ఫోన్ ధ్యాసలో గమ్యాన్ని మరిచిపోయిన విద్యార్థి
హడావుడిగా కదులుతున్న బస్సు నుంచి దూకడంతో మృతి
వినుకొండ: సెల్ ఫోన్ ధ్యాస ఓ విద్యార్థి ఊపిరి తీసింది. ఫోన్ చూసుకుంటూ వుండిపోవడంతో దిగాల్సిన స్టాప్ దాటిపోవడంతో కంగారులో కదులుతున్న బస్సు నుంచి దూకిన విద్యార్థి ప్రాణాలు కోల్పోయాడు. వినుకొండ రూరల్ మండలం విఠంరాజుపల్లి సమీపంలో జరిగిన ఈ హృదయ విదారక ఘటన కన్న వారికి పుత్ర శోకం మిగిల్చింది.వివరాలు... ప్రకాశం జిల్లా పుల్లల చెరువుమండలం నాయుడుపాలెం గ్రామానికి చెందిన లక్ష్మీరెడ్డి(16) గుంటూరు జిల్లా వినుకొండ దరి విష్ణుకుండినగర్‌లో బంధువుల ఇంటి వద్ద ఉండి స్థానిక బాలాజీ ఐటీఐ కళాశాలలో విద్యనభ్యసిస్తున్నాడు.
రోజూలాగానే కళాశాలకు వెళ్లేందుకు బుధవారం బస్సు ఎక్కిన లక్ష్మీరెడ్డి సెల్‌ఫోన్‌లో లీనమయ్యాడు. దిగాల్సిన బస్టాప్ వచ్చిన విషయాన్ని గమనించలేకపోయాడు. స్టాప్ దాటి బస్సు వెళ్తుండగా తేరుకుని డ్రైవర్‌ను బస్సు ఆపాలని కోరాడు. డ్రైవర్ బస్సు ఆపే ప్రయత్నం చేస్తుండగానే లక్ష్మీరెడ్డి బస్సులో నుంచి కిందకు దూకేశాడు. దీంతో నియంత్రణ కోల్పోయి రోడ్డుపై పడిపోవడంతో నడుము, వెన్నెముక భాగానికి తీవ్ర గాయాలయ్యాయి.
స్థానికులు వెంటనే కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. వారు ఘటనా స్థలానికి చేరుకొని లక్ష్మీరెడ్డిని ఆస్పత్రికి తరలించారు. కొంతసేపటికి విద్యార్థి మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. ప్రయాణ సమయంలో విద్యార్థులు జాగ్రత్తగా ఉండాలని పోలీసులు, పెద్దలు సూచిస్తున్నారు.


