సింహాచలం (విశాఖ): ఉత్తరాఖండ్‌లోని ముస్సోరీలో అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన విశాఖకు చెందిన రాధాగాయత్రిది సాధారణ మరణం కాదని, అది తన అల్లుడు శ్రీచరణ్ చేసిన ప్రీప్లాన్డ్ మర్డర్ అని ఆమె తండ్రి సుధాకర్ ఆరోపించారు. కూతురు మృతిపై న్యాయ పోరాటం కోసం పది రోజులుగా ముస్సోరీలోనే ఉన్న ఆయన.. శుక్రవారం సింహాచలంలో జరిగిన రాధాగాయత్రి 12వ రోజు కర్మకాండకు హాజరయ్యారు.
ఆయన మీడియాతో మాట్లాడుతూ.. శ్రీచరణ్‌ది క్రిమినల్ బ్రెయిన్ అని, తప్పు చేయకపోతే ముస్సోరీ పోలీసులకు దొరకకుండా ఫోన్ స్విచాఫ్ చేసుకుని ఎందుకు పారిపోయాడని ప్రశ్నించారు. ఆరోగ్య సమస్యలంటూ తన కూతురిపై లేనిపోని నిందలు వేస్తూ శ్రీచరణ్ అందరినీ తప్పుదోవ పట్టిస్తున్నాడని మండిపడ్డారు. శ్రీచరణ్ ముస్సోరీ వెళ్లి పోలీసులను కలిశాడని అతని తల్లిదండ్రులు చెబుతున్నదంతా అబద్ధమని, చరణ్ విశాఖలోనే తిరుగుతున్నాడన్నారు. ముస్సోరీలో ఒక లాయర్‌ని కూడా శ్రీచరణ్ పెట్టుకున్నాడన్నారు. నడిరోడ్డుపై శ్రీచరణ్‌ను ఉరితీయాలని డిమాండ్ చేశారు.
రాధాగాయత్రి తల్లిదండ్రులు లేకుండానే మృతదేహాన్ని పంచనామాకు పంపించడం వెనుక శ్రీచరణ్ తల్లిదండ్రుల పాత్రపై కూడా తమకు ఎన్నో అనుమానాలు ఉన్నాయని సుధాకర్ కుటుంబసభ్యులు ఆరోపించారు.
చదవండి: శ్రీచరణ్ ఎక్కడున్నాడు?


