సాక్షి,తాడేపల్లి : డీఎస్సీలో అక్రమాలు చేసి, ఆ తప్పుల నుంచి బయటపడేందుకే వెన్నుపోట్ల పార్టీ దాడుల్ని కొనసాగిస్తోందని వైఎస్సార్‌సీపీ స్టేట్ కోఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. డీఎస్సీ అక్రమాలపై కూటమి ప్రభుత్వ ఆటలు సాగవని. న్యాయ స్థానాల ద్వారా పోరాడుతామని ఆయన హెచ్చరించారు. అసలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రజాస్వామ్యం ఉందా? అని ప్రశ్నించారాయన.
సోమవారం తాడేపల్లిలోని వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయం నుంచి మాట్లాడిన సజ్జల.. డీఎస్సీ అక్రమాలపై శాంతియుతంగా నిరసన తెలుపుతున్న వైఎస్సార్‌సీపీ శ్రేణులపై కూటమి శ్రేణులు దాడులకు తెగబడుతున్న ఘటనలను ఆయన తీవ్రంగా ఖండించారు.
‘దబాయించడం, బుకాయించడమే కాదు... ఎదురుదాడికి దిగుతున్నారు. శాంతియుతంగా ధర్నాలు చేస్తున్న వారిపై దాడులకు తెగబడుతున్నారు. నియంతల పాలన సమయంలో కూడా ఇలా జరగలేదు. అబద్ధం, దుర్మార్గం, బరితెగింపు, క్రూరత్వం కలిపితే అది వెన్నుపోట్ల పార్టీ. చంద్రబాబుకు కొడుకు తోడయ్యాక ఈ పరిస్థితులు మరింత దిగజారాయి.
ఇదీ చదవండి : నిన్నెలా నమ్మాలి బాబూ?
డీఎస్సీ అభ్యర్థి కోర్టుకు వెళితే అసలు బండారం బయటపడింది. డీఎస్సీలో మోసపోయిన అభ్యర్థులకు న్యాయం చేయకపోతే ఎలా? డీఎస్సీలో ఎన్ని కుంభకోణాలు జరిగాయో అన్నీ ఇప్పుడు వెలుగులోకి వస్తున్నాయి. టెట్ పాస్ కానీ వారికి ఉద్యోగాలు ఇచ్చారు. సంబంధం లేని సబ్జెక్ట్‌లలోనూ ఉద్యోగాలు ఇచ్చారు. చివరికి పరీక్షా పేపర్లు కూడా అమ్ముకున్నారనే వార్తలు వచ్చాయి. మాపై దాడులు చేస్తూనే.. మరోవైపు ఉపాధ్యాయులపై వైఎస్సార్‌సీపీ నేతలే దాడులు చేస్తున్నారంటూ తప్పుడు ప్రచారాలు చేస్తున్నారు. తప్పు చేసి కూడా దబాయించాలని చూస్తున్నారు.
ఇక, ఎకనామిక్ బ్యాక్‌వర్డ్ క్లాసెస్ కోటాలో నకిలీ పత్రాలు సృష్టించారు. డీఎస్సీ అక్రమాల బేరసారాల వీడియోలు దొరికినా, వాటిని వదిలేసి కేవలం అనుమానితుడిపైనే కేసులు పెట్టారు. 'సెవెన్ స్టెప్స్' అంటే కూటమి ప్రభుత్వంలో వేరే అర్థం ఉంది. స్పోర్ట్స్ కోటాను దాటేసి మరీ అనర్హులకు ఉద్యోగాలు కట్టబెట్టారు. తాము చేసిన తప్పులను కప్పిపుచ్చుకోవడానికి వీటికి పొలిటికల్ కలర్ ఇస్తున్నారు’ అని ధ్వజమెత్తారు.


