ఫేస్‌బుక్‌ పేజీని బ్లాక్‌ చేయడంపై వైఎస్సార్‌సీపీ న్యాయ పోరాటం | YSRCP Legal Battle Over Blocking Of Facebook Page, Seeks Meta And Government Records Behind Action | Sakshi
Sakshi News home page

ఫేస్‌బుక్‌ పేజీని బ్లాక్‌ చేయడంపై వైఎస్సార్‌సీపీ న్యాయ పోరాటం

Jun 17 2026 5:54 AM | Updated on Jun 17 2026 10:52 AM

YSRCP legal battle over blocking of Facebook page

ఏ అధికారి ఉత్తర్వులిస్తే మా పేజీ బ్లాక్‌ చేశారో చెప్పేలా ఆదేశాలివ్వండి 

నోటీసుల ప్రతులను అందజేసేలా కూడా ఆదేశాలివ్వండి 

మెటా నిబంధనలకు విరుద్ధంగామా పేజీని బ్లాక్‌ చేశారు 

మా పేజీని బ్లాక్‌చేసి మా హక్కులను హరించింది 

ఈ వ్యవహారంలో జోక్యం చేసుకోండి 

హైకోర్టులో వైఎస్సార్‌సీపీ పిటిషన్‌ 

సాక్షి, అమరావతి: వైఎస్సార్‌సీపీ అధికారిక ఫేస్‌బుక్‌ పేజీని అందుబాటులో లేకుండా చేసిన చంద్రబాబు ప్రభుత్వ దుశ్చర్యపై ఆ పార్టీ న్యాయ పోరాటానికి దిగింది. వైఎస్సార్‌సీపీ ఫేస్‌బుక్‌ పేజీని భారతదేశంలో నిలిపివేయడానికి ఏ ప్రభుత్వ అధికారి ఉత్తర్వులిచ్చారు?, ఏ నిర్దిష్ట కంటెంట్‌ ఆధారంగా ఈ చర్య తీసుకున్నారు?అనే పూర్తి వివరాలను, నోటీసుల అసలు ప్రతులను వెంటనే తమకు అందజేసేలా మెటాను ఆదేశించాలని కోరుతూ వైఎస్సార్‌సీపీ ప్రధాన కార్యదర్శి లేళ్ల అప్పిరెడ్డి మంగళవారం హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. ఐటీ చట్టంలోని సెక్షన్‌ 79(3)(బీ) కింద ఏదైనా ఖాతాదారుడి కంటెంట్‌ను తొలగించినప్పుడు, ప్రభుత్వ నోటీసు నకలును సదరు ఖాతాదారుడికి అందించాల్సిన బాధ్యత సంబంధిత సోషల్‌ మీడియా సంస్థ అయిన మెటాపై ఉందన్నారు. 

వైఎస్సార్‌సీపీ ఫేస్‌బుక్‌ పేజీని బ్లాక్‌ చేసే విషయంలో మెటా నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించిందని తెలిపారు. ఫేస్‌బుక్‌ పేజీని బ్లాక్‌ చేయడానికి గల కారణాలను తెలియజేయకపోవడం, అందుకు సంబంధించిన నోటీసు కాపీని ఇవ్వకపోవడం చట్టవిరుద్ధం, ఏకపక్షం, రాజ్యాంగ విరుద్ధంగా ప్రకటించాలని ఆయన హైకోర్టును అభ్యరి్థంచారు. ఈ వ్యాజ్యం తేలేంతవరకు, సదరు బ్లాకింగ్‌కు దారితీసిన ప్రభుత్వ నోటీసులు, కమ్యూనికేషన్ల కాపీలను తక్షణమే పిటిషనర్లకు సమర్పించేలా మెటా సంస్థను ఆదేశిస్తూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేయాలని కోర్టును కోరారు. 

