దగాపడ్డ తమ్ముళ్లు! | Sakshi
Sakshi News home page

దగాపడ్డ తమ్ముళ్లు!

Published Sat, Mar 30 2024 1:55 AM

- - Sakshi

ఆశావహులపై ‘బాబు’నీళ్లు

సుబ్రహ్మణ్యం ఎంపికపై టీడీపీ వర్గీయుల్లో తీవ్ర అసంతృప్తి

రాజంపేటలో రాజీనామాలకు సిద్ధపడ్డ పార్టీ క్యాడర్‌

రాజంపేట: టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు చేతిలో రాజంపేట తమ్ముళ్లు మరోసారి దగాపడ్డారు. శుక్రవారం రాజంపేట టీడీపీ ఎమ్మెల్యే టికెట్‌, గతంలో రాయచోటి ఎమ్మెల్యే అభ్యర్థ్ధిగా ఓడిపోయిన సుగవాసి బాలసుబ్రమణ్యంకు టికెట్‌ కేటాయించడంతో రాజంపేట టీడీపీ వర్గీయుల్లో అసంతృప్తి జ్వాలలు ఎగిసిపడ్డాయి. తాము ఆశించిన నేత, రాజంపేట టీడీపీ ఇన్‌చార్జి బత్యాల చెంగల్రాయుడుకు ఎమ్మెల్యే టికెట్‌ దక్కకపోవడంతో పలువురు పార్టీ క్యాడర్‌లోని నేతలు రాజీనామాలు చేస్తామని అధిష్టానానికి హెచ్చరికలు జారీ చేశారు. టీడీపీ కరపత్రాలను దగ్ధం చేశారు. తమనేత బత్యాల అభ్యర్థి కాకపోతే రాజంపేటలో టీడీపీ ఓటమి తధ్యమని తమ్ముళ్లు స్పష్టం చేశారు. రాజంపేట బత్యాల భవన్‌ వద్ద టీడీపీ రాష్ట్ర ఎస్సీ సెల్‌ కార్య నిర్వాహక కార్యదర్శి మందా శ్రీనివాసులు హల్చల్‌ చేశారు.

తమ నాయకుడు చెంగల్‌ రాయుడు కు రాజంపేట టీడీపీ టికెట్‌ రాకపోవడంతో మందా శీను మనస్థాపం చెందారు. తమ నాయకుడికి టికెట్‌ ఇవ్వాలని, లేని పక్షంలో ఆత్మహత్య చేసుకుంటానని భవనం పైకెక్కాడు. వెంటనే అప్రమత్తమైన టీడీపీ శ్రేణులు సముదాయించి కిందికి దించారు. కాగా రాజంపేట టికెట్‌ను టీడీపీ నుంచి బత్యాల చెంగల్రాయుడుతోపాటు పార్లమెంటరీ జిల్లా అధ్యక్షుడు చమర్తి జగన్‌మోహన్‌రాజు, రాజంపేట వ్యవసాయమార్కెట్‌కమిటి మాజీ చైర్మన్‌ పోలి సుబ్బారెడ్డి, మరో నాయకుడు మేడా విజయశేఖర్‌రెడ్డి టికెట్‌ ఆశించినవారిలో ఉన్నారు. టీడీపీ పార్టీ ఆవిర్భావం రోజున వీరందరికి చంద్రబాబు షాక్‌ ఇచ్చారు.

చతికిలపడ్డ ‘సేన’
రాజంపేటలో జనసేనకు టికెట్‌ దక్కుతుందన్న ఆశతో నియోజకవర్గంలో పలువురు జనసేన తరపున కార్యక్రమాలు చేపట్టారు. నందలూరుకు చెందిన యల్లటూరు శ్రీనువాసురాజు ఏకంగా తన ఉద్యోగ పదవికి వీఆర్‌ఎస్‌ ఇచ్చి మరీ జనసేనలో చేరారు. అలాగే కాపు సామాజికవర్గానికి చెందిన అతికారి దినేష్‌, మలిశెట్టి వెంకటరమణ టికెట్‌ను ఆశించి భంగపడ్డారు.

అనుహ్యంగా తెరపైకి బాలసుబ్రమణ్యం..
రాజంపేట టీడీపీ టికెట్‌ సుగవాసి బాలసుబ్రమణ్యం కు కేటాయించడంతో టీడీపీ రాజకీయాలు వేడె క్కాయి. నాన్‌లోకల్‌ను రాజంపేటకు తీసుకొచ్చి మరి పోటీ చేయించడంపై టీడీపీ కేడర్‌ పెదవివిరుస్తోంది.

Advertisement
Advertisement