ఉచిత బస్సులతో పెరిగిన ప్రయాణికుల రద్దీ సీట్ల కోసం తరచూ వాగ్వాదాలు పెరిగిన ప్రయాణికుల సంఖ్య.. పెరగని బస్సులు వృద్ధులు, దివ్యాంగులు, పురుష ప్రయాణికులకు తప్పని పాట్లు సీ్త్ర శక్తి బస్సుల్లో ఏడాదిగా అగచాట్లే
అరకొర బస్సులే..!
కొత్త
బస్సుల కోసం ప్రతిపాదనలు పంపాం
నిలబడాలి.. లేదా కలబడాలి
ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం అంటూ టీడీపీ సర్కారు అమలు చేస్తున్న సీ్త్ర శక్తి పథకం దివ్యాంగులు, వృద్ధులు, పురుష ప్రయాణికులకు, మహిళలకు సైతం తిప్పలు తెచ్చిపెడుతోంది.. నిలబడాలి.. లేదా సీటు కోసం కలబడాలి అన్న రీతిలో రోజూ బస్సుల్లో చిన్నపాటి యుద్ధాలే జరుగుతున్నాయి. ప్లాట్‌ఫాంపైకి బస్సు వస్తుందంటే చాలు.. అది ఇంకా ఫర్లాంగు దూరంలో ఉండగానే.. ప్రమాదకరంగా బస్సు వెంట పరుగెడుతూ.. కిటికీల్లో నుంచే తమ చేతిలోని సామగ్రి వేసి సీటు ఆపుకోవాల్సి రావడం.. కొంతమంది బస్సు కిటికీల్లోనుంచి ప్రమాదకర రీతిలో దూరడం వంటివి నిత్యకృత్యంగా మారాయి. సీట్ల కోసం వాదులాటలు, దూషణలు మామూలే. నేతల అదనపు బస్సుల ఏర్పాటు హామీలు నీటి మూటలుగా మారాయి. దీంతో ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణం నరకాన్ని తలపిస్తోంది.
చీరాల: సార్వత్రిక ఎన్నికల్లో ఎలాగైనా గద్దెనెక్కాలని రాష్ట్రమంతటా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కల్పిస్తామని కూటమి నేతలు ఊదరగొట్టారు. అఽధికారంలోకి వచ్చాక ప్లేటు ఫిరాయించి పల్లెవెలుగు, అల్ట్రా పల్లెవెలుగు, ఎక్స్‌ప్రెస్ బస్సుల్లో మాత్రమే ఉచిత ప్రయాణమని మార్గదర్శకాలు ఇచ్చారు. ఎన్నికల సమయంలో ఈ బస్సుల్లోనే ఉచిత ప్రయాణమని చెప్పకుండా అధికారం చేపట్టాక కొన్ని బస్సులకే ఉచితం కల్పించి మహిళలను మోసం చేశారు. అయితే ఈ పథకం సాధ్యాసాధ్యాలపై అవగాహన లేకుండానే మహిళా ఓట్లు దండుకునేందుకు ఆర్భాటంగా ప్రకటించేశారనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఎన్నికల తర్వాత అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం సీ్త్ర శక్తి పథకాన్ని అమలు చేసేందుకు సంవత్సరం పాటు తర్జనభర్జన పడింది. దీనిపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పలు రూపాల్లో ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లడంతో ఇక చేసేదేమీ లేక గత ఏడాది ఆగస్టు 15న సీ్త్ర శక్తి పథకాన్ని ప్రభుత్వం అమలు చేయాల్సి వచ్చింది.
ఎక్కలేం.. ఎక్కితే దిగలేం...
గతంలో ఆర్టీసీ బస్సు ఎక్కాలంటే ఎంతో వీలుగా ఉండేది. ప్రైవేటు వాహనాల కంటే ఆర్టీసీ బస్సులోనే ప్రయాణం సురక్షితం అనేవారు. ప్రస్తుతం ఆ మాట మాట్లాడేవారే లేరు. ఉచిత బస్సు ప్రయాణం కారణంగా బస్సుల్లో ఎక్కువ మంది ప్రయాణిస్తున్నారు. ఇప్పుడు ఏ బస్సు చూసినా ఫుల్లుగా కనిపిస్తోంది. అదే ఫ్రీ బస్ లేని రోజుల్లో అయితే ఎక్కువ మంది ప్రయాణికులు ఎక్కితే ఓఆర్ (ఆక్యుపెన్సీ రేషియో) శాతం పెరిగి సంస్థకు ఆదాయం పెరిగేది. ప్రస్తుతం బస్సులో 60 మంది ప్రయాణికులు ఉంటే అందులో 40 మంది వరకు సీ్త్ర శక్తి టిక్కెట్లే ఉంటున్నాయి. బస్సుల్లో సీటు సంపాదించాలంటే అది పెద్ద సాహసంగా మారింది. రద్దీ కారణంగా టికెట్లు ఇచ్చేందుకు కూడా కండక్టర్లు నానాతంటాలు పడుతున్నారు.
ఆర్టీసీ బస్సుల కంటే అద్దె బస్సులే అదనం
జిల్లాలోని బాపట్ల, చీరాల, రేపల్లె ఆర్టీసీ డిపోల్లో మొత్తం 119 ఆర్టీసీ సంస్థ బస్సులున్నాయి. అలాగే చీరాల డిపోలో 43, బాపట్ల డిపోలో 7, రేపల్లె డిపోలో 10 హైర్ బస్సులున్నాయి. హైర్ బస్సులకు 56 సీటింగ్ కెపాసిటీ ఉండాలి. సర్వీసు రూట్‌ను బట్టి టెండర్లులో కోడ్ చేసిన విధంగా పల్లెవెలుగు బస్సుకు రూ.8 నుంచి రూ.12 ల వరకు, ఎక్స్‌ప్రెస్‌కు రూ.9 నుంచి రూ.14 చొప్పున కిలోమీటరుకు ఇస్తున్నారు. పల్లె వెలుగు బస్సుకు లీటర్ డీజిల్‌కు రూ.5.3 కిలోమీటర్లు ప్రయాణించాలి. మైలేజ్ షార్టేజ్ వస్తే ఆ భారాన్ని యజమానులే భరించాలి. ఫ్రీ బస్సుల వలన ప్రయాణికుల రద్దీ పెరుగుతుంది. ఓవర్ లోడ్ వలన టైర్ల అరుగుదల, ఇంజిన్ సంబంధిత సమస్యలు తలెత్తి మెయింట్‌నెన్స్ ఖర్చు పెరిగిపోతుంది.
బాపట్ల జిల్లాలో చీరాల, బాపట్ల, రేపల్లె డిపోలున్నాయి. మూడు డిపోల్లో మొత్తం 119 బస్సులున్నాయి. వీటిలో సంస్థ కొన్నింటిని అద్దెకు తీసుకుని బస్సులు నడుపుతోంది. మూడు డిపోల్లో నిత్యం సుమారు వంద రూట్లలో ఈ బస్సులు రాకపోకలు సాగిస్తు న్నాయి. చీరాల డిపోలో ఆర్టీసీ, హైర్ బస్సులు కలిపి 64 బస్సులు, బాపట్ల డిపోలో ఆర్టీసీ, హైర్ బస్సులు 35, రేపల్లె డిపోలో ఆర్టీసీ, హైర్ బస్సులు మొత్తం 42 బస్సుల్లో సీ్త్రశక్తి పథకం కింద ఉచిత బస్సు ప్రయాణం జరుగుతోంది. అయితే ప్రయాణికుల రద్దీకి ఇవి ఏమాత్రం సరిపోవడం లేదు. ఉచిత పథకమంటూ.. ఏడాదిగా అమలు చేస్తున్నామంటూ ప్రకటనలతో ఊదరగొడుతున్న టీడీపీ ప్రభుత్వం కొత్త బస్సుల కొనుగోలుపై ఏమాత్రం దృష్టిపెట్టలేదు. దీంతో బస్సుల్లో సీట్ల కోసం చిన్నపాటి యుద్ధాలే జరుగుతున్న దుస్థితి నెలకొంది. తాంబూలాలు ఇచ్చాం తన్నుకు చావండి అన్నరీతిలో ఉచిత పథకం అమలు చేస్తున్నాం.. ఉన్న బస్సుల్లోనే సీట్ల కోసం కొట్టుకు చావండి.. అన్నట్లుగా టీడీపీ ప్రభుత్వ వ్యవహారం ఉందని పలువురు ప్రయాణికులు బహిరంగంగానే విమర్శిస్తున్నారు. అదేవిధంగా ఆయా డిపోల్లో బస్సుల కొరతతో పాటు సిబ్బంది కొరత సైతం వేధిస్తోంది.
జిల్లాలోని మూడు ఆర్టీసీ డిపోల్లో 146 బస్సుల్లో సీ్త్ర శక్తి పథకం అమలు చేస్తున్నాం. అయితే ప్రయాణికుల రద్దీని బట్టి బస్సులను నడుపుతున్నాం. అదనపు బస్సులు ఏర్పాటు చేయాలని, జిల్లాకు 26 కొత్త బస్సులు కావాలని కోరుతూ ఉన్నతాధికారులకు నివేదికలు పంపించాం. ఉన్నతాధికారుల నిర్ణయం తర్వాత కొత్త బస్సులు వచ్చే అవకాశం ఉంది.
– సీహెచ్ విమల, డీపీటీఓ, బాపట్ల