‘మెటా అధికార పార్టీకి సహకరిస్తోంది’ 
‘శ్రేయా సింఘాల్‌ వర్సెస్‌ యూనియన్‌ ఆఫ్‌ ఇండియా కేసులో ప్రభుత్వ నోటీసులను సాకుగా చూపి సోషల్‌ మీడియా ప్లాట్‌ఫామ్‌లు తమ ఇష్టానుసారంగా వ్యవహరించకూడదని సుప్రీంకోర్టు చాలా స్పష్టమైన తీర్పునిచ్చింది. ఈ బ్లాకింగ్‌ ప్రభుత్వ ‘సహయోగ్‌ పోర్టల్‌’ ద్వారా జరిగిందని భావిస్తున్నారు. అయితే, నోటీసు ఇచ్చిన సంస్థ అసలు చట్టబద్ధంగా నోటిఫై చేయబడిన సంస్థేనా కాదా అనే వివరాలు దాచారు. ఐటీ బ్లాకింగ్‌ రూల్స్‌–2009లోని రూల్‌ 16 ప్రకారం కొన్ని విషయాలు రహస్యంగా ఉంచవచ్చు. కానీ అది సెక్షన్‌ 69ఏ కింద చేసే బ్లాకింగ్‌కు మాత్రమే వర్తిస్తుంది. 

సెక్షన్‌ 79(3)(బీ) కింద మెటా తీసుకునే చర్యలకు ఈ రహస్య నిబంధన వర్తించదు. తటస్థ వేదికగా ఉండాల్సిన మెటా, అధికార పక్షం చెప్పినట్లు వింటూ ప్రతిపక్ష పార్టీ గొంతు నొక్కడానికి సహకరిస్తోంది. తద్వారా అది తన తటస్థతను కోల్పోయింది’ అని వివరించారు. ఈ వ్యాజ్యంలో కేంద్ర ఎల్రక్టానిక్స్, ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ కార్యదర్శి, కేంద్ర ఎల్రక్టానిక్స్, ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ డిజిగ్నేటెడ్‌ ఆఫీసర్, మెటా ప్లాట్‌ఫామ్‌ ఇంక్, రాష్ట్ర హోంశాఖ ముఖ్య కార్యదర్శిని ప్రతివాదులుగా పేర్కొన్నారు.  

‘మా భావ ప్రకటన స్వేచ్ఛ హరించడమే’ 
‘2026 జూన్‌ 9న వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధికారిక ఫేస్‌బుక్‌ పేజీని భారతదేశంలో ఎవరికీ కనిపించకుండా మెటా సంస్థ నిలిపివేసింది. ఐటీ చట్టంలోని సెక్షన్‌ 79(3)(బీ) కింద భారత ప్రభుత్వం, లా ఎన్‌ఫోర్స్‌మెంట్‌ ఏజెన్సీల నుంచి వచ్చిన నోటీసు ఆధారంగా ఈ పేజీని నిలిపివేసినట్టు మెటా పేర్కొంది.  అయితే, ఏ అధికారి లేదా ఏ శాఖ నోటీసు ఇచ్చిందో మెటా స్పష్టం చేయలేదు. ఎటువంటి ముందస్తు నోటీసు లేదా సంజాయిషీ ఇచ్చుకునే అవకాశం ఇవ్వకుండా రాత్రికి రాత్రే ఫేస్‌బుక్‌ పేజీని బ్లాక్‌ చేశారు. 

రాజకీయ పార్టీగా ప్రజలతో, లక్షలాది మంది ఫాలోవర్లతో కమ్యూనికేట్‌ చేయడం మా పార్టీ ప్రాథమిక హక్కు. మా పార్టీ అధికారిక ఫేస్‌బుక్‌ పేజీని బ్లాక్‌ చేయడం రాజ్యాంగం మాకు ప్రసాదించిన భావప్రకటన స్వేచ్ఛను హరించడమే. ఏదైనా నిర్దిష్ట పోస్ట్, వీడియో లేదా ఇమేజ్‌ చట్టవిరుద్ధంగా ఉంటే దాన్ని తొలగించవచ్చు. కానీ, కేవలం ఒక అస్పష్టమైన నోటీసుతో ఒక ప్రధాన ప్రతిపక్ష పార్టీకి చెందిన మొత్తం ఫేస్‌బుక్‌ పేజీని బ్లాక్‌ చేయడం చట్టపరిధిని మించిన చర్య’ అని అప్పిరెడ్డి తన వ్యాజ్యంలో పేర్కొన్నారు.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement