ఒమన్‌ తీరంలో నౌకపై దాడి.. సురేష్ మృతి పట్ల వైఎస్‌ జగన్ దిగ్భ్రాంతి | YS Jagan Expresses Shock Over Marine Engineer Suresh Death in Oman Ship Attack | Sakshi
Sakshi News home page

ఒమన్‌ తీరంలో నౌకపై దాడి.. సురేష్ మృతి పట్ల వైఎస్‌ జగన్ దిగ్భ్రాంతి

Jun 12 2026 6:52 AM | Updated on Jun 12 2026 7:21 AM

YS Jagan Expresses Shock Over Marine Engineer Suresh Death in Oman Ship Attack

సాక్షి,తాడేపల్లి: ఒమన్‌ తీరంలో భారతీయులు ప్రయాణిస్తున్న నౌకపై జరిగిన దాడి ఘటనలో వైజాగ్‌కు చెందిన మెరైన్‌ ఇంజినీర్‌ సురేశ్‌ పట్నాల మృతిచెందడం అత్యంత విషాదకరమని వైఎస్సార్‌సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పేర్కొన్నారు.

ఈ ఘటనలో ముగ్గురు భారతీయులు ప్రాణాలు కోల్పోవడం బాధాకరమని, వారిలో ఆంధ్రప్రదేశ్‌కు చెందిన సురేశ్‌ పట్నాల ఉండటం మరింత కలచివేసిందని అన్నారు. ఒక మెరైన్‌ ఇంజినీర్‌ ఇలా అకాల మరణం చెందడం దురదృష్టకరమన్నారు. సురేష్‌ను కోల్పోయిన కుటుంబం ఎదుర్కొంటున్న వేదన మాటల్లో చెప్పలేనిదన్నారు.

మృతుడు సురేశ్‌ పట్నాల కుటుంబ సభ్యులకు వైఎస్ జగన్ తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. ఈ తీరని విషాదాన్ని తట్టుకునే మనోధైర్యాన్ని దేవుడు వారికి  ఇవ్వాలని కోరారు. సురేశ్‌ పట్నాల ఆత్మకు శాంతి చేకూరాలని వైఎస్‌ జగన్ ఆకాంక్షించారు.

ఒమన్‌ తీరంలో నౌకపై దాడి
వైజాగ్‌కు చెందిన మెరైన్ ఇంజినీర్ పత్నాల సురేష్ (44) విధులు నిర్వహించిన నౌకపై ఒమన్ తీరంలో అమెరికా సైన్యం మిసైళ్లతో దాడి జరిపింది. ఈ దాడిలో ఆయనతో పాటు మరో ఇద్దరు భారతీయులు ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటన జూన్ 10న హర్మూజ్‌ జలసంధిలోని ఒమన్‌ తీరంలో ‘ఎంటీ సెట్టెబెల్లో’ అనే ఆయిల్ ట్యాంకర్‌పై మిసైల్ దాడి సమయంలో జరిగింది. ఈ నౌక ఇరాన్‌ నుంచి చమురును దిగుమతి చేసుకుంటూ నిబంధనల్ని ఉల్లంఘించే ప్రయత్నం చేసిందని అమెరికా సైన్యం ఆరోపించింది.

ఎంటీ సెట్టెబెల్లో నౌకపై అమెరికా సైన్యం జరిపిన మిసైల్‌ దాడిలో  సురేష్‌తో పాటు హిమాచల్‌ ప్రదేశ్‌ నివాసి ఆదిత్య శర్మ (23) ఉన్నారు. మూడవ బాధితుడు ఎవరనే పూర్తి వివరాలు వెలువడలేదు. సదరు బాధితుడు భారతీయుడేనని అధికారులు ధృవీకరించారు

Advertisement
 
Advertisement
Advertisement