సాక్షి, తిరుమల: తిరుమలలోని అలిపిరి బస్టాండ్ వద్ద ఉద్రిక్తత చోటుచేసుకుంది. అలిపిరి వద్ద వీధి వ్యాపారులకు మద్దతుగా ర్యాలీగా బయలుదేరిన వైఎస్సార్‌సీపీ నాయకులు భూమన అభినయ్ రెడ్డి సహా పలువురు నేతలను పోలీసులు అడ్డుకున్నారు. అనంతరం, భూమన అభినయ్ రెడ్డితో పాటుగా నేతలను పోలీసులు అరెస్ట్ చేశారు. దీంతో, ఎస్సీ యూనివర్సిటీ పోలీసు స్టేషన్‌కు అభినయ రెడ్డిని పోలీసులు తరలించారు. ఈ క్రమంలో చిరు వ్యాపారులు, వైఎస్సార్‌సీపీ నేతలను పోలీసులు ఈడ్చుకెళ్లారు.
మరోవైపు.. చిరు వ్యాపారులకు న్యాయం చేయాలని వైఎస్సార్‌సీపీ డిమాండ్ చేసింది. అంతకుముందు అలిపిరి-జూపార్క్ రోడ్‌లో వీధి వ్యాపారులకు మద్దతుగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు భూమన అభినయ్ రెడ్డి సంఘీభావం తెలిపారు. కూటమి నేతలు సూచనతో బలవంతంగా చిరు వ్యాపారుల తోపుడు బండ్లు తొలగింపుపై ఆగ్రహం వ్యక్తం చేశారు.
కూటమి నేతల అప్రజాస్వామ్య చర్యలపై భూమన అభినయ్ రెడ్డి నేతృత్వంలో అలిపిరి జూపార్క్ రోడ్ వ్యాపారులకు మద్దతుగా క్షేత్ర స్థాయిలో పార్టీ నేతలు పర్యటన చేపట్టారు. ఈ సందర్బంగా పార్టీ నాయకులు, కార్యకర్తల పర్యటనను పోలీసులు అడ్డుకునే ప్రయత్నం చేశారు. పోలీస్ 30 యాక్ట్ పేరుతో అడ్డుకునేందుకు నోటీసులు ఇచ్చారు. అయినప్పటికీ అలిపిరి వద్ద తోపుడు బండ్లు వ్యాపారులకు వైఎస్సార్‌సీపీ మద్దతుగా నిలిచింది.


