వైఎస్ జగన్‌ను కలిసిన వైఎస్సార్‌సీపీ గిరిజన నేతలు | Ysrcp Tribal Leaders Meet Ys Jagan | Sakshi
Sakshi News home page

వైఎస్ జగన్‌ను కలిసిన వైఎస్సార్‌సీపీ గిరిజన నేతలు

Aug 6 2026 9:07 PM | Updated on Aug 6 2026 9:13 PM

Ysrcp Tribal Leaders Meet Ys Jagan

సాక్షి, తాడేపల్లి: గిరిజన చట్టాలు, ఆదివాసీల హక్కుల పరిరక్షణకు వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎల్లప్పుడూ కట్టుబడి ఉంటుందని.. ఈ విషయంలో రాజీపడే ప్రసక్తే లేదని వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ స్పష్టం చేశారు. గిరిజనుల హక్కులకు భంగం కలిగించే ప్రభుత్వ చర్యలను ఎప్పటికప్పుడు ప్రజల్లోకి తీసుకెళ్లడంతో పాటు ఆదివాసీల తరఫున బలమైన ప్రజాగొంతుకగా నిలవాలని పార్టీ ఎస్టీ సెల్‌ నాయకులకు సూచించారు.

వైఎస్సార్‌సీపీ ఎస్టీ సెల్‌ రాష్ట్ర అధ్యక్షురాలు, పాడేరు మాజీ ఎమ్మెల్యే కొట్టగుళ్లి భాగ్యలక్ష్మి, డాక్టర్‌ తమర్బ నర్సింగరావు దంపతులు గురువారం తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో వైఎస్‌ జగన్‌ను మర్యాదపూర్వకంగా కలిశారు. వారితోపాటు పార్టీ మైదాన ప్రాంత ఎస్టీ సెల్‌ అధ్యక్షుడు సురేంద్ర, ఎస్టీ సెల్‌ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శ్రీనివాస్‌ నాయక్‌ కూడా వైఎస్‌ జగన్‌ను కలిశారు. ప్రపంచ ఆదివాసీ దినోత్సవం సందర్భంగా ఆయనకు శుభాకాంక్షలు తెలియజేసి జ్ఞాపికను బహూకరించారు.

ఈ సందర్భంగా గిరిజన ప్రాంతాల్లో ఆదివాసీ చట్టాల పరిరక్షణ, జీవో నంబర్‌–3 పునరుద్ధరణ, 1/70 చట్టంపై గిరిజనేతరులు దాఖలు చేసిన కేసులు, బాక్సైట్‌ తవ్వకాలకు అనుమతులు, హైడ్రో పవర్‌ ప్రాజెక్టులపై గిరిజనుల్లో నెలకొన్న ఆందోళన తదితర అంశాలను వారు వైఎస్‌ జగన్‌కు వివరించారు. ఆయా అంశాలపై వారితో విపులంగా చర్చించిన వైఎస్‌ జగన్‌.. ఆదివాసీల ప్రయోజనాలకు వైఎస్సార్‌సీపీ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు.

వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు చంద్రబాబు ప్రభుత్వం తీసుకొచ్చిన జీవో నంబర్‌–97ను రద్దు చేసి ఆదివాసీల హక్కులకు రక్షణగా నిలిచిన విషయాన్ని ప్రజలకు గుర్తుచేయాలని వైఎస్‌ జగన్‌ సూచించారు. గిరిజనుల చట్టాలు, హక్కులకు భంగం కలిగించే ఏ చర్యనూ ఉపేక్షించబోమని ప్రభుత్వాన్ని హెచ్చరించాలన్నారు.

కూటమి ప్రభుత్వ పాలనలో గిరిజన చట్టాలు, హక్కుల భద్రతపై ఆదివాసీల్లో తీవ్ర ఆందోళన నెలకొందని వైఎస్‌ జగన్‌ పేర్కొన్నారు. ఇటీవల యువత చేపట్టిన ఉద్యమానికి లభించిన స్పందనే గిరిజనుల్లో నెలకొన్న ఆందోళనకు నిదర్శనమన్నారు. ఆదివాసీల హక్కులను కాపాడేందుకు వైఎస్సార్‌సీపీ తరఫున నిరంతరం పోరాటం చేయాలని, ప్రభుత్వంపై పోరాడే విషయంలో ఎక్కడా రాజీపడవద్దని కొట్టగుళ్లి భాగ్యలక్ష్మితో పాటు ఎస్టీ సెల్‌ నాయకులకు వైఎస్‌ జగన్‌ దిశానిర్దేశం చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement