నెహ్రూనగర్: ఆంధ్రప్రదేశ్ స్టేట్ క్రియేటివిటీ, కల్చర్ కమిషన్ ఆధ్వర్యంలో ఈనెల 8, 9 తేదీల్లో రాష్ట్రంలోనే అతిపెద్ద కళా ఉత్సవం ‘అమరావతి చిత్రకళా వీధి’ గుంటూరులో అత్యంత ప్రతిష్టాత్మకంగా జరగనుంది. గురువారం నగర కమిషనర్ కె.మయూర్ అశోక్, క్రియేటివిటీ, కల్చర్ కమిషన్ చైర్‌పర్సన్ తేజస్వి పొడపాటితో కలిసి గుజ్జనగుండ్ల సెంటర్ నుంచి విద్యానగర్ వరకు వేదికల ప్రాంతాన్ని పరిశీలించారు. సందర్శకులు, కళాకారులకు ఎలాంటి అసౌకర్యం లేకుండా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. రోడ్లపై గుంతలు తక్షణమే పూడ్చాలని, నాలుగు చోట్ల మొబైల్ టాయిలెట్లు, ఉచిత తాగునీటి సదుపాయం కల్పించాలని సూచించారు. ప్రత్యేక పారిశుద్ధ్య బృందాలతో చెత్త తొలగింపు, ఫ్లెక్సీలు, బ్యానర్ల తొలగింపు, ట్రాఫిక్ నియంత్రణ చర్యలు చేపట్టాలని ఆదేశించారు. డిప్యూటీ కమిషనర్ బి.శ్రీనివాసరావు, ఎస్‌ఈ సుందర్రామిరెడ్డి, డీసీపీ సూరజ్ కుమార్, సిటీ ప్లానర్ రాంబాబు, ఎంహెచ్‌ఓ డాక్టర్ సురేష్ పాల్గొన్నారు.
స్వామివారికి పవిత్రములు సమర్పణ
పెదకాకాని: శివాలయంలోని భ్రమరాంబ సమేత మల్లేశ్వరస్వామి వారికి, పరివార దేవతలకు గురువారం శాస్త్రోక్తంగా పవిత్రములు సమర్పించారు. మల్లేశ్వరస్వామి సన్నిధిలో పవిత్రోత్సవాల్లో భాగంగా చివరి రోజు గురువారం ఉదయం 6 గంటల నుంచి పలు రకాల పూజలు నిర్వహించారు. ఏర్పాట్లను ఆలయ ఉప కమిషనర్ గోగినేని లీలాకుమార్ పర్యవేక్షించారు. భక్తులందరికీ తీర్థ ప్రసాదాలు పంపిణీ చేశారు. గంగా భ్రమరాంభ సమేత మల్లేశ్వరస్వామి వారికి పవిత్ర సమర్పణ క్రతువును ఆలయ స్థానాచార్యులు పొత్తూరి సాంబశివరావు, ప్రధాన అర్చకుడు పొత్తూరి లక్ష్మీనారాయణ వరప్రసాద్ ఆధ్వరంలో నిర్వహించారు. పవిత్రోత్సవాల సందర్భంగా సాయంత్రం గంగా భ్రమరాంబ సమేత మల్లేశ్వరస్వామి వార్లను ప్రత్యేకంగా పూలతో అలంకరించారు. పెదకాకాని పురవీధులలో గ్రామోత్సవం నిర్వహించారు. భక్తులు, గ్రామస్తులు అధిక సంఖ్యలో భ్రమరాంబ సమేత మల్లేశ్వరస్వామి వార్ల ఉత్సవ మూర్తులను దర్శించుకుని పూజా ద్రవ్యాలు సమర్పించారు. కార్యక్రమాలలో కంభంపాటి మల్లికార్జునరావు, కొమ్మూరి మల్లికార్జునరావు, భైరపనేని ధనలక్ష్మి, ధూపాటి శివశంకరరావు, వుల్లం రాజేశ్వరి, బండారు మల్లేశ్వరి, పేటేటి ధనమహేశ్వరప్రసాదు, గ్రామస్తులు, భక్తులు, సిబ్బంది పాల్గొన్నారు.
మంగళగిరి రూరల్: మంగళగిరిలోని ఎయిమ్స్‌లో ప్రత్యేక ప్లాస్టిక్ సర్జరీ బ్లాక్‌ను ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్, సీఈఓ ప్రొఫెసర్ అహంతేం శాంతాసింగ్ గురువారం ప్రారంభించారు. ఆయన మాట్లాడుతూ కొత్త విభాగంలో కాలిన గాయాల చికిత్స, పునర్నిర్మాణ శస్త్ర చికిత్సలు, మైక్రోసర్జరీ, హ్యాండ్ సర్జరీ, అవయవాల పునఃప్రతిస్థాపన, క్యాన్సర్ పునర్నిర్మాణం, పుట్టుకతో వచ్చే వైకల్యాల సవరణ వంటి ప్రత్యేక సేవలు అందుబాటులో ఉంటాయని చెప్పారు. ప్రస్తుతం రోజుకు సగటున 4,500 మంది ఔట్‌పేషెంట్లు, వారపు పని దినాల్లో 5 వేల మందికిపైగా వైద్య సేవలు పొందుతున్నారని, 2025–26లో 10 లక్షలకు పైగా ఔట్‌పేషెంట్ సేవలు, 30 వేలకుపైగా ఇన్ పేషెంట్ చికిత్సలు అందించినట్లు వివరించారు. ఐసీయూ పడకలను 118కు, ఎమర్జెన్సీ విభాగం పడకలను 60కు పెంచినట్లు తెలిపారు. త్వరలో 256–స్లైస్ సీటీ స్కానర్‌ను అందుబాటులోకి తీసుకురానున్నట్లు వెల్లడించారు. కార్యక్రమంలో మెడికల్ సూపరింటెండెంట్ ప్రొఫెసర్ రాజశేఖర్ మోహన్, డీన్ దేశు రామ మోహన్, డిప్యూటీ డైరెక్టర్ కల్నల్ శశికాంత్ తుమ్మల, అధ్యాపకులు, అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.


