వైఎస్సార్‌సీపీ రాజకీయ సహాయకుడు (పీఏ) కేఎన్‌ఆర్
ఎల్లో మీడియాపై న్యాయపరంగా చర్యలు..
కనీస ఆధారాలు లేకుండా విష ప్రచారం చేస్తున్నారు
నాకు సంబంధంలేని ఆస్తులను నావిగా చెబుతున్నారు
విశాఖలో ప్రాజెక్టు కోసం మత్సడో కంపెనీతో ఏపీ ప్రభుత్వ ఒప్పందం
అది 20 ఏళ్ల క్రితం చంద్రబాబు ప్రభుత్వ హయాంలోనే ఒప్పందం
ఆ కంపెనీ వ్యవహారాలతో నాకేం సంబంధం?
సింగపూర్ వాసి రమణారెడ్డి.. టీడీపీకే సన్నిహితుడు
సింగపూర్ మంత్రులను చంద్రబాబుకు పరిచయం చేసింది ఆయనే
జురాంగ్ కంపెనీని అమరావతికి తీసుకొచ్చింది ఆయనే మరి రమణారెడ్డి నాకు ఎలా బినామీ అవుతారు?
సాక్షి, అమరావతి: కనీస ఆధారాలు లేకుండా తనపై దు్రష్పచారం చేస్తూ వ్యక్తిత్వ హననానికి పాల్పడుతున్న టీడీపీ అనుకూల ఎల్లో మీడియాపై న్యాయపరంగా చర్యలు తీసుకుంటానని వైఎస్సార్‌సీపీ రాజకీయ సహాయకుడు (పీఏ) కె.నాగేశ్వర్‌రెడ్డి (కేఎన్‌ఆర్) ప్రకటించారు. ఎల్లో మీడియా దు్రష్పచారాన్ని కోర్టు దృష్టికి తీసుకువెళ్తానని, చట్టపరంగా చర్యలు తీసుకుంటానని ఆదివారం ఆయన ఓ ప్రకటనలో పేర్కొన్నారు. తనకు సంబంధంలేని మద్యం విధానంపై ఎల్లో మీడియా విష ప్రచారం చేస్తోందని విమర్శించారు. ఆ ప్రకటనలో కేఎన్‌ఆర్ ప్రధానంగా పేర్కొన్న అంశాలు ఇవీ..
⇒ ఎల్లో మీడియా నాపై వ్యక్తిత్వ హనానికి పాల్పడుతోంది. నేను సీనియర్ జర్నలిస్ట్‌ను. 2003లోనే ఒక ప్రముఖ వార్తా పత్రికలో ఎడిషన్ ఇన్‌ఛార్జిగా పనిచేశా. 20 ఏళ్ల కిందటే సొంతంగా వ్యాపారాలు మొదలు పెట్టి అప్పటి నుంచి ఆదాయపు పన్ను రిటరŠన్స్ దాఖలు చేస్తున్నా. ఆదాయపు పన్ను చెల్లిస్తున్నా. వ్యాపారాల కోసం బ్యాంకుల నుంచి రుణం తీసుకున్నా. నాకు ఏమాత్రం సంబంధంలేని అంశాలను ఆపాదిస్తూ విష ప్రచారం చేస్తున్నారు. నా బంధువులు, స్నేహితుల ఆస్తులు కూడా నావే అనడం ఎంతవరకు న్యాయం? అలా అయితే వ్యాపారాలు చేసే ప్రతి ఒక్కరినీ అలాగే చూడాల్సి వస్తుంది. రామోజీరావు, ఏబీఎన్ రాధాకృష్ణ, బి.ఆర్.నాయుడు తదితరులు ముఖ్యమంత్రి చంద్రబాబుకు సన్నిహితులే. మరి వారి ఆస్తులన్నీ కూడా చంద్రబాబువే అవుతాయా?
⇒ విశాఖపట్నంలో ఏపీ హౌసింగ్ బోర్డుకు చెందిన భూముల విషయాన్ని వక్రీకరిస్తూ నాపై దు్రష్పచారం చేస్తున్నారు. హౌసింగ్ బోర్డుకు చెందిన 97.50 ఎకరాలను అభివృద్ధి చేసేందుకు రెండు దశాబ్దాల క్రితం ఏపీ ప్రభుత్వం, సింగపూర్‌కు చెందిన మత్సడో ఇండస్ట్రీస్ మధ్య ఒప్పందం కుదిరింది. చంద్రబాబు ప్రభుత్వ హయాంలోనే ఆ ఒప్పందం చేసుకున్నారు. అదంతా చట్టబద్ధ వ్యవహారమే. దాంతో నాకే మాత్రం సంబంధం లేదు. ప్రస్తుతం ఆ మొత్తం ప్రక్రియను వక్రీకరిస్తూ ఎల్లో మీడియా నాపై దుష్ప్రచారం చేస్తోంది.
⇒ ఎల్లో మీడియా ప్రస్తావించిన రమణారెడ్డి సింగపూర్‌వాసి. ఆయన మత్సడో కంపెనీలో వాటాదారు కూడా కాదు. కానీ ఆయనకు, నాకు మధ్య ఏదో వ్యాపార లావాదేవీలు ఉన్నాయని అవాస్తవ ప్రచారం చేస్తున్నారు. ఆయన 2003లో చంద్రబాబు ప్రభుత్వ హయాంలోనే ఏపీలో వ్యాపారాలు ప్రారంభించారు. విశాఖపట్నంలోనే నాలుగు ప్రాజెక్టులు చేపట్టారు. చంద్రబాబుకు సింగపూర్‌లో మంత్రులు, వ్యాపారవేత్తలను పరిచయం చేయడంలో కీలక పాత్ర పోషించారు. ఆయన చంద్రబాబుకే సన్నిహితుడు. సింగపూర్‌కు చెందిన జురాంగ్ కంపెనీని అమరావతికి తీసుకురావడంలో రమణారెడ్డే సహకరించారని కూటమి ప్రభుత్వమే చెబుతోంది. మరి ఆయన నాకు బినామీ ఎలా అవుతారు...? ఆయన నా బినామీగా ఎల్లో మీడియా ఎలా దు్రష్పచారం చేస్తుంది?
⇒ విజయవాడలో ఎవరో రియల్టర్‌ను నేను బెదిరించినట్లు ఎల్లో మీడియా కట్టుకథలు అల్లుతోంది. నేను గన్ పెట్టి మరీ బెదిరించానని విష ప్రచారం చేయడం విడ్డూరంగా ఉంది. నాపై ఎవరూ ఫిర్యాదు చేయలేదు. కానీ ఎల్లో మీడియా మాత్రం దుష్ప్రచారం చేస్తుండటం విడ్డూరంగా ఉంది. రాజకీయ కుట్రతో ఎల్లో మీడియా చేస్తున్న దుష్ప్రచారాన్ని తిప్పికొడతాం. న్యాయపరంగా కఠిన చర్యలు తీసుకుంటా.
ఆ ప్రాపర్టీకి, కేఎన్నార్‌కు సంబంధమే లేదు
⇒ హైకోర్టు మాజీ న్యాయమూర్తి ఆధ్వర్యంలో జరిగిన ఆర్బిట్రేషన్‌కు వక్రీకరణలు చేస్తారా?
⇒ ప్రతి అంశానికి డాక్యుమెంట్లు ఉన్నా.. బినామీ ముద్ర వేయడం, విష ప్రచారం చట్టరీత్యా నేరం
విశాఖపట్నం హౌసింగ్ బోర్డుకు చెందిన 97.5౦ ఎకరాల అభివృద్ధి చేయడానికి దాదాపు రెండు దశాబ్దాల క్రితం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి, సింగపూర్‌కు చెందిన మత్సడో ఇండస్ట్రీస్ ప్రైవేట్ లిమిటెడ్‌కు మధ్య ఒప్పందం కుదిరింది. ఈ కంపెనీలో అనేక కంపెనీలు, వ్యక్తులు దాదాపు రూ.650 కోట్ల పెట్టుబడులు పెట్టారు. ఇవన్నీ చట్టబద్ధంగా నడిచిన ప్రక్రియ. కానీ పనులు ఎంతకూ ప్రారంభం కాకపోవడంతో పెట్టుబడిదారులు తీవ్రంగా నష్టపోయారు. ఈ నేపథ్యంలో మత్సడో ఇండస్ట్రీస్ ప్రైవేట్ లిమిటెడ్‌కి, అందులో పెట్టుబడులు పెట్టిన వారికి మధ్య ఉన్న వివాదాన్ని సెటిల్ చేసుకున్నారు. హైకోర్టు మాజీ న్యాయమూర్తి ఆధ్వర్యంలో చట్టబద్ధంగా దీనిపై ఆర్బిట్రేషన్ ప్రక్రియ జరిగింది. మత్సడో కంపెనీ తన వద్ద పెట్టిన పెట్టుబడుల మేరకు భూములను అప్పగించింది. ఆ కంపెనీలో దాదాపు 13 పార్టీలు పెట్టుబడులు పెడితే.. ఒక్కో పార్టీలో మళ్లీ వేర్వేరు కంపెనీలు, వ్యక్తులు ఉన్నారు.
ఇందులో 13వ పార్టీలో ఒక కంపెనీతోపాటు మరో ఇద్దరు వ్యక్తులు ఉన్నారు. ఈ ముగ్గురిలో కేఎన్నార్ బావమరిది రాంగోపాల్‌రెడ్డి కూడా ఉన్నారు. ఈ ముగ్గురూ కలసి పెట్టిన పెట్టుబడికి గాను వివాద పరిష్కారంలో భాగంగా 2.5 ఎకరాలను మత్సడో వారికి దఖలు పరిచింది. ఈ వ్యవహారం అంతా చట్టపరంగా జరిగింది. ప్రతి అంశానికి డాక్యుమెంట్లు ఉన్నా కూడా దీనికి బినామీ ముద్ర వేయడం, విష ప్రచారం చేయడం చట్టరీత్యా నేరం. ఈనాడు, ఆంధ్రజ్యోతి కథనాల్లో ప్రస్తావించిన సింగపూర్ వాసి రమణారెడ్డితో మత్సడోకు, దాంట్లో పెట్టుబడి పెట్టున వారికి ఎలాంటి సంబంధం లేదు. అతను వాటాదారు కూడా కాదు. ఎలాంటి క్రయ విక్రయాలు కూడా జరపలేదు. రమణారెడ్డి, కేఎన్నార్ మధ్య బినామీ వ్యవహారం నడిచినట్టుగా తప్పుడు ప్రచారం చేయటాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. ఆ ప్రాపర్టీకి, కేఎన్నార్‌కు సంబంధమే లేదు. విష కథనాలు ఆపకపోతే తగిన మూల్యం చెల్లించాల్సి ఉంటుంది. తప్పుడు ప్రచారాలు చేసినందుకు కోర్టుకు ఈడుస్తాం.
– పి.శ్రేయస్‌రెడ్డి, న్యాయవాది


