సాక్షి టాస్క్‌ఫోర్స్: పేద దళితులకు ప్రభుత్వం కల్పించిన హక్కులను సైతం తమ స్వప్రయోజనాల కోసం వాడుకుంటూ, అధికార బలాన్ని అడ్డుపెట్టుకుని లబ్ధిదారుల నుంచి అక్రమ వసూళ్లకు తెగబడుతున్నారు స్థానిక టీడీపీ నాయకులు. పొన్నూరు మండలం మన్నవ గ్రామంలో ఎస్సీ కార్పొరేషన్ భూ పత్రాల పేరుతో దళిత కూలీలను బెదిరిస్తూ అక్రమ వసూళ్ల దందాను మొదలుపెట్డడంతో గ్రామంలో టీడీపీ నేతల అరాచకాలు బయటకు వస్తున్నాయి.
వైఎస్సార్ సీపీ హయాంలోనే హక్కులు
గతంలో ఎస్సీ కార్పొరేషన్ భూమి కొనుగోలు పథకం కింద మన్నవ గ్రామానికి చెందిన సుమారు 100 మంది దళిత వ్యవసాయ కూలీలు రుణాలు తీసుకుని భూములు కొనుగోలు చేశారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో ఈ రుణాలను పూర్తిగా మాఫీ చేయగా, అనంతరం వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి ప్రభుత్వం ఆ భూములపై ఉన్న ఆంక్షలను తొలగించింది. దళిత రైతులకు సర్వహక్కులు కల్పిస్తూ భూమి పత్రాలను మంజూరు చేసింది. అయితే అప్పట్లో పొన్నూరు టీడీపీ నాయకుల రాజకీయ దురుద్దేశంతో, వర్గపోరు కారణంగా ఆ పత్రాల పంపిణీ కాకుండా అడ్డుపడ్డారు.
సచివాలయంలోనే బరితెగింపు
ఇటీవల స్థానిక టీడీపీ నాయకుడి ఆదేశాలతో, కారుణ్య నియామకం పొందిన వీఆర్‌ఏ గ్రామంలోని దళిత లబ్ధిదారులను గ్రామ సచివాలయానికి రావాలని ఒత్తిడి తెచ్చారు. సచివాలయానికి వచ్చిన దళితులతో టీడీపీ నాయకుడు ‘మా నాన్న ఎస్సీ కార్పొరేషన్ డైరెక్టర్‌గా ఉన్నారు. మీ భూ బకాయిలను రద్దు చేయించి, పత్రాలు తెప్పించడానికి చాలా డబ్బులు ఖర్చు పెట్టాను. మీ పత్రాలను ఇవ్వాలంటే ఎమ్మార్వో కార్యాలయంలో, ఇంకో చోట మొత్తం రూ. 4,500 చెల్లించాలి’ అని హుకుం జారీ చేశారు.
రాత్రివేళల్లో తప్పని ఆందోళన
ప్రతి ఒక్కరి దగ్గర నుంచి రూ. 4500 వసూలు చేసేందుకు వీఆర్‌ఏతోపాటు మరో నలుగురితో ప్రత్యేక కమిటీని టీడీపీ నేత ఏర్పాటు చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. డబ్బులు ఇచ్చిన వారికే కలెక్టర్ చేతుల మీదుగా పత్రాలు ఇప్పిస్తాం.. లేకపోతే పత్రాలు టీడీపీ నేత వద్దే ఉంటాయని రాత్రివేళల్లో దళితుల ఇళ్లకు వెళ్లి బెదిరింపులకు దిగుతున్నారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇప్పటికే స్థానిక టీడీపీ నేతపై పలు చీటింగ్, భూకబ్జా, క్రిమినల్, మట్టిమాఫియా కేసులు నమోదై ఉన్నాయని, డబ్బులు ఇవ్వకపోతే తమ భూపత్రాలను తారుమారు చేస్తారేమోనని దళిత కూలీలు తీవ్ర భయాందోళనలు వ్యక్తం చేస్తున్నారు. సంబంధిత ఉన్నతాధికారులు స్పందించి, ఈ అక్రమ వసూళ్ల దందాపై విచారణ జరిపి దళితులకు న్యాయం చేయాలని స్థానికులు కోరుతున్నారు. దీనిపై పొన్నూరు తహసీల్దారు మొహమ్మద్ జియావుల్ హఖ్ స్పందిస్తూ వసూళ్ల విషయం తమ దృష్టికి రాలేదన్నారు. విచారణ జరిపి చర్యలు తీసుకుంటామని చెప్పారు.


