
విజయవాడలోని ఎలక్షన్ కమిషనర్ కార్యాలయం వద్ద నిరసన తెలుపుతున్న వైఎస్సార్‌సీపీ నేతలు
ఎన్నికల కమిషన్ చేష్టలుడిగి చూస్తుండటం దారుణం
వైఎస్సార్‌సీపీ నేతల మండిపాటు
వినతి పత్రం ఇచ్చేందుకు వెళ్తుండగా అడ్డగించిన పోలీసులు
ఇంత దుర్మార్గం ఎక్కడా చూడలేదని నేతల నిరసన
తోపులాట, వాగ్వాదం.. అనంతరం లోపలికి అనుమతించిన వైనం
పులివెందుల జెడ్పీటీసీ ఎన్నిక నిర్వహణలో ఘోర వైఫల్యం
దౌర్జన్యాలు, దాడులపై ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా చర్యలు తీసుకోరా?
ఉప ఎన్నిక ప్రశాంతంగా జరిగేలా చూడాలని విజ్ఞప్తి
గాంధీనగర్ (విజయవాడ సెంట్రల్): వైఎస్సార్ జిల్లా పులివెందుల రూరల్ మండల జెడ్పీటీసీ ఉప ఎన్నికలో కూటమి ప్రభుత్వం ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తుంటే ఎన్నికల కమిషన్ చేష్టలుడిగి చూస్తుండటం దారుణమని వైఎస్సార్‌సీపీ ఆగ్రహం వ్యక్తం చేసింది. ఒక్క జెడ్పీటీసీ స్థానంలో ఎన్నికలు నిర్వహించడంలో యంత్రాంగం ఘోర వైఫల్యం చెందిందని మండి పడింది. దౌర్జన్యాలు, దాడులపై ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా చర్యలు తీసుకోరా? అని నిలదీసింది. పులివెందుల రూరల్ జెడ్పీటీసీ ఉప ఎన్నికను ప్రశాంతంగా నిర్వహించాలని కోరుతూ ఆ పార్టీ ప్రతినిధి బృందం శనివారం ఎన్నికల కమిషనర్ కార్యాలయంలో వినతి పత్రం సమర్పించేందుకు వెళ్తుండగా పోలీసులు అడ్డుకున్నారు.
వైఎస్సార్‌సీపీ మాజీ మంత్రులు పేర్ని నాని, మేరుగ నాగార్జున, ఎన్టీఆర్ జిల్లా పార్టీ అధ్యక్షుడు దేవినేని అవినాష్, ఎమ్మెల్సీలు లేళ్ళ అప్పిరెడ్డి, రమేష్కుమార్ యాదవ్, సూర్యనారాయణ రాజు, మాజీ ఎమ్మెల్యేలు కైలే అనిల్‌కుమార్, సుధాకర్‌బాబు, ట్రేడ్ యూనియన్ అధ్యక్షుడు పూనూరు గౌతంరెడ్డి, విజయవాడ మేయర్ రాయన భాగ్యలక్ష్మీ తదితరులను పోలీసులు బయటే ఆపేయడంతో తోపులాట జరిగింది. దీంతో వారంతా కార్యాలయం వద్ద బైఠాయించి నిరసన తెలిపారు. ఇంత దుర్మార్గం ఎక్కడా చూడలేదని నిప్పులు చెరుగుతూ వాగ్వాదానికి దిగారు.
‘ప్రజాస్వామ్యాన్ని రక్షించాలి.. పోలీసుల దౌర్జన్యం నశించాలి.. ఎన్నికల కమిషన్ పక్షపాత ధోరణి విడనాడాలి..’ అని నినాదాలు చేశారు. ఈ నేపథ్యంలో ఉద్రిక్త పరిస్థితి నెలకొనడంతో వారిని వినతిపత్రం అందజేసేందుకు పోలీసులు అనుమతించారు. పోలింగ్ బూత్‌లు మార్చడానికి వీల్లేదని, బైండోవర్ కేసులు పెట్టి కనిపించకుండా దాచిన వైఎస్సార్‌సీపీ నాయకులను విడుదల చేయాలని, సీసీ కెమెరాలు, వెబ్ క్యాస్టింగ్ చేయాలని వారు ఎన్నికల కమిషనర్‌కు విజ్ఞప్తి చేశారు. అనంతరం మీడియాతో మాట్లాడారు.
దయనీయం.. ఘోరం
రాష్ట్రంలో స్థానిక సంస్థలకు ఉప ఎన్నికలు జరుగుతున్న తీరు అత్యంత జుగుప్సాకరంగా, దయనీయంగా, ఘోరంగా ఉంది. టీడీపీ కూటమి ప్రభుత్వం ప్రజాస్వామ్యాన్ని ముక్కలు ముక్కలుగా నరుకుతుంటే కళ్లు, చెవులు మూసుకొని కమిషన్ ఏమీ పట్టనట్లు కళ్లు మూసుకుని నిద్ర నటిస్తోంది. ఎన్నికల కమిషన్ ఓటు హక్కును ప్రోత్సహించడం కోసం, ఓటింగ్ శాతం పెంచడానికి వ్యవస్థను ఓటర్ల వద్దకు తీసుకెళ్లాల్సింది పోయి.. పులివెందులలో అందుకు విరుద్ధంగా ఓటర్లకు దూరంగా పోలింగ్ కేంద్రాలను తీసుకెళుతుండటం దారుణం. – పేర్ని నాని, మాజీ మంత్రి
దేవుని దయవల్ల బతికి బయట పడ్డాను
బీసీ సామాజిక వర్గానికి చెందిన నాపై అతి ఘోరంగా బండరాళ్లు, సుత్తులతో దాడి చేశారు. పెట్రోలు పోసి నన్ను చంపేందుకు ప్రయతి్నంచారు. దేవుని దయతో బతికి బట్ట కట్టాను. జెడ్పీటీసీ ఉప ఎన్నికల్లో తామే గెలవాలనే ఉద్దేశంతోనే టీడీపీ నేతలు పోలింగ్ కేంద్రాలను ఒక ఊరి నుంచి మరో ఊరికి మార్చారు. – రమేష్ కుమార్ యాదవ్, ఎమ్మెల్సీ
ఈ అధికారం శాశ్వతమా?
పులివెందులలో ఒక జెడ్పీటీసీ సెగ్మెంట్ ఎన్నికల కోసం చంద్రబాబు ప్రత్యేక దృష్టి పెట్టి అక్రమాలకు తెరలేపారు. ఎన్నికలు నిర్వహిస్తోంది రాష్ట్ర ప్రభుత్వమా? ఎన్నికల కమిషనా? వినతి పత్రం ఇచ్చేందుకు వస్తే ఇక్కడ మమ్మల్ని పోలీసుల చేత నెట్టించే ప్రయత్నం చేయడం దారుణం. ఎందుకంత కండకావరం? ఈ అధికారం శాశ్వతమా? – టీజేఆర్ సుధాకర్ బాబు, మాజీ ఎమ్మెల్యే
పులివెందులలో రాజ్యాంగం అమలులో లేదు
పులివెందులలో రాజ్యాంగం అమలులో లేదు. అధికారులు వైఎస్సార్‌సీపీ నాయకులను ఇబ్బంది పెడుతున్నారు. ఎన్నికల కమిషనర్ అక్కడ ఏం జరుగుతుందో తెలుసుకోవాలి. – దేవినేని అవినాష్, ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షుడు