చుండూరు రక్తక్షేత్రం వద్ద దళిత నేతల ప్రతిజ్ఞ
చుండూరు(తెనాలి): బాపట్ల జిల్లా వేమూరు నియోజకవర్గంలోని చుండూరులో దళితుల మారణకాండ కేసులో అగ్రకుల హంతకులకు శిక్షలు వేసేవరకూ దళితుల పోరాటం ఆగదని దళిత బహుజన ఫ్రంట్ జాతీయ అధ్యక్షుడు కొరివి వినయకుమార్ స్పష్టంచేశారు. చుండూరులోని రక్త క్షేత్రం వద్ద గురువారం జరిగిన దళిత అమర వీరుల 36వ సంస్మరణ సభలో వివిధ దళిత సంఘాల నాయకులు దళిత అమర వీరుల కుటుంబ సభ్యులు ఘనంగా నివాళులర్పించారు. గ్రామంలో ఐక్యత ర్యాలీ నిర్వహించారు. రక్తక్షేత్రం వద్ద జరిగిన సంస్మరణ సభకు చుండూరు బాధితుల పోరాట కమిటీ అధ్యక్షుడు జాలాది మోజెస్ అధ్యక్షత వహించారు. సభలో కొరివి వినయకుమార్ మాట్లాడుతూ చుండూరు కేసులో 35 ఏళ్లు గడిచినా హంతకులకు శిక్షలు వేయక పోవటం భారత న్యాయవ్యవస్థకే కళంకమని ఆందోళన వ్యక్తం చేశారు. అవసరమైతే దళిత మేధావుల బృందం ఢిల్లీలోని సుప్రీంకోర్టుకు తరలివెళ్లేందుకు సమాయత్తం చేస్తామని చెప్పారు.
అందరూ నిర్దోషులైతే నెత్తుటి నేరం ఎవరిది?
ఆర్‌పీఐ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు ఉప్పులేటి దేవిప్రసాద్ మాట్లాడుతూ హంతకులందరూ నిర్దోషులైతే ఈ నెత్తుటి నేరం ఎవరిదని, రక్తక్షేత్రం సాక్షిగా 35 ఏళ్లు గడచినా దళితులకు న్యాయం జరగక పోవటం అత్యంత విచారకరమన్నారు. సభలో చుండూరు కేసును న్యాయస్థానాల్లో వాదించిన న్యాయవాది భువనగిరి చంద్రశేఖర్, హైకోర్టు నుంచి సుప్రీం కోర్టు వరకు చుండూరు కేసును నడిపిన ప్రముఖ న్యాయవాది బొజ్జా తారకం, ఉద్యమ వీరుడు, ప్రజాయుద్ధనౌక గద్దరన్నకు శ్రద్ధాంజలి ఘటించారు. దళిత బహుజన ఫ్రంట్ జాతీయ ప్రధాన కార్యదర్శి మేళం భాగ్యరావు, దళిత హక్కుల పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షుడు నీలం నాగేంద్ర, దళిత మహా సభ రాష్ట్ర కార్యదర్శి నూకతోటి బాబురావు, బీసీకే పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్‌జే విద్యాసాగర్, కులనిర్మూలన పోరాట సమితి రాష్ట్ర కార్యదర్శి కృష్ణ, కారంచేడు బాధిత పోరాట కమిటీ కార్యదర్శి సీహెచ్ భగత్ సింగ్, టి.అశోక్, గోళ్ల అరుణ్ తదితరులు పాల్గొన్నారు .


