సర్వేత్రా అవినీతి! | - | Sakshi
Sakshi News home page

సర్వేత్రా అవినీతి!

Mar 7 2026 7:36 AM | Updated on Mar 7 2026 7:36 AM

సర్వేత్రా అవినీతి!

అవగాహన లోపమంటూ ‘బుకాయింపు’

మదనపల్లె (సాక్షి నెట్‌వర్క్‌): సామాజిక భద్రతా పింఛన్ల పంపిణీలో క్షేత్రస్థాయిలో జరుగుతున్న దోపిడీని సాక్షాత్తూ ప్రభుత్వ అధికారిక నివేదికలే ధ్రువీకరిస్తున్నాయి. ‘మేం ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి మాట్లాడుతున్నాం.. పింఛన్‌ పంపిణీపై మీ అభిప్రాయం చెప్పండి‘ అంటూ ప్రభుత్వం నిర్వహించిన ఐవీఆర్‌ఎస్‌ (IVRS) సర్వేలో విస్తుపోయే నిజాలు వెలుగుచూశాయి. జనవరి, ఫిబ్రవరి నెలల్లో అవినీతి పతాకస్థాయికి చేరిందని, లబ్ధి దారుల నుంచి అక్రమ వసూళ్లు యథేచ్ఛగా సాగుతున్నాయని ఈ సర్వే అంకెలతో సహా నిగ్గుతేల్చింది. ఈ అంశాన్ని ఈనెల 2వ తేదీన మదనపల్లెలో జరిగిన జిల్లా అభివృద్ధి, సమీక్షా సమావేశానికి (డీడీఆర్‌సీ) రూపొందించిన ప్రగతి నివేదికలో జిల్లా ప్రభుత్వ శాఖలే స్వయంగా పొందుపరిచాయి.

బట్టబయలైన అక్రమ వసూళ్లు

జిల్లాలో ప్రస్తుతం 26 రకాల కేటగిరీల కింద మొత్తం 1,89,019 పింఛన్లు అమలవుతున్నాయి. వీటి పంపిణీలో జరుగుతున్న అక్రమాలపై ప్రభుత్వం లబ్ధిదారుల ఫోన్లకు ఫోన్‌ చేసి మూడు ప్రధాన అంశాలపై ఆరా తీసింది. ఈ సర్వేలో తేలిన గణాంకాలు ఇలా ఉన్నాయి:

వసూళ్ల పర్వం: పింఛన్‌ పంపిణీలో అధికారి డబ్బులు వసూలు చేశారా? అన్న ప్రశ్నకు 2026 జనవరిలో 87.60 శాతం మంది ’అవును’ అని సమాధానమిచ్చారు. ఫిబ్రవరి నాటికి ఈ అవినీతి ఆరోపణలు 89.50 శాతానికి పెరిగాయి.

పంపిణీ తీరు: పింఛన్‌ ఇంటి వద్దనే ఇచ్చారా అన్న ప్రశ్నకు జనవరిలో 92.30 శాతం మంది ’లేదు’ అని సమాధానమివ్వగా, ఫిబ్రవరిలోనూ దాదాపు అదే పరిస్థితి (92.10% అవును, 7.9% లేదు) కొనసాగింది.

అధికారుల ప్రవర్తన: పింఛన్‌ అందించే అధికారి ప్రవర్తన ఎలా ఉంది? అన్న అంశంపై కూడా లబ్ధిదారులు తమ అసంతృప్తిని ఐవీఆర్‌ఎస్‌ ద్వారా వ్యక్తపరిచినట్లు నివేదిక స్పష్టం చేస్తోంది. గతంలో ఈ అవినీతి శాతం 12 నుంచి 14 శాతం లోపు ఉండగా, గత రెండు నెలల్లో అది ఏకంగా 90 శాతానికి చేరువవ్వడం వ్యవస్థలో వేళ్లూనుకున్న అవినీతికి నిదర్శనంగా నిలుస్తోంది.

సర్వేలో ఇంత భారీ ఎత్తున అవినీతి బయటపడినా, అధికారులు మాత్రం వింత వివరణ ఇస్తు న్నారు. లబ్ధిదారులకు మొబైల్‌ ఫోన్ల వినియోగంపై అవగాహన లేదని, పింఛన్‌దారులు వలసలు వెళ్తుండటం వల్ల వంద శాతం సంతృప్తిని సాధించలేకపోతున్నామని సాకులు వెతుకుతున్నారు. క్షేత్రస్థాయిలో అక్రమాలను అరికట్టాల్సింది పోయి, కేవలం అవగాహన లేదంటూ నివేదించడంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. సాక్షాత్తూ అధికారిక నివేదికలోనే అంకెలు స్పష్టంగా కనిపిస్తున్నా, ఇప్పటి వరకు బాధ్యులపై చర్యలు తీసుకోకపోవడం గమనార్హం.

పింఛన్లలో ‘చిలక్కొట్టుడు’.. నిగ్గుతేల్చిన సర్కారు సర్వే!

అవినీతి అక్రమాలపై 89 శాతంమంది లబ్ధిదారుల గళం

ముఖ్యమంత్రి కార్యాలయం నుంచివెళ్లిన ఐవీఆర్‌ఎస్‌ కాల్స్‌లోనిజాలు బట్టబయలు

జనవరి, ఫిబ్రవరి నెలల్లో పెరిగిన వసూళ్ల పర్వం

అవగాహన లోపమంటూతప్పించుకుంటున్న అధికారులు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement