతం పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ వి.వినోద్‌కుమార్ పేర్కొన్నారు. సోమవారం స్థానిక కలెక్టరేట్‌లోని వీక్షణ సమావేశ మందిరంలో రెవెన్యూ అంశాలపై సమీక్ష సమావేశం నిర్వహించారు. జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ పంచాయతీ ఎన్నికలకు సంబంధించి షెడ్యూల్ కులాలు, షెడ్యూల్ తెగలు, వెనుకబడిన తరగతుల ఓటర్ల జాబితా తయారీ ప్రక్రియలో పంచాయతీ, డీఎల్డీవోలు బాధ్యతతో వ్యవహరించాలని చెప్పారు. ఇందుకు సంబంధించి ప్రభుత్వం షెడ్యూలు విడుదల చేసిందని తెలిపారు. సంక్షిప్త ఓటర్ల సవరణ జాబితా ప్రక్రియలో నోటీసులు అందజేతలో చీరాల మండలంలో ఎక్కువ శాతం పెండింగ్ ఉన్నాయని చెప్పారు. 100 శాతం నోటీసులను అందజేసి వాటిపై హియరింగ్ పూర్తి చేయాలని రెవెన్యూ డివిజన్ అధికారులకు సూచించారు. 22 ఏ కు సంబంధించిన దరఖాస్తులను పరిష్కరించుటలో వేగవంతం చేయాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్ వి రెవెన్యూ అధికారులకు తెలిపారు. కార్యక్రమంలో జిల్లా సంయుక్త కలెక్టర్ భావన వశిష్ట, ఇన్‌చార్జి జిల్లా రెవెన్యూ అధికారి లవన్న, పంచాయతీ అధికారి కే ప్రభాకర్, కలెక్టరేట్ ఎన్నికల, ల్యాండ్ విభాగం సూపరింటెండెంట్‌లు, వీక్షణ సమావేశం ద్వారా ఆర్డీవోలు, తహసీల్దార్లు, వీఆర్వోలు, బీఎల్వోలు, తదితరులు పాల్గొన్నారు.


