కొత్త బ్రిడ్జి నిర్మాణం పూర్తి చేసేదెన్నడో..! ఏడాదిగా పురోగతి లేని బ్రిడ్జి నిర్మాణ పనులు ప్రజల ఆకాంక్షలకు విరుద్ధంగా ఏకపక్షంగా బ్రిడ్జి కూల్చివేత ఐకానిక్ ఫ్లై ఓవర్ నిర్మించాల్సిన చోట సాధారణ ఆర్‌ఓబీకి పరిమితమైన టీడీపీ సర్కారు పైసా నిధులు ఇవ్వని రాష్ట్ర ప్రభుత్వం... కేంద్ర నిధులపైనే ఆధారం నగరంలో తీవ్ర ట్రాఫిక్ ఇబ్బందులు
పెమ్మసాని ‘ఓవర్’యాక్షన్‌తో..
గత ఏడాది ఆగస్టులో శంకర్ విలాస్ బ్రిడ్జి కూల్చివేత
గుంటూరు ఎడ్యుకేషన్: గుంటూరు నగరానికి ప్రత్యేక గుర్తింపు తెచ్చిన శంకర్ విలాస్ బ్రిడ్జి కనుమరుగై ఏడాది కావొస్తోంది. 70 ఏళ్ల పాటు ప్రజా రవాణాలో కీలకపాత్ర పోషించిన చారిత్రక శంకర్ విలాస్ రైల్వే ఓవర్ బిడ్జి విజన్ లేని టీడీపీ సర్కారు చర్యలతో కనుమరుగైంది. గుంటూరు అనగానే మొట్టమొదటిగా గుర్తుకు వచ్చే శంకర్ విలాస్ సెంటర్ తన ప్రాభవాన్ని కోల్పోయి ఏడాది గడిచింది.
ఐకానిక్ ఫ్లై ఓవర్ స్థానంలో సాధారణ ఆర్‌ఓబీ
పెరుగుతున్న నగర ప్రజల రవాణా అవసరాలకు అనుగుణంగా శంకర్‌విలాస్ ఆర్వోబీ స్థానంలో నాలుగు లైన్లతో నూతన ఆర్వోబీని నిర్మించేందుకు ప్రణాళిక రూపొందించిన టీడీపీ ప్రభుత్వం గతేడాది ఆగస్టు 9వ తేదీ నుంచి బ్రిడ్జిపై వాహనాల రాకపోకలు నిలిపివేసింది. అనంతరం క్రమక్రమంగా బిడ్జి కూల్చివేత పనులు చేపట్టింది. బ్రిడ్జి మీదుగా రాకపో కలు సాగించే ఆర్టీసీ, విద్యాసంస్థల బస్సులతో పాటు పరుకు రవాణా లారీలు, కార్లు, ద్విచక్ర వాహనాలను ఇతర మార్గాల్లోకి మళ్లించారు. అనంతరం నూతన బ్రిడ్జి నిర్మాణ పనుల్లోభాగంగా అరండల్‌పేట, బ్రాడీపేటను అనుసంధానం చేస్తూ ఉన్న రోడ్లను క్రమంగా మూసివేసి, పిల్లర్ల నిర్మాణాలను చేపట్టారు. రెండు వైపులా పిల్లర్ల నిర్మాణాలు చేపట్టడంతో బైక్‌లు, కార్లు, ఆటోలకు సైతం తీవ్ర ఇబ్బందులు ఎదురయ్యాయి. ముందు చూపులేని పాలకుల చర్యల తో 70 ఏళ్ల పాటు సేవలందించిన ఆర్‌ఓబీ చరిత్రగా మిగిలిపోయింది. నాలుగు లైన్లతో కూడిన బ్రిడ్జి నిర్మి స్తామని పనులు చేపట్టిన ప్రభుత్వం దానిని వచ్చే ఏడాది జూలై నాటికి అందుబాటులోకి తెస్తామని ప్రకటించినా, సాధ్యమయ్యే పరిస్థితులు కనిపించడం లేదు.
గుంటూరుకు ప్రత్యేక గుర్తింపు
గుంటూరు తూర్పు, పశ్చిమ నియోజకవర్గాలకు అనుసంధానంగా ఉన్న శంకర్‌విలాస్ బ్రిడ్జి ఒక ప్రత్యేకత సంతరించుకుంది. గుంటూరు నగరంలో ముఖ్యమైన కూడలిగా మారడంతో పాటు 10 లక్షలకు పైగా జనాభా ఉన్న గుంటూరు నగరంలో ప్రతి ఒక్కరు రోజులో ఒక్కసారి ఖచ్చితంగా తలచుకునే కీలకమైన ప్రాంతంగా మారింది. అయితే ఇది అంతా గతం. ప్రస్తుతం శంకర్ విలాస్ సెంటర్ ప్రాంతం కళను కోల్పోయింది. బ్రిడ్జి నిర్మాణ పనుల్లో రెండు వైపులా దుకాణాలను కూల్చివేయడంతో వ్యాపారులు ఆర్థికంగా దెబ్బతిన్నారు.
పైసా విదల్చని రాష్ట్రప్రభుత్వం
ఆర్‌ఓబీకి రాష్ట్ర ప్రభుత్వం పైసా నిధులు కూడా ఇవ్వలేదు. కేంద్రం ఇచ్చిన రూ.98 కోట్లతో రాజీపడి నిర్మిస్తున్న ఆర్వోబీ కారణంగా భవనాలు కోల్పోతున్న వ్యాపారస్తులు, యజమానులకు రూ.40 కోట్ల మేరకు నష్టపరిహారం చెల్లించాల్సి వచ్చిందని, ఆ మొత్తాన్ని కలుపుకొంటే ఐకానిక్ ఫ్లై ఓవర్ నిర్మించవచ్చునని బెటర్ శంకర్ విలాస్ ఫ్లె ఓవర్ జేఏసీ ప్రతినిధులు, వ్యాపార వర్గాలు మొత్తుకున్నా పాలకులు, అధికారులు ఖాతరు చేయలేదు. దీంతో పాటు బ్రిడ్జి నిర్మాణం కారణంగా భవనాలు కోల్పోయిన యజమానులకు నష్టపరిహారం చెల్లించకపోవడంతో పాటు ఆర్‌యూబీ నిర్మి స్తామని మాట తప్పిన అధికార యంత్రాంగానికి వ్యతిరేకంగా దాఖలు చేసిన కేసులు హైకోర్టులో విచారణలో ఉన్నాయి.
భవిష్యత్తు అవసరాలను దృష్టిలో ఉంచుకుని ప్రతిపాదించిన సాధారణ ఆర్వోబీ స్ధానంలో ఐకానిక్ ఫ్లె ఓవర్ నిర్మించాలని నగరంలోని వ్యాపార, వాణిజ్య, ఉద్యోగ, కార్మిక, ప్రజా సంఘాలు చేసిన విజ్ఞప్తులను ప్రభుత్వం బుట్టదాఖలు చేసింది. 70 ఏళ్ల క్రితం అప్పటి రవాణా అవసరాలకు అనుగుణంగా నిర్మించిన బ్రిడ్జి స్థానంలో రాబోయే వందేళ్ల ట్రాఫిక్, ప్రజా అవసరాలకు అనుగుణంగా ఐకానిక్ ఫ్లై ఓవర్ నిర్మించాలని చేసిన విజ్ఞప్తులు, డిమాండ్లను ఏ మాత్రం ఖాతరు చేయకుండా ఏక పక్షంగా ముందుకు వెళ్లింది. గుంటూరు ఎంపీ, కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ ఏకపక్ష చర్యలతో తాను అనుకున్నదే జరగాలనే మొండి పట్టుదలతో నగర ప్రజలు ఐకానిక్ ఫ్లై ఓవర్ ప్రాజెక్టును కోల్పోయారు. రూ.167 కోట్లతో 1.4 కిలోమీటర్ల పొడువుతో ప్రతిపాదించిన ఐకానిక్ ఫ్లె ఓవర్ స్థానంలో రూ.98 కోట్ల సేతు బంధన్ ప్రాజెక్టు ద్వారా 930 మీటర్లకు కుదించిన నాలుగు లైన్ల సాధారణ ఆర్వోబీగా మారిపోయింది. పెమ్మసాని మొండిపట్టుదలతో ముందు చూపులేకుండా బ్రిడ్జిని కూల్చడంతో నగరంలో ట్రాఫిక్ వ్యవస్థ కుదేలయింది. గతంలో సాఫీగా సాగిపోయే ట్రాఫిక్ నేడు ఏ రోడ్డుపై చూసినా పద్మవ్యూహాన్ని తలపిస్తోంది. రోడ్డుపైకి ఎందుకొచ్చాంరా దేవుడా.. అని వాహనచోదకులు అనుకునే స్థాయికి ట్రాఫిక్ అస్తవ్యస్తంగా తయారైంది.


