రాయచోటి: సంస్కృతి, సంప్రదాయాల సంరక్షణకు భాషోత్సవాలు దోహదపడతాయని సమగ్ర శిక్ష అదనపు ప్రాజెక్టు కో–ఆర్డినేటర్ అనురాధ తెలిపారు. శుక్రవారం డైట్ కళాశాల ఆవరణలో జిల్లాస్థాయి భాషోత్సవాలను నిర్వహించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో అనురాధ మాట్లాడుతూ భాష ద్వారా సంప్రదాయాలు, చరిత్ర, విలువలు తరతరాలకు చేరవేయవచ్చన్నారు. డైట్ ఇన్‌చార్జ్ ప్రిన్సిపాల్ మడితాటి నరసింహారెడ్డి మాట్లాడుతూ విద్యార్థుల్లో భావ వ్యక్తీకరణ సామర్థ్యాన్ని పెంపొందించడంలో భాషోత్సవాలు ముఖ్యపాత్ర పోషిస్తాయన్నారు. కార్యక్రమ కో–ఆర్డినేటర్ ఏఏఎంఒ అసదుల్లా భాష మాట్లాడుతూ జిల్లాస్థాయిలో తెలుగు, ఇంగ్లీషు, ఉర్దూ, ట్రైబల్ బాషలలో ప్రాథమిక పాఠశాలలు, ఉన్నత పాఠశాలల విద్యార్థులకు భాష పరిజ్ఞానంపై టాలెంట్ టెస్టులను నిర్వహించారు. ఇందులో ప్రథమ, ద్వితీయ స్థానాలు పొందిన విద్యార్థులకు ప్రశంసా పత్రాలతోపాటు జ్ఞాపికలను అందజేశామన్నారు. తెలుగు భాషకు సేవ చేసిన ఆర్ రెడ్డయ్య, లోక జగన్నాథ శాస్త్రి, ఇంగ్లీషు భాషకు సేవ చేసిన పద్మావతి, గంగిరెడ్డి, అలాగే ఉర్దూ భాషకు సేవలందించిన మహమ్మద్ హసీంలకు జ్ఞాపికలను ఇచ్చి సన్మానించారు. ఈ కార్యక్రమంలో జిల్లా సైన్స్ అధికారి మార్ల ఓబుల్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.


