అక్టోబర్‌లో డీఎస్సీ నోటిఫికేషనంటూ ప్రకటనలు ఇంతలోనే ఉపాధ్యాయ ఖాళీల భర్తీకి తాత్కాలిక నియామకాలు విస్తుపోతున్న నిరుద్యోగులు
డీఎస్సీకి నై.. అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్లకు సై
చీరాల: మెగా డీఎస్సీ పేరుతో రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఉపాధ్యాయ నియామకాలు చేపట్టింది. అయితే నియామకాలలో పలు అక్రమాలు జరిగాయంటూ వైఎస్సార్ సీపీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళనలు జరిగాయి. మెగా డీఎస్సీలో జరిగిన అవకతవకలపై సీబీఐ విచారణ జరిపించాలంటూ రాష్ట్రవ్యాప్తంగా యువత, నిరుద్యోగుల, అర్హులైన అభ్యర్థుల పక్షానా వైఎస్సార్ సీపీ నేతలు గళమెత్తారు. ఈక్రమంలో నిరుద్యోగులను శాంతింప చేసేందుకు ప్రభుత్వం అక్టోబర్‌లో మరో డీఎస్సీ నోటిఫికేషన్ ఇస్తామని ప్రకటించింది. ఇదిలా ఉండగా పాఠశాలల్లో ఖాళీలను భర్తీ చేసేందుకు గతంలో విద్యా వలంటీర్ల తరహాలోనే అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్లు పేరుతో తాత్కాలిక ఉద్యోగాలను తెరపైకి తెచ్చింది. ఇందుకుగాను జిల్లాలో మొత్తం 63 పోస్టులను కేటాయించారు. బాపట్ల జిల్లాలో ఎస్జీటీ పోస్టులు–2, స్కూల్ అసిస్టెంట్ పోస్టులుకు 61 మంది మొత్తం 63 మంది అవసరముందని విద్యాశాఖ ప్రతిపాదనలు సిద్ధం చేసింది.
ఎంపిక విధానం ఇలా...
రాత పరీక్ష లేకుండా కేవలం మెరిట్ ఆధారంగా ఎంపిక చేయనున్నారు. అకడమిక్ అర్హతలకు 75 శాతం వెయిటేజీ, వృత్తిపరమైన అర్హతలు (బీఈడీ/డీఈడీ/టెట్) 25 శాతం వెయిటేజీ ఇస్తారు. స్థానిక గ్రామం/మండలానికి చెందిన అభ్యర్థులకు మొదటి ప్రాధాన్యత ఇస్తారు. ఒక వేళ టెట్ అర్హత ఉన్న వారు అందుబాటులో లేకపోతే ఇతర అర్హతలు ఉన్న వారిని పరిగణనలోకి తీసుకుంటారు.
అరకొర వేతనం.. కష్టాలు అధికం
ప్రభుత్వం నిర్ణయించిన గౌరవ వేతనాలు అతి తక్కువగా ఉన్నాయి. ఎస్టీటీలకు రూ.10 వేలు, స్కూల్ అసిస్టెంట్‌లకు రూ.12,500 లు మాత్రమే చెల్లించనున్నారు. బీఈడీ, టీటీసీ, టెట్ పూర్తి చేసిన వారికి తక్కువ జీతాలు ఇవ్వనున్నారు. తక్కువ వేతనంతో అభ్యర్థులు పనిచేస్తారా అనేది సందేహమే. ప్రైవేటు పాఠశాల్లో ఎలాంటి అనుభవం లేకపోయినా బీఈడీ ఉన్న వారికి రూ.15 వేల నుంచి రూ.20 వేల వరకు వేతనాలు ఇస్తున్నారు. ఎంపికై న వారు సెప్టెంబర్ 1 వ తేదీ నుంచి విధుల్లోకి చేరాల్సి ఉంది. ఈ నియామకాలు కేవలం 2026–27 విద్యాసంవత్సరం ముగిసే వరకు (ఏప్రిల్ 30 వరకు) ఎనిమిది నెలలు మాత్రమే వర్తిస్తాయి. తాత్కాలిక నియామకాలు చేపట్టడంతో ఈ ఏడాది కూడా డీఎస్సీ ఉండే అవకాశం లేనట్లుగా కనిపిస్తోంది.
రేపటి వరకు దరఖాస్తుల స్వీకరణ
ఈనెల 16 నుంచి 19వ తేదీ వరకు ఆయా మండలాల ఎంఈఓ కార్యాలయాల్లో ఆఫ్‌లైన్ ద్వారా దరఖాస్తులను స్వీకరిస్తున్నారు. అందిన దరఖాస్తులను పరిశీలించి జిల్లా కలెక్టర్ అధ్యక్షతన ఉండే కమిటీ ఈనెల 29న ఎంపిక జాబితాను ఖరారు చేస్తుంది. ఈనెల 30,31 తేదీల్లో నియామక పత్రాలు అందచేసి ఎంపికై న వారు సెప్టెంబర్ 1వ తేదీ నుంచి బాధ్యతలు స్వీకరిస్తారు.


