మదనపల్లె: బ్యాంకులు ప్రాధాన్యత రంగాలకు అధిక రుణాలు ఇవ్వాలని జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ కోరారు. శుక్రవారం కలెక్టరేట్లోని వీడియో కాన్ఫరెన్స్ హాల్లో లీడ్ డిస్ట్రిక్ట్ బ్యాంక్ ఆధ్వర్యంలో కలెక్టర్ అధ్యక్షతన జిల్లాస్థాయి సమన్వయ కమిటీ సమావేశాన్ని నిర్వహించారు. ఎల్‌డీఎం ఆంజనేయులు మాట్లాడుతూ బ్యాంకుల రుణాల మంజూరు, 2025–26 ఆర్థిక సంవత్సర లక్ష్యాలు, ప్రాధాన్యత రంగాల రుణాలు, ఆర్థిక సమ్మిళితత్వం కరువు మండలాలకు చేయూత, పీఎం స్వానిధి, పీఎం ఈజీపీ, పీఎం విశ్వకర్మ, పీఎం సూర్య ఘర్‌లపై వివరించారు. కలెక్టర్ మాట్లాడుతూ వ్యవసాయం, ఉద్యానవన పంటలకు రుణాలను మంజూరు చేయాలన్నారు. ప్రైవేట్ బ్యాంకులు రుణాల లక్ష్యాలు సాధించడం లేదన్నారు. ముద్ర యోజన పథకం కింద 8245 లబ్ధిదారులకు రూ. 436 కోట్ల రుణాలు మంజూరు చేశామని ఎల్‌డిఎం అంజనేయులు వివరించగా పూర్తి లక్ష్యాలు సాధించాలని కలెక్టర్ బ్యాంకర్లను ఆదేశించారు. మహిళల నిర్వహిస్తున్న పరిశ్రమలకు రుణాలను వెంటనే అందించాలన్నారు.
మహిళలపై జరుగుతున్న నేరాలను అరికట్టాలి
మదనపల్లెటౌన్: మహిళలపై నేరాలు జరగకుండా అరికట్టాలని కలెక్టర్ నిశాంత్ కుమార్ పిలుపు నిచ్చారు. శుక్రవారం స్థానిక జ్ఞానాంబిక డిగ్రీ కళాశాలలో అంతర్జాతీయ మహిళా దినోత్సవ వారోత్సవాల్లో భాగంగా, మహిళల రక్షణ కోసం ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాలపై అవగాహన కార్యక్రమం జరిగింది. కలెక్టర్ నిశాంత్ కుమార్, ఎస్పీ ధీరజ్, అడిషనల్ ఎస్పీ వెంకటాద్రి పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ మహిళలపై జరుగుతున్న నేరాలను అరికట్టడంలో ప్రజల సహకారం అవసరమన్నారు. నేరా లు జరుగుతున్నట్లు గమనించిన వెంటనే పోలీసులకు, శక్తి టీంకు, విద్యాసంస్థల్లో హెచ్‌ఎంలకు సమాచారం అందించాలన్నారు. సోషల్ మీడియా వాట్సాప్, ఫేస్ బుక్, ఇన్‌స్ట్రాగామ్, ట్విట్టర్ వంటి సామాజిక మాధ్యమాలతో జాగ్రత్తగా ఉండాలని తెలిపారు. సోషల్ మీడియా వినియోగంలో విద్యార్థులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఎస్పీ ధీరజ్ కునుబిల్లి మా ట్లాడుతూ యువత జెన్–జీ తరానికి చెందిన వారు.. సోషల్ మీడియా వినియోగం, వ్యక్తిగత సంబంధాల విషయంలో జాగ్రత్తగా ఉండాలన్నారు. వివా హం వంటి నిర్ణయాలు తీసుకునే ముందు ఉద్యోగం ఉందా లేదా, భవిష్యత్తులో తాను స్వతంత్రంగా నిలవగలనా లేదా, తల్లిదండ్రుల అభిప్రాయం ఏమిటి వంటి అనేక అంశాలను పరిశీలించి, సమగ్రంగా ఆలోచించిన తర్వాతే నిర్ణయాలు తీసుకోవాలని సూచించారు.
కలెక్టర్ నిశాంత్ కుమార్


