అరాచక పాలనపై ప్రజల్లో అసహ్యం | - | Sakshi
Sakshi News home page

అరాచక పాలనపై ప్రజల్లో అసహ్యం

Aug 18 2026 7:10 AM | Updated on Aug 18 2026 7:10 AM

హామీలు అటకెక్కించిన చంద్రబాబు ప్రభుత్వం మాజీ మంత్రి మేరుగ నాగార్జున

అభివృద్ధిలో లాస్ట్‌..అరాచకంలో ఫస్ట్‌

రేపల్లె: రాష్ట్రంలో చంద్రబాబు ప్రభుత్వ పనితీరు చూస్తుంటే ప్రజలు రాజకీయాలను అసహ్యించుకునే పరిస్థితి ఏర్పడిందని మాజీ మంత్రి, వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ బాపట్ల జిల్లా అధ్యక్షుడు మేరుగ నాగార్జున విమర్శించారు. ఇసుకపల్లిలో పార్టీ నాయకుడు మోపిదేవి శ్రీనివాసరావు నివాసంలో సోమవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. చంద్రబాబు పాలనలో రాష్ట్రంలోని ఏ వర్గం ప్రజలు సంతోషంగా లేరన్నారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను పూర్తిగా పక్కన పెట్టి ‘సూపర్‌ సిక్స్‌’ హామీలను అటుకెక్కించారని మండిపడ్డారు. గత ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అమలు చేసిన సంక్షేమ పథకాలను నేటి చంద్రబాబు ప్రభుత్వం పూర్తిగా విస్మరించి ప్రజా అభివృద్ధిని అడ్డుకుంటోందని ఆవేదన వ్యక్తం చేశారు. కోట్లాది రూపాయలు అప్పులు తెచ్చిన ఈ ప్రభుత్వం ఆ డబ్బును ఎక్కడ ఖర్చు చేసిందో చెప్పలేని పరిస్థితిలో ఉందన్నారు. పారదర్శకత లేకుండా ఆర్థిక వ్యవస్థను దెబ్బతీస్తున్నారని విమర్శించారు.

అగమ్య గోచరంగా రైతుల పరిస్థితి

రాష్ట్రంలో ముఖ్యంగా డెల్టా ప్రాంతంలో రైతుల పరిస్థితి అగమ్యగోచరంగా మారిందని నాగార్జున ఆవేదన వ్యక్తం చేశారు. రైతు సంక్షేమాన్ని పూర్తిగా విస్మరించడం వల్ల వరి వేసిన రైతులు ఆత్మహత్యలకు దిగే పరిస్థితులు ఏర్పడుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. గత ప్రభుత్వంలో గ్రామాల్లో రైతు భరోసా కేంద్రాలు ఏర్పాటు చేసి నాణ్యమైన విత్తనాలు, ఎరువులు, పురుగుమందులు అందించి రైతులకు అండగా నిలిచారని గుర్తు చేశారు. రూ.3 వేల కోట్లతో ధరల స్థిరీకరణ నిధి ఏర్పాటు చేసి రైతులకు భరోసా కల్పించిన విషయాన్ని ప్రస్తావించారు. ప్రజల సమస్యలను పట్టించుకోని ఈ ప్రభుత్వం త్వరలోనే ప్రజా తీర్పుతో తగిన మూల్యం చెల్లించక తప్పదని నాగార్జున హెచ్చరించారు. ప్రస్తుతం జరుగుతున్న అరాచకాల పాలనకు ముగింపు పలకాలని ప్రజలను పిలుపునిచ్చారు. సమావేశంలో వైఎస్సార్‌ సీపీ రేపల్లె నియోజకవర్గ సమన్వయకర్త పీటా నాగమోహన్‌కృష్ణ, నాయకులు మోపిదేవి శ్రీనివాసరావు, గూడపాటి శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.

నేషనల్‌ క్రైమ్‌ రికార్డ్స్‌ బ్యూరో నివేదిక ప్రకారం అభివృద్ధిలో ఆంధ్రప్రదేశ్‌ చివర నుంచి మూడోస్థానంలో ఉంటే, దాడులు, అరాచకాల విషయంలో మాత్రం దేశంలోనే ముందువరుసలో ఉండటం దురదృష్టకరమన్నారు. అభివృద్ధిని అడ్డుకుని అరాచకాలను పెంచిపోషించే విషయంలో చంద్రబాబు సీనియారిటీ పనిచేస్తోందని మేరుగ నాగార్జున ఎద్దేవా చేశారు. గత వైఎస్సార్‌ సీపీ ప్రభుత్వంలో విద్య, వైద్య రంగాలకు అత్యున్నత ప్రాధాన్యం ఇచ్చి ప్రజల కు భరోసా కల్పించారని గుర్తుచేశారు. ప్రస్తుతం చంద్రబాబు ప్రభుత్వం ఈ రంగాలను పూర్తిగా నిర్లక్ష్యం చేసి ప్రజలను కష్టాల్లోకి నెట్టేస్తోందని ఆరోపించారు. అమ్మఒడి పథకాన్ని తల్లికి వందనంగా మార్చి కేవలం కొంతమందికే రూ.6–7 వేలు జమ చేసి చేతులు దులుపుకోంటోందని ఆరోపించారు. ఫీజు రీయింబర్స్‌మెంట్‌ పథకాన్ని నిర్లక్ష్యం చేయడంతో పేద పిల్లలు ఉన్నత విద్యకు దూరమవుతున్నారన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement