తెనాలిరూరల్: పట్టణ రైల్వేస్టేషన్ రోడ్డులోని ఓ మార్ట్‌లో స్టోర్ మేనేజర్‌గా పనిచేసిన వ్యక్తి సుమారు రూ.65 లక్షల సరుకు మాయం చేసిన ఘటనపై కేసు నమోదైంది. విజయవాడ కొత్తపేటకు చెందిన మల్లివాడ అవినాష్ ఇక్కడి మార్ట్‌లో స్టోర్ మేనేజర్‌గా పనిచేశాడు. సుమారు రూ.65 లక్షల సరుకు మాయమైనట్లు నిర్వాహకుల ఆడిట్‌లో కొద్ది కాలం క్రితం వెల్లడైంది. అప్పటి నుంచి విధులకు రాకుండా, లెక్కలు చెప్పకుండా పరారీలో ఉన్నాడు. త్రీ టౌన్ పోలీసులు గురువారం కేసు నమోదు చేశారు.
నకిలీ పత్రాలతో మోసం చేసిన వారిపై కేసు
పట్నంబజారు: నకిలీ పత్రాలతో స్థలం కొనుగోలు చేసేలా ప్రేరేపించిన ప్రభుత్వ ఉపాధ్యాయురాలు, ఆమె భర్తపై కేసు నమోదైంది. లాలాపేట పోలీసుల కథనం ప్రకారం దాచేపల్లి మండలం తక్కెళ్లపాడుకు చెందిన మిర్చి వ్యాపారి కిచ్చంశెట్టి వెంకటేశ్వర్లుకు గుంటూరులో గుండుబోయిన అశోక్ ద్వారా ప్రభుత్వ ఉపాధ్యాయురాలిగా పనిచేస్తున్న నల్లపనేని రత్నమాల, ఆమె భర్త శివరామ్‌ప్రసాద్‌తో పరిచయం ఏర్పడింది. ఖాళీ స్థళాన్ని చూపి వారిదేనని నమ్మించి నకిలీ పత్రాలు, సర్వే నంబర్లతో రూ.25 లక్షలకు విక్రయించారు. స్థలం సరిహద్దులు చూపించమని అడిగినా చూప లేదు. స్థలానికి చెందిన హక్కు పత్రం, స్వాధీనం, విక్రయం కాని రత్నమాల, శివప్రసాద్, అశోక్‌లకు ఆభూమితో ఎలాంటి సంబంధం లేదని బాధితుడు గుర్తించాడు. నకిలీ పత్రాలు సృష్టించి తనను మోసం చేశారని పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.


