
మక్కువ(విజయనగరం): మండలంలోని తూరుమామిడి గ్రామానికి చెందిన నూకమ్మ అలియాస్ ఉమ మంగళవారం తమ ఇంట్లో జరిగిన శుభ కార్యక్రమానికి తనతోపాటు డిగ్రీ చదువుతున్న ఫ్రెండ్స్‌ను ఆహ్వానించింది. స్నేహితులంతా కలిసి మంగళవారం ఆటపాటల్లో మునిగితేలారు. బుధవారం తన ఫ్రెండ్ షర్మిలకు సెండ్ ఆఫ్ ఇచ్చేందుకు గ్రామం నుంచి ద్విచక్ర వాహనంపై మక్కువ వెళ్తుండగా టాక్టర్ రూపంలో మత్యువు నూకమ్మను కబళించింది. అంతవరకు గ్రామంలో అందరితో కలివిడిగా ఉండి, ఫ్రెండ్‌ను మక్కువలో డ్రాప్ చేసి వస్తానని చెప్పి, తిరిగిరాని లోకానికి వెళ్లిపోయిందంటూ గ్రామస్తులు కన్నీరుమున్నీరయ్యారు. తూరుమామిడి గ్రామానికి చెందిన డిగ్రీ విద్యార్థిని
కురసాన నూకమ్మ అలియాస్ ఉమ(20) రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన ఘటనపై హెడ్ కానిస్టేబుల్ ఎస్. శ్రీనివాసరావు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. నూకమ్మ తన ఫ్రెండ్ షర్మిలకు సెండాఫ్ ఇచ్చేందుకు గ్రామం నుంచి మక్కువకు ద్విచక్ర వాహనంపై వెళ్తుండగా, మార్గమధ్యంలోని శాంతేశ్వరం గ్రామం సమీపంలో ఎదురుగా ట్రాక్టర్ మితిమీరిన వేగంతో వచ్చింది. టాక్టర్‌ను తప్పించే ప్రయత్నంలో ద్విచక్రవాహనం అదుపుతప్పి పడిపోవడంతో నూకమ్మ తలపై నుంచి ట్రాక్టర్ టైర్ వెళ్లగా అక్కడికక్కడే మృతిచెందింది. నూకమ్మ బొబ్బిలిలోని ఓ కళాశాలలో డిగ్రీ ప్రథమ సంవత్సరం చదువుతోంది. తండ్రి జనార్దనరావు ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాన్ని పోస్ట్‌మార్టం నిమిత్తం సాలూరు ఆస్పత్రికి తరలించారు.